బీజేపీ విజయంతో యూపీ ముస్లిం యువత ఏం చేస్తున్నారంటే...?

ABN , First Publish Date - 2022-03-17T19:10:25+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న

బీజేపీ విజయంతో యూపీ ముస్లిం యువత ఏం చేస్తున్నారంటే...?

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న యోగి ఆదిత్యనాథ్‌ పట్ల ఆగ్రా యువతలో గొప్ప క్రేజ్ మొదలైంది. హిందూ, ముస్లిం యువత బుల్డోజర్ టట్టూలను వేయించుకుంటున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బుల్డోజర్ పని తీరు గురించి ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 


ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై గడచిన ఐదేళ్ళలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేసింది. దీంతో బుల్డోజర్లకు క్రేజ్ ఏర్పడింది. యోగి ఆదిత్యనాథ్‌ను బుల్డోజర్ బాబా అని ఆయన అనుకూలురు, వ్యతిరేకులు పిలుస్తున్నారు. మార్చి 10న విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 255 స్థానాలను దక్కించుకుంది. ఎన్డీయే కూటమికి 273 స్థానాలు లభించాయి. దీంతో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ విజయోత్సవ వేడుకలను జరుపుకునేందుకు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బుల్డోజర్లను తీసుకొచ్చారు. ఎన్నికల ప్రచార సభల ప్రాంగణాల్లో కూడా బుల్డోజర్లను పార్క్ చేసేవారు. 


దీంతో యువతకు బుల్డోజర్లు ఆకర్షణీయంగా మారాయి. మతపరమైన తేడాలేవీ లేకుండా ఆగ్రాలోని హిందూ, ముస్లిం యువత యోగి ఆదిత్యనాథ్, బుల్డోజర్ చిత్రాలను తమ శరీరాలపై పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. 


డానిష్ ఖాన్ అనే యువకుడు మీడియాతో మాట్లాడుతూ, తాను యోగి ఆదిత్యనాత్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు పెద్ద ఫ్యాన్‌నని తెలిపారు. ముస్లింలు బీజేపీని శత్రువుగా చూస్తున్నప్పటికీ, తాను దానిని నమ్మబోనని చెప్పాడు. గడచిన ఐదేళ్ళలో యోగి ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, ఇటువంటి కృషి గత ప్రభుత్వాల కాలంలో జరగలేదని చెప్పారు. అదేవిధంగా గత ఐదేళ్ళలో ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయని, ముస్లింలు కూడా లబ్ధి పొందారని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో నేరగాళ్ళు ఉంటే జైల్లో ఉన్నారని, లేదంటే, పారిపోయారని చెప్పారు. ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల ముస్లిం మహిళలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. 


Updated Date - 2022-03-17T19:10:25+05:30 IST