మీకు ఎడ్లు తెలుసా.. వడ్లు తెలుసా.

ABN , First Publish Date - 2022-06-11T09:26:57+05:30 IST

రైతులు నాగలి పట్టి, ఎడ్లతో దున్ని, పంట సాగు చేయడం గురించి తెలియని వాళ్లు కూడా అన్నదాతలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గు చేటని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

మీకు ఎడ్లు తెలుసా.. వడ్లు తెలుసా.

రాహుల్‌కు పబ్బులు తప్ప రైతుల గోస తెలియదు

రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ రాజకీయాలు 

కేంద్రం నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

గుజరాతీల గులాంలు.. రాష్ట్ర బీజేపీ నేతలు: కేటీఆర్‌


సిరిసిల్ల/మెట్‌పల్లి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రైతులు నాగలి పట్టి, ఎడ్లతో దున్ని, పంట సాగు చేయడం గురించి తెలియని వాళ్లు కూడా అన్నదాతలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గు చేటని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వరంగల్‌ వచ్చి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని.. ఆయనకు ఎడ్లు తెలుసా.. వడ్లు తెలుసా..? అంటూ ప్రశ్నించారు. రాహుల్‌కు క్లబ్బులు, పబ్బులు తప్ప.. రైతుల గోస తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నాయకులు వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహించి అన్నదాతలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మాట్లాడుతున్నారని.. 50 ఏళ్లు దేశాన్ని పాలించిన సమయంలో రైతుల గురించి గుర్తురాలేదా..? అని నిలదీశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో కోరుట్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్రానికి రూ.4.20 లక్షల కోట్లు ఇచ్చామని.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వచ్చి రూ.2.20 లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్నారని.. అసలు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు గుజరాతీల గులాంలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిధులను ఆపివేశారని ఆరోపించారు. మనం కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3.65 లక్షల కోట్లు కడితే, వారు తిరిగి ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లేనని వెల్లడించారు. బండి సంజయ్‌కి రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2వేల కోట్లు తీసుకురావాలని సవాల్‌ విసిరారు. 

Updated Date - 2022-06-11T09:26:57+05:30 IST