Corona డెల్టా వేరియంట్‌ బారినపడిన హైరిస్క్‌ వ్యక్తులను ఇలా కాపాడొచ్చు.. ఖర్చు చాలా తక్కువే..!

ABN , First Publish Date - 2021-11-03T17:45:06+05:30 IST

రోనా డెల్టా వేరియంట్‌ బారినపడిన హైరిస్క్‌ వ్యక్తులకు సరైన సమయంలో...

Corona డెల్టా వేరియంట్‌ బారినపడిన హైరిస్క్‌ వ్యక్తులను ఇలా కాపాడొచ్చు.. ఖర్చు చాలా తక్కువే..!

  • కొవిడ్‌కు మోనోక్లోనల్‌ చికిత్సతో కళ్లెం
  • వ్యాధి తీవ్రత, మరణ ముప్పునకు వందశాతం అడ్డుకట్ట
  • రోగుల్లో 75 శాతం మందికి ఏడు రోజుల్లోనే నెగెటివ్‌
  • వివరాలు వెల్లడించిన చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ : కరోనా డెల్టా వేరియంట్‌ బారినపడిన హైరిస్క్‌ వ్యక్తులకు సరైన సమయంలో మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స అందించడం ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా చూడడంతోపాటు మరణం ముప్పును పూర్తిగా నివారించవచ్చని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఏషియన్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ (ఏహెచ్‌ఎఫ్‌), సీసీఎంబీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ (ఐఎల్‌ఎస్)తో కలిసి ఏఐజీ ఈ పరిశీలన సాగించింది. ఫలితాలను ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరులకు వివరించారు. ఈ వివరాలు ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయని చెప్పారు. పరిశోధన కోసం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన 285 మంది హైరిస్క్‌ వ్యక్తులను (వీరిలో 98 శాతం డెల్టా వేరియంట్‌ బాధితులే) రెండుగా విభజించారు. 


ఒక బృందానికి కాసిరివిమాబ్‌, ఇండేవిమాబ్‌ 600 ఎంఎల్‌ చొప్పున వంద ఎంఎల్‌ సెలైన్‌లో కలిపి మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్స ఇచ్చారు. మరో బృందానికి సాధారణ చికిత్స (రెమ్‌డెసివిర్‌ తదితర ఔషధాలతో) చికిత్స అందించారు. మోనోక్లోనల్‌ చికిత్స పొందినవారిలో 75 శాతం మందికి ఏడో రోజు కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. 78 శాతం మంది జ్వరం, దగ్గు నుంచి కూడా బయటపడ్డారు. వీరిలో ఎవరికీ వ్యాధి తీవ్రత పెరగడం కానీ, మరణం సంభవించడం కానీ జరగలేదు. కొవిడ్‌ అనంతర ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. మరోవైపు సాధారణ చికిత్స పొందినవారిలో 50 మందిలో లక్షణాలు కొనసాగాయి. ఏడు రోజుల తర్వాత ఆర్టీపీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చింది.


ఖర్చు రూ.65 వేలు మాత్రమే..

మోనోక్లోనల్‌ చికిత్సకు ఖర్చు రూ.65 వేలు మాత్రమేనని.. ఇది వూహాన్‌ స్ట్రెయిన్‌, డెల్టా స్ట్రెయిన్‌ మీద కూడా సమాన స్థాయిలో ప్రభావవంతంగా పని చేస్తోందని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి వివరించారు. టీకా రెండు డోసులు పొందాక వైరస్‌ బారినపడినవారు కూడా ఈ చికిత్స పొందవచ్చన్నారు. ఔట్‌ పేషంట్‌గా చికిత్సపొంది ఇంటికెళ్లిపోవచ్చని తెలిపారు.  


తమ అధ్యయన ఫలితాలు కొవిడ్‌ రోగుల చికిత్సలో, మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారికి, దీర్ఘకాల వ్యాధుల బాధితులైన 60 ఏళ్లలోపు వారికి వైద్యం అందిచండంలో నిర్దిష్ట విధానాలు అవలంబించేందుకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. ఆస్పత్రి పాలైన రోగులపై ఈ చికిత్స సామర్థ్యంపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఏహెచ్‌ఎఫ్‌ ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది. సీసీఎంబీ జన్యు విశ్లేషణ చేసింది. మోనోక్లోనల్‌ చికిత్స డెల్టా వేరియంట్‌పై ఎలా పనిచేస్తుందనే అంశాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు చెందిన ఐఎల్‌ఎఫ్‌ తమ ల్యాబ్‌లో పరీక్షించింది.

Updated Date - 2021-11-03T17:45:06+05:30 IST