వైద్యులు ఎక్కడ?

ABN , First Publish Date - 2022-05-25T05:42:56+05:30 IST

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆసుపత్రి అది. జిల్లాలోనే పెద్దదైన ఈ పీహెచ్‌సీలో 59 మంది సిబ్బంది ఉన్నారు. మంగళవారం వీరిలో అధికశాతం మంది వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరుకాలేదు. ఎవ్వరికీ వైద్య కార్యక్రమాలపై అవగాహన సరిగా లేదు. దిగువస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయాల్సిన వైద్యాధికారులు, సూపర్‌వైజర్లదీ అదే పరిస్థితి. ఇక వైద్యసేవల విషయం ఆ దేవుడికే ఎరుక.

వైద్యులు ఎక్కడ?
ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో మీనాక్షి

 సింగుపురం ప్రభుత్వాసుపత్రిలో కనిపించని డాక్టర్లు, సిబ్బంది
 మందుల స్టాక్‌లో తేడాలు
 రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తం
 డీఎంహెచ్‌వో తీవ్ర ఆగ్రహం
అరసవల్లి, మే 24:
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆసుపత్రి అది.  జిల్లాలోనే పెద్దదైన ఈ పీహెచ్‌సీలో 59 మంది సిబ్బంది ఉన్నారు. మంగళవారం వీరిలో అధికశాతం మంది వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరుకాలేదు. ఎవ్వరికీ వైద్య కార్యక్రమాలపై అవగాహన సరిగా లేదు. దిగువస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయాల్సిన వైద్యాధికారులు, సూపర్‌వైజర్లదీ అదే పరిస్థితి. ఇక వైద్యసేవల విషయం ఆ దేవుడికే ఎరుక. సాక్షాత్తు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.మీనాక్షి సింగుపురం ప్రభుత్వాసుపత్రిని మంగళవారం ఉదయం సందర్శించినపుడు ఎదురైన పరిస్థితి ఇది.  ఉదయం 9.20 గంటలకు డీఎంహెచ్‌వో మీనాక్షి ఈ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయానికి 42 మంది (17 మంది రిమ్స్‌లో ట్రైనింగ్‌లో ఉన్నారు.) వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన ఆస్పత్రిలో కేవలం ముగ్గురు సూపర్‌వైజర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక కంటింజెంట్‌ వర్కర్‌ మాత్రమే ఉండడం విశేషం. వైద్యులు లేకపోవడంపై డీఎంహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఫోన్లు చేయడంతో 10 గంటల నుంచి ఒక్కొక్కరుగా వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు. సమయపాలన పాటించకపోవడంపై ఆమె మండిపడ్డారు. అనంతరం సూపర్‌వైజర్లు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌సీడీ సర్వే, ఫీవర్‌ సర్వే, బయోమెట్రిక్‌ హాజరు, తదితర అంశాలపై వైద్యులు, సూపర్‌వైజర్లు అవగాహన లేని సమాధానాలు చెప్పడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. మీరే ఇలా ఉంటే ఇక కింది స్థాయి సిబ్బందితో ఎలా పని చేయించగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌ వైజర్ల ఎవరీ దగ్గర ఫీల్డ్‌ రికార్డులు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం మందుల స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందులకు, రికార్డు లకు ఎక్కడా పొంతన లేకపోవడాన్ని గమనించారు. జిల్లా కేంద్రానికి దగ్గరున్న పీహెచ్‌సీలోనే పరిస్థితి ఇలా వుంటే మిగతా చోట్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చేసరికి పరిస్థితుల్లో మార్పు రాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Updated Date - 2022-05-25T05:42:56+05:30 IST