New Rules From Sep 1: సెప్టెంబర్ 1 వచ్చేసింది.. ఈ ఏడు మారబోతున్నాయ్.. మీ పాకెట్ సేఫో.. కాదో చూసుకోండి..

ABN , First Publish Date - 2022-09-01T17:44:05+05:30 IST

2022 సంవత్సరంలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయింది. ఆగస్ట్ 31, 2022 నుంచి సెప్టెంబర్ 1, 2022 లోకి కాలచక్రం మారింది. ప్రతీ నెలలో ఒకటో తేదీ వస్తుందంటే చాలు..

New Rules From Sep 1: సెప్టెంబర్ 1 వచ్చేసింది.. ఈ ఏడు మారబోతున్నాయ్.. మీ పాకెట్ సేఫో.. కాదో చూసుకోండి..

2022 సంవత్సరంలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయింది. ఆగస్ట్ 31, 2022 నుంచి సెప్టెంబర్ 1, 2022 లోకి కాలచక్రం మారింది. ప్రతీ నెలలో ఒకటో తేదీ వస్తుందంటే చాలు కొత్తగా కొన్ని నిర్ణయాలు, నిబంధనలు ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంటాయి. ఆ మార్పులేంటో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటూ మధ్య తరగతి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. అందుకు కారణం లేకపోలేదు. ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొన్ని రూల్స్ మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడేందుకో లేదా ఊరట కలిగించేందుకో కారణం కావచ్చు. అందువల్ల.. ఒకటో తారీఖు నుంచి అప్‌‌డేట్ అయ్యే రూల్స్ ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్రతి నెల మాదిరిగానే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా కొన్ని రూల్స్ అమల్లోకి రానున్నాయి. అవేంటో, ఆ మార్పుల కారణంగా మీ జేబులో డబ్బు ఖర్చవుతుందో, ఆదా అవుతుందో తెలుసుకునేందుకు ఈ ఏడు అంశాలపై ఒక లుక్కేయండి..



వంట గ్యాస్ ధరల్లో (LPG Price) మార్పులకు అవకాశం: 

వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతీ నెలా ఒకటో తేదీ మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. పెట్రోలియం కంపెనీలు సెప్టెంబర్ 1వ తేదీన గ్యాస్ ధరల్లో మార్పులుచేర్పులు చేస్తాయి. ఆ మార్పుల్లో భాగంగానే వాణిజ్య సిలిండర్‌పై రూ.91.50 పైసలు తగ్గింది. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్‌పై రూ.100 తగ్గింది. అయితే.. డొమెస్టిక్ సిలిండర్‌ ధరలో పెట్రోలియం కంపెనీలు ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.


మరింత ప్రియం కానున్న కార్ల ధరలు: 

కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి మాత్రం సెప్టెంబర్ నెల కాస్తంత అదనపు భారాన్నే మోపనుందని చెప్పక తప్పదు. Audi లాంటి ప్రీమియం రేంజ్ కార్లు కొనాలనే ప్లాన్‌లో ఉన్నవారికి సెప్టెంబర్ 20, 2022 నుంచి కొంత గడ్డుకాలమే. Audi కార్ల  ధరలు సెప్టెంబర్ 20 నుంచి 2.4 శాతం పెరగనున్నాయి.


ఇన్సూరెన్స్ ఏజెంట్లకు తగ్గనున్న కమీషన్: 

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) రూల్స్ సెప్టెంబర్ నుంచి మారనున్నాయి. ఇప్పటివరకూ ఏజెంట్ 30 నుంచి 35 శాతం కమీషన్ పొందే అవకాశం ఉండేది. కానీ.. కొత్తగా మారిన రూల్స్ ప్రకారం ఏజెంట్ కేవలం 20 శాతం కమీషన్ మాత్రమే పొందగలుగుతాడు. ఈ కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్ mid-September నుంచి అమల్లోకి రానుంది.


పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేవైసీ అప్‌డేట్:

గత కొన్ని నెలలుగా బ్యాంకులు తమ కస్టమర్లను KYC విషయంలో అప్‌డేట్ చేసుకోవాలని అలర్ట్ చేస్తూ వచ్చాయి. కేవైసీ అప్‌డేట్ చేస్తేసే బ్యాంకు ఖాతా, కార్యకలాపాలు సజావుగా సాగుతాయని బ్యాంకులు స్పష్టం కూడా చేశాయి. అలాగే.. కేవైసీ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) కూడా కస్టమర్లను అలర్ట్ చేసింది. ఆగస్ట్ 31, 2022 లోపు కేవైసీని తమ ఖాతాదారులు అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది. అప్‌డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వాస్తవంగా ఒక నెల క్రితం నుంచే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ అలర్ట్‌ను కస్టమర్లకు పంపించింది.


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అప్‌డేట్:

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా లబ్ది పొందుతున్న రైతులు ఆగస్ట్ 31, 2022 లోపు eKYC అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్‌డేట్ చేసుకోని పక్షంలో అకౌంట్‌ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల.. eKYC అప్‌డేట్ చేయని రైతులు 12వ విడతలో పొందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సొమ్ము చేతికందడంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.


పెరగనున్న టోల్ ఛార్జీలు:

ఇటీవల యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ టోల్ ట్యాక్స్ పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యమున ఎక్స్‌ప్రెస్‌వేపై ఢిల్లీకి వెళ్లే వారు కిలోమీటరుకు 10 పైసలు అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించక తప్పదు. కార్లు అయితే 10 పైసలు, లారీలు లాంటి పెద్ద వాహనాలైతే కిలోమీటరుకు 52 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.


ఘజియాబాద్‌లో ఇళ్లు, స్థలాలు ఇకపై మరింత కాస్ట్లీ:

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇకపై ఆస్తులు కొనడం కాస్తంత కాస్ట్లీ వ్యవహారమనే చెప్పక తప్పదు. అందుకు కారణం లేకపోలేదు. ఘజియాబాద్‌లో సర్కిల్ రేటు పెంచుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఘజియాబాద్‌లో సర్కిల్ రేటు 2 నుంచి 4 శాతం మధ్య పెరగనుంది. ఈ పెరిగిన సర్కిల్ రేటు సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి రానుంది. దీంతో.. ఘజియాబాద్‌లో ఇళ్లు, ప్లాట్లు కొనాలంటే ఇప్పటివరకూ ఉన్న ధరలతో పోల్చుకుంటే కాస్తంత ఎక్కువ చెల్లించక తప్పని పరిస్థితి.

Updated Date - 2022-09-01T17:44:05+05:30 IST