ఆర్టీఐలో ఓనమాలూ తెలియవా?

ABN , First Publish Date - 2022-06-15T08:38:34+05:30 IST

ఈ దరఖాస్తుకు సమాధానంఇచ్చింది జూనియర్‌ అధికారులో, తాత్కాలిక ఉద్యోగులో కాదు. రెవెన్యూ, ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్‌ అధికారులు.

ఆర్టీఐలో ఓనమాలూ తెలియవా?

  • కనీస అవగాహన లేని ఉన్నతాధికారులు!
  • స్వచ్ఛందంగా చెప్పాల్సిన సమాచారమూ ఇవ్వరు
  • చిన్న సమాచారం కోసం నెలల తరబడి నిరీక్షణ
  • ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం.. రాష్ట్రంలో అమలే కష్టం!
  • సమాచార కమిషన్‌ మొద్దు నిద్ర.. అమలో ్లవిఫలం


ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారుల వివరాలు అందించాలని హైదరాబాద్‌ బర్కత్‌పురకు చెందిన కరీమ్‌ అన్సారీ 3 నెలల క్రితం దరఖాస్తు చేశారు. సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 4(1)(బి) ప్రకారం ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే.. సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వమే స్వచ్ఛందంగా వెబ్‌సైట్లో ప్రకటించాల్సి ఉంది. అలా చేయకపోగా సమాచారం కోరిన దరఖాస్తునూ తిరస్కరించారు. ఆర్టీఐ సెక్షన్‌ 2(ఎఫ్‌) ప్రకారం ఈ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇది చట్టం పరిధిలోకి రాదని తమ అవగాహనా లేమిని చాటుతూ రెవెన్యూ శాఖ సహాయ కార్యదర్శి లిఖితపూర్వక జవాబిచ్చారు. సెక్షన్‌ 2(ఎఫ్‌)లో సమాచారం ఇవ్వకూడదని ఎక్కడా లేకపోవడం గమనార్హం.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది అవినీతి అధికారులను పట్టుకున్నారు? వారి నుంచి ఎంత సొమ్ము స్వాధీనం చేసుకున్నారు? దాన్ని ఏం చేశారో చెప్పాలంటూ నగరానికి చెందిన రాజేంద్ర.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్ర కార్యాలయానికి గత నెలలో దరఖాస్తు చేశారు. దీనికి ‘మీరు కోరిన సమాచారం ఆర్టీఐ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత మాపై లేదు. సమాచారం ఇవ్వడం కుదరదు’ అని ఏసీబీ పరిపాలనా అధికారి పి.రాఘవరావు చట్టానికి పూర్తి విరుద్ధమైన సమాధానం ఇచ్చారు.


దరఖాస్తుకు సమాధానంఇచ్చింది జూనియర్‌ అధికారులో, తాత్కాలిక ఉద్యోగులో కాదు. రెవెన్యూ, ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్‌ అధికారులు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నవారు. సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులకే కనీస అవగాహన లేదంటే.. ఇక జిల్లా, మండల  స్థాయిల్లో అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2015 నుంచి రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ పథకానికి ఎమ్మెల్యేల ద్వారా అందిన దరఖాస్తుల సంఖ్యను నియోజకవర్గాల వారీగా తెలపాలని.. మంజూరు, తిరస్కరణతో తోపాటు పెండింగులో ఉన్న దరఖాస్తుల వివరాలనూ తెలియజేయాలని, దరఖాస్తుదారుల పేర్లను వెల్లడించాలని హైదరాబాద్‌కు చెందిన అన్సారీ ఆర్టీఐ దరఖాస్తులో కోరారు. ఈ సమాచారాన్ని గరిష్ఠంగా 30 రోజుల్లో ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దేశ భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమైతేనే ఆర్టీఐ కింద సమాచారాన్ని ఇవ్వబోమని చెప్పొచ్చు. కానీ, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారుల జాబితా ఆర్టీఐ పరిధిలోకి రాదని ఉన్నతాధికారి సమాధానం ఇవ్వడం విశేషం. ఇందుకు ఆయన చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌)ను ఉదహరించారు. 


వాస్తవానికి దరఖాస్తు తిరస్కరణకు, ఈ సెక్షన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. ఆర్టీఐ చట్టంలో ‘సమాచారం’ అన్న పదానికి వివరణను మాత్రమే ఈ సెక్షన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సైతం చట్టంపై కనీస అవగాహన లేదనడానికి ఇదే నిదర్శనం. సహ చట్టంపై కనీస పరిజ్ఞానం లేకపోవడంతో ప్రజోపయోగ దరఖాస్తుల సమాచారాన్ని అధికారులు తిరస్కరించడమో, పెండింగులో ఉంచడమో చేస్తున్నారు. సమాచారం ఇస్తే తమకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో దరఖాస్తులకు స్పందించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమాచారం కోసం ప్రజలు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గరిష్ఠంగా 30 రోజుల్లో రావాల్సిన వివరాల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రంగా పేర్కొంటున్న ఈ చట్టం అసలు రాష్ట్రంలో అమలవుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


శిక్షణ లేదు.. సమీక్షల్లేవు.. 

సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా 2005 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చట్టం అమలుకు అప్పటి ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయి. ప్రతి ప్రభుత్వ శాఖలో ఈ చట్టం బాధ్యతలను చూసే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి సమాచార, సహాయ సమాచార అధికారులకు ఏటా ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. గడువులోపు సమాచారం ఇవ్వని అధికారులకు జరిమానాలు విధించేది. దీంతో అధికారులు చట్టం అమల్లో ప్రత్యేక శ్రద్ధ చూ పించేవారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత మూడేళ్ల వరకు అసలు సమాచార కమిషన్‌నే నియమించలేదు. 2017లో ఇద్దరు కమిషనర్లను, 2020లో మరో ఐదుగురిని నియమించినా.. చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో కమిషన్‌ విఫలమైంది. ఐదేళ్లుగా మొద్దు నిద్రలో ఉంది. ప్రతి ప్రభుత్వ శాఖ స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం గురించి కమిషన్‌ పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో చట్టం అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. సమాచారం కావాలని తెల్లకాగితంపై రాసిన ఒక దరఖాస్తుతో ఇతర రాష్ట్రాల్లో సామాన్యులు అనేక కుంభకోణాలను వెలుగులోకి తెస్తుండగా.. రాష్ట్రం లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. 


చట్టంలో ఏముంది..? 

సమాచార హక్కు చట్టం సెక్షన్‌ 4(1)(బి): ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలోని సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల సమాచారం, నిధుల వినియోగ వివరాలను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలి. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. సమాచారం కోసం ప్రజలు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే అధికారులు ఈ ఏర్పాట్లు చేయాలి. 

సెక్షన్‌ 4(1)(బి) 1, 2: ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది 

పేర్లు, హోదాలు, అధికారిక ఫోన్‌ నెంబర్లు, ఈ-మెయిల్‌ వివరాలతో పాటు నిర్వర్తించే విధులు, బాధ్యతలను వెబ్‌సైట్లో తెలపాలి. ప్రతి నెలా వారు తీసుకుంటున్న జీతభత్యాలనూ వివరించాలి. 

సెక్షన్‌ 7(1): పౌరులు కోరిన ప్రతి సమాచారాన్నీ (దేశ భద్రత సమాచారం మినహా) గరిష్ఠంగా 30 రోజుల్లోపు అందించాలి. వ్యక్తి జీవితం, స్వేచ్ఛకు సంబంధించిన అంశమైతే అత్యవసర సమాచారంగా భావించి గరిష్ఠంగా 48 గంటల్లోపు ఇవ్వాల్సిందే. 

సెక్షన్‌ 19(1): అధికారి 30 రోజుల్లో సమాచారం ఇవ్వని పక్షంలో పౌరులు పై అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని మొదటి అప్పీలేట్‌ అథారిటీ అంటారు. 

సెక్షన్‌ 19(3): తొలి అప్పీలేట్‌లోనూ 30 రోజుల్లో సమాచారం రాకపోతే సెకండ్‌ అప్పీలేట్‌ అథారిటీ అయిన రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడంలో విఫలమైన ప్రజా సమాచార అధికారికి సెక్షన్‌-20 ప్రకారం గరిష్ఠంగా రూ.25 వేల జరిమానా, క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఉంది. 

Updated Date - 2022-06-15T08:38:34+05:30 IST