మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-08-11T07:12:18+05:30 IST

రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్‌ పండుగ సోదర సోదరీమణులకు అత్యంత పవిత్రమైన పండుగ.

మీకు తెలుసా?

రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్‌ పండుగ సోదర సోదరీమణులకు అత్యంత పవిత్రమైన పండుగ. దీనినే శ్రావణ పౌర్ణమి పండుగ అని కూడా అంటారు. అక్కకు తమ్ముడు, చెల్లికి అన్న.. ఒకరికొకరు అండగా ఉంటామనే భరోసా కల్పించే పండుగ రోజు ఇది. అనుబంధాలకు, ప్రేమానురాగాలకు చిహ్నంగా జరిపే ఈ పండుగ రోజున ఆడపిల్లలు తన తమ్ముడు లేదా అన్నయ్యకు రాఖీ కడతారు. ఇందుకుగానూ తోబుట్టువులు బహుమతులు ఇస్తారు. ఒకరికొకరు తీపి పదార్థాలు తినిపించుకుంటారు. ఎల్లవేళలా తోబుట్టువులు కలిసి మెలిసి ఉండాలని గుర్తు చేసే పండుగ రాఖీ పౌర్ణమి! ఈ పండుగ వెనకాల అనేక కథలున్నాయి. అయితే అలెగ్జాండర్‌ భార్య-పురుషోత్తముడి కథ మనం తెల్సుకుందాం.


క్రీస్తుశకం 326న ప్రపంచాన్ని ఏలాలని గ్రీకువీరుడు అలెగ్జాండర్‌ బయలుదేరాడు. కొద్ది దేశాలకే కాదు.. ప్రపంచాన్నంతా తన గుప్పిట పెట్టుకుని.. జగజ్జేతగా నిలవాలని అతని ఆశ. అందరినీ ఓడిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌ చేరుకున్నాక రోక్సానా అనే యువరాణి నచ్చి ఆమెను పెళ్లాడాడు. ఆమె రాజ్యం ఆసరాతో జీలం, చినాబ్‌ మధ్య రాజ్యాలను జయించాలనుకున్నాడు. అదే సమయంలో పురుషోత్తముడి పరాక్రమం చూసి ఓర్వలేక.. కొందరు శతృరాజులు అలెగ్జాండర్‌ను భరతదేశంపై దండెత్తాలని కబురు పంపారు. పురుషోత్తముడు యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. పురుషోత్తముడి శక్తిసామర్థ్యాలు తెలిసిన ఆ ఆఫ్ఘనీ యువరాణి తన భర్తను చంపవద్దని కోరుతుంది. పురుషోత్తముడిని సొంత అన్నలా భావించి రాఖీ కడుతుంది. దీంతో అలెగ్జాండర్‌ ఓడిపోయినా చంపకుండా వదిలేశాడు పురుషోత్తముడు. అదీ.. రాఖీకి ఉన్న గొప్పదనం! 

Updated Date - 2022-08-11T07:12:18+05:30 IST