వ్యాక్సినేషన్‌ వేగం సరిపోదు

ABN , First Publish Date - 2021-07-09T17:46:39+05:30 IST

మన దేశంలో 60% మందికి టీకాలిస్తేగానీ.. కరోనా ముప్పు పూర్తిగా తగ్గే అవకాశం లేదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సారథి, పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.శ్రీనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రస్తుత వ్యాక్సినేషన్‌ వేగం సరిపోదన్నారు. రోజుకు కనీసం కోటి మందికి టీకాలి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు

వ్యాక్సినేషన్‌ వేగం సరిపోదు

రోజూ కోటి మందికి ఇవ్వాలి

60% మందికి టీకాతోనే సేఫ్‌

అజాగ్రత్తతో ముందే థర్డ్‌వేవ్‌

‘ఆంధ్రజ్యోతి’తో పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.శ్రీనాథ్‌ రెడ్డి


మన దేశంలో 60% మందికి టీకాలిస్తేగానీ.. కరోనా ముప్పు పూర్తిగా తగ్గే అవకాశం లేదని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సారథి, పద్మభూషణ్‌ డాక్టర్‌ కె.శ్రీనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రస్తుత వ్యాక్సినేషన్‌ వేగం సరిపోదన్నారు. రోజుకు కనీసం కోటి మందికి టీకాలి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. వైర్‌సలో ఊహించని మార్పులు జరిగినా.. మనం జాగ్రత్తలు విస్మరించినా.. అంచనాల కంటే ముందే థర్డ్‌వేవ్‌ వచ్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల నుంచే మూడోవేవ్‌ మొదలయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అక్కడక్కడా వ్యాప్తి చెందుతున్నా.. అది ఎంత ప్రమాదకరమనే అంశంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు. మరికొన్ని వేరియంట్లు కనిపిస్తున్నా.. అవి అంత ప్రమాదకరం కాదంటున్న ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలను వెల్లడించారు.


సెకండ్‌ వేవ్‌ ప్రమాదం తొలగిపోయిందా?

అలా అని చెప్పలేం. కానీ, తగ్గుముఖం పట్టింది.  మణిపూర్‌, అరుణాచల్‌, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, రాజస్థాన్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.


థర్డ్‌వేవ్‌ ఎప్పుడొచ్చే అవకాశాలున్నాయి?

సూత్ర మోడల్‌ ప్రకారం అక్టోబరు - నవంబరులో థర్డ్‌వేవ్‌ వస్తుందంటున్నారు. ఆగస్టు నుంచే ఆ ముప్పు ఉందని ఎస్‌బీఐ అధ్యయనం చెబుతోంది. వైర్‌సలో మార్పులు, ప్రజల్లో అప్రమత్తత ఆధారంగానే థర్డ్‌వేవ్‌ ఎప్పుడనే అంశాన్ని నిర్ధారించగలం. వైర్‌సలో ఊహాతీత మార్పులు, ప్రజల్లో అజాగ్రత్తతో ఆ ముప్పు ముందే వచ్చే ప్రమాదముంది. వ్యాక్సినేషన్‌, ప్రజల్లో జాగ్రత్తలే థర్డ్‌వేవ్‌కు కళ్లెం వేయగలవు.


ముప్పు తగ్గాలంటే ఎంత జనాభాకు టీకాలివ్వాలి?

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమై ఏడు నెలలైంది. ఇప్పటికి 5ు లోపు ప్రజలకే వ్యాక్సిన్‌ రెండు డోసులు అందింది. 21ు మంది ఒకటో డోసు తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకాలు అందుబాటులో లేవు. ఒకటి రెండు నెలల్లో వ్యాక్సిన్ల లభ్యత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  జనాభాలో 60-70ు మందికి టీకాలిస్తే కరోనా ముప్పు నుంచి తప్పించుకోగలం.


కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వ్యవధిని 12-16 వారాలకు పెంచడంపై నెలకొన్న గందరగోళంపై మీరేమంటారు?

డోసుల మధ్య ఎక్కువ వ్యవధి వ్యాక్సిన్‌ సామర్థ్యం మీద ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిషీల్డ్‌ ఒక డోస్‌ తీసుకోవడం వల్ల 32శాతం మాత్రమే నిరోధకత వస్తుందని వెల్లడైంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో వ్యాక్సిన్‌ వ్యవధిని 12 వారాలకు పెంచి  మళ్లీ 8 వారాలకు కుదించారు. మనం కూడా ఆ విధానాన్ని అవలంబించడం మేలు. 45 ఏళ్లు పైబడిన వారిలో అవసరమైన వారికి రెండు నెలలకే రెండో డోస్‌ ఇవ్వడం  మంచిది.


బూస్టర్‌ డోస్‌ అవసరం వస్తుందంటారా?

రెండు డోసుల సామర్థ్యం ఏడాది పాటు ఉంటుందని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. వైర్‌సలో వచ్చే మార్పులు, ఎంత శాతం మందికి మళ్లీ ఇన్ఫెక్షన్‌ వస్తుందనే అంశాల ఆధారంగా బూస్టర్‌ డోస్‌ అవసరంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


‘ సీరం సర్వే’ ప్రకారం ఇప్పటికే హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలి కదా?

యాంటీబాడీలు ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయనే విషయంపై స్పష్టత లేదు. వైర్‌సను తటస్థీకరించే స్థాయిలో యాంటీబాడీలు లేకపోతే కరోనా దాడి చేస్తుంది. వ్యాక్సిన్‌ తీసుకోవడమే మన ముందున్న ప్రత్యామ్నాయం. తీసుకున్నా జాగ్రత్తలు పాటించాలి.


విద్యా సంస్థలు తెరిస్తే ప్రమాదమా?

ఎక్కువ కాలం విద్యా సంస్థలను మూసి ఉంచలేం. ఆన్‌లైన్‌ విద్య వల్ల నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలను ప్రారంభించాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సంస్థల్లోని సిబ్బందికి కూడా టీకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలకు వలసలు అధికం. తొలి రెండు వేవ్‌లలో ఈ నగరాల్లోన్నే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. నిబంధనల పట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 


విహారయాత్రలు వైరస్‌కు ఆహ్వానమే!

లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లకు పరిమితమైన ప్రజలు.. ఆంక్షల సడలింపుతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కులూ మనాలీ, ముసోరీ వంటి పర్యాటక ప్రదేశాల్లో, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వేలాదిమంది గుమికూడటం ఆందోళనకరం. ఇది మరో వేవ్‌ను ఆహ్వానించమే..!


స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2021-07-09T17:46:39+05:30 IST