ఇంటికే కొవిడ్‌ వైద్యం!

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

కరోనా బాధితులకు వైద్యం అందించడంలో ఆస్పత్రుల వైఫల్యం ఆమెను ఆలోచనల్లో పడేసింది. కరోనా సోకిన పేదవాళ్లకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో, వారి ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు తెనాలికి చెందిన డాక్టర్‌ శారద...

ఇంటికే కొవిడ్‌ వైద్యం!

కరోనా బాధితులకు వైద్యం అందించడంలో ఆస్పత్రుల వైఫల్యం ఆమెను ఆలోచనల్లో పడేసింది. కరోనా సోకిన పేదవాళ్లకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో, వారి ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు తెనాలికి చెందిన డాక్టర్‌ శారద. ‘నిజమైన డాక్టర్‌ తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయమిదే’ అంటున్న ఆ నిస్వార్ధ వైద్యురాలి సేవా మార్గాన్ని పరికిస్తే....


‘‘ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ వార్డులోని దృశ్యాలు చూసి చలించిపోయా. ఈ ఆపత్కాలంలో కొన్ని ఆస్పత్రులు వ్యాపార ధోరణితో పని చేయడం చూసి తట్టుకోలేకపోయా! నాకిప్పుడు 60 ఏళ్లు. నా 35 ఏళ్ల వైద్య సర్వీసులో ఇలాంటి భయానక పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. నా చిన్నప్పుడు అందరిలో సామాజిక బాధ్యత బాగా కనిపించేది. కరోనా మహమ్మారి విస్తరించిన ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆ స్ఫూర్తి కనిపించడంలేదు. డాక్టర్‌గానే కాదు సాటి మనిషిగా ఈ సమయంలో నా భాధ్యత ఏంటని ఆలోచించా. కరోనా పాజిటివ్‌ వచ్చి సరైన వైద్యం అందక, ఇంటి వద్దనే ప్రాణాలతో పోరాడుతున్న వారి ఇంటికే వెళ్లి వైద్యం అందించాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు చెబితే ఆయన ‘మంచి నిర్ణయం. మేము అండగా ఉంటాం’ అని వెన్నుతట్టారు.

ఆలస్యం చేయకుండా ఒక వాహనాన్ని సిద్ధం చేసి, దాన్లో ఆక్సిజన్‌ సిలిండర్‌, వైద్యం అందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశాం. ఆక్సిజన్‌ కొరత ఉన్న సమయంలోనూ ఉచితంగా ఆక్సిజన్‌ అందించేందుకు ప్రయత్నం చేశాం. ఈ ఐదు రోజుల్లో తెనాలిలో, చుట్టుపక్కల గ్రామాల్లో వందమందికిపైగా కరోనా బాధితులను కలిశా. కరోనా బాధితులకు మొదట కావలసింది మనోధైర్యం. వారిలో భయాన్ని పోగొట్టి, అవసరమైన మందులు ఇస్తున్నాం. రెండు రోజుల తరువాత ‘ఎందుకమ్మా ప్రాణాలతో చెలగాటం అడతావు. ఇంటికి వెళ్లి ఉచితంగా సేవ చేయడం అవసరమా?’అని తోటి వైద్యుల్లో కొందరి నుంచి విమర్శలు, మరికొందరి నుంచి బెదిరింపులు వచ్చాయి. నేను అవేమీ పట్టించుకోదలచుకోలేదు. ఎందుకంటే అనుకున్నది చేసుకుంటూ వెళ్లడంలోనే నాకు సంతృప్తి దొరకుతోంది.’


టోల్‌ ఫ్రీ నంబర్‌!

ఇంటి దగ్గరే ఉంటూ కరోనా మందులు వాడుతున్న వారి కోసం ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించాం. ఆ నంబర్‌కు ఎవరైనా వైద్య సహాయం కావాలని కాల్‌ చేస్తే, వెంటనే మా బృందానికి సమాచారం వస్తుంది. ఫోన్‌ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లిపోతాం. వారి పరిస్థితి పరిశీలించి తక్షణం అవసరమైన మందులను అందిస్తున్నాం. మెరుగైన వైద్యం అవసరం ఉన్నా, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉన్నా, వారిని బెడ్‌ ఉన్న ఆస్పత్రికి పంపిస్తున్నాం. ఆక్సిజన్‌ అవసరం ఉందనుకున్న వారికి ఆక్సిజన్‌ సిలిండర్లను కూడా ఉచితంగానే అందిస్తున్నాం. మాకు సొంత ల్యాబ్‌ లేకపోవడంతో కరోనా పరీక్ష, రక్త పరీక్ష ఫలితాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరో ల్యాబ్‌కు వెళ్లి వారు రిపోర్టు ఇచ్చేవరకు వేచి ఉండాల్సి వస్తుంది. సొంతంగా ల్యాబ్‌ కూడా ఉంటే పరీక్షలు వెంటనే చేయొచ్చనే ఆలోచనతో అనుమతి కోసం కలెక్టర్‌కు అర్జీ పెట్టాం. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సి.టి స్కాన్‌ యంత్రం అందుబాటులోకి వస్తే, పైసా ఖర్చు లేకుండా కరోనా రోగులకు అన్ని స్టేజ్‌లలోనూ వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కొన్నిచోట్ల సిటీస్కాన్‌, బ్లడ్‌ టెస్ట్‌, ఇతర రిపోర్టులకు కూడా 24 నుంచి 72 గంటలు పడుతోంది. ఈలోపే కరోనా తీవ్రత పెరిగిపోయి, బాధితులు ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. అలా కాకుండా రిపోర్టులు సకాలంలో అందేలా ప్రభుత్వం చూడగలిగితే చాలావరకు మరణాలను తగ్గించవచ్చు. 




మా సేవలను వినియోగించుకోవాలి

‘కరోనా సోకిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలనుకుంటున్నానని ఇంట్లో చెప్పగానే, మా కుటుంబ సభ్యులే తొలి సాయంగా 3 లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం నా తమ్ముడు, అతని స్నేహితులు సాయం చేస్తున్నారు. తెనాలికి చెందిన ఎన్నారైల బృందం సాయం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అమెరికాలో ఉంటున్న డాక్టర్‌ ఈదర లోకేష్‌ ఫోన్‌ ద్వారా బాధితులకు అండగా నిలుస్తామని చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. కరోనాపై విశేష పరిశీలనలు చేసిన ఆయన లాంటివారు అండగా నిలవడం మంచి పరిణామం. సాయం అందించాలనుకునే వారు డబ్బు కన్నా, వైద్యసేవలకు అవసరమైన ముందులు, పరికరాలు అందిస్తే చాలా మేలు చేసిన వారవుతారు. నాలాంటివారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ప్రభుత్వం మా సేవలను వినియోగించుకుంటే ఈ విపత్తు నుంచి ఎంతోమంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడవచ్చు. ఇంటిదగ్గరకే వెళ్లి వైద్యం అందిస్తే కరోనా వ్యాప్తి కూడా తగ్గుతుందనేది నా ఆలోచన. నాకూ కొవిడ్‌ వస్తుందేమోనని నా కుటుంబం భయపడుతోంది. నేను మాత్రం ఆ దేవుడు రక్షిస్తాడనే ధైర్యంతో ఉన్నా. నిజంగా ఆ దేవుడు నాకు అండగా ఉన్నాడు.

ప్రస్తుత కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోలేని నిస్సహాయులకు ఉచిత వైద్య చికిత్స అందిస్తూ వారికి అండగా నిలవడం, వైద్యురాలిగా నాకెంతో తృప్తినిస్తోంది.’

- తిరుమలశెట్టి శేషగిరి, తెనాలి.

ఫొటోలు: నటరాజ్‌



Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST