న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధి బిల్లులు ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-08-03T04:59:44+05:30 IST

ఉపాధి హామీ ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని సాక్షాత్తు న్యాయస్థానం ఆదేశించినా కూడా ప్రభుత్వం స్పందించడంలేదని, అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే ఏళ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటూ ముఖ్యమంత్రి జగన్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

న్యాయస్థానాలు ఆదేశించినా   ఉపాధి బిల్లులు ఇవ్వరా?
కలెక్టరేట్‌ వద్ద టీడీపీ నేతల నిరసన

అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు

కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తారా?

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి తిరోగమనం

నిరసనలో టీడీపీ నేతలు

కడప, ఆగష్టు 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ ద్వారా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని సాక్షాత్తు న్యాయస్థానం ఆదేశించినా కూడా ప్రభుత్వం స్పందించడంలేదని, అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే ఏళ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటూ ముఖ్యమంత్రి జగన్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కమిటీపిలుపు మేరకు ఉపాధి బిల్లులు చెల్లించాలంటూ సోమవారం జిల్లాలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రం అందించారు. టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌, రాంగోపాల్‌రెడ్డి, కడప అసెంబ్లీ ఇన్‌చార్జి వీఎస్‌ అమీర్‌బాబు, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు కడప కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం జేసీ గౌతమికి వినతిపత్రం అందించారు. జమ్మలమడుగులోఎమ్మెల్సీ బీటెక్‌ రవి ర్యాలీగా వెళ్లి ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. రాజంపేటలో మాజీ ఎవ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, చెన్నూరు సుధాకర్‌ ర్యాలీ నిర్వహించి ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. రైల్వేకోడూరులో ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథనాయుడు, బద్వేలులో ఓబులాపురం రాజశేఖర్‌, ప్రొద్దుటూరులో అసెంబ్లీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, సంబేపల్లెలో రెడ్డయ్యయాదవ్‌, మైదుకూరులో దస్తగిరి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాలు అందించారు. 

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి నిధులతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దారన్నారు. మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 350జీవో తీసుకువచ్చి వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులు నిలిపివేశారన్నారు. అంతేకాకుండా 2019 జూన్‌ 1 నుంచి చేసిన పనులకే బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇది ఉపాధి చట్టానికి విరుద్ధమన్నారు. టీడీపీ హయాంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి కోసం పనులు చేపట్టారన్నారు. కేవలం కక్ష సాఽధింపు కోసం వీరి బిల్లులు నిలిపివేశారన్నారు. బిల్లులు రాక వడ్డీలు కట్టుకోలేక పనులు చే సిన కాంట్రాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. ఆగష్టు 1లోపు బిల్లులు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఉపాధి నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు రాషా్ట్రనికి వచ్చాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం తిరోగమనం పాలైందన్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-03T04:59:44+05:30 IST