ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో శుభవార్త!

ABN , First Publish Date - 2021-04-07T20:54:57+05:30 IST

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఇదిగో శుభవార్త!

ముంబై : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బుధవారం ప్రకటించిన పరపతి విధానాన్ని పరిశీలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ రేట్లు మరింత తగ్గుతాయేమోనని ఆందోళన చెందేవారికి ఇది శుభవార్తే! 


కీలక రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ బుధవారం నిర్ణయించింది. రెపో రేటు, రివర్స్ రెపో రేటు వరుసగా ఐదోసారి యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇటీవల పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగానూ, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానూ కొనసాగుతాయి. రెపో రేటు గత రెండు దశాబ్దాల్లో కనిష్ట స్థాయిలో ఉండటం వల్ల రుణాలు తీసుకునేవారికి శుభసూచకమే. 


రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం వల్ల బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదు. ప్రస్తుత వడ్డీ రేట్లు కొనసాగవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు డిమాండ్, సప్లయ్ ఆధారంగా కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లను మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎఫ్‌డీ రేట్లు చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. వీటిని బ్యాంకులు మరింత తగ్గించే అవకాశం లేదని అంటున్నారు. అయితే రుణాలిచ్చే కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీల మీద వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. భారతీయ స్టేట్ బ్యాంకు జనవరిలో ఒక సంవత్సరం నుంచి రెండేళ్ళలోపు కాలపరిమితిగల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. మిగిలిన బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం కనిపిస్తోంది.


Updated Date - 2021-04-07T20:54:57+05:30 IST