వేతనాల కోసం వైద్యుల నిరసన

ABN , First Publish Date - 2022-06-30T04:54:11+05:30 IST

రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులకే వేతనాల అందడం లేదనే జబ్బు మొదలైంది. ఫలితంగా వేతనాల కోసం జూనియర్‌ డాక్టర్లు ఆస్పత్రుల ముందు నిరసనలకు దిగుతున్నారు.

వేతనాల కోసం వైద్యుల నిరసన
జిల్లా జనరల్‌ ఆస్పత్రి ముందు నిరసన తెలుపుతున్న డాక్టర్లు

- జీజీహెచ్‌ ముందు నల్లబ్యాడ్జీలతో జూనియర్‌ డాక్టర్ల ఆందోళన


వనపర్తి వైద్యవిభాగం, జూన్‌ 29: రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులకే వేతనాల అందడం లేదనే జబ్బు మొదలైంది. ఫలితంగా వేతనాల కోసం జూనియర్‌ డాక్టర్లు ఆస్పత్రుల ముందు నిరసనలకు దిగుతున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌ (జిల్లా జనరల్‌ ఆస్పత్రి) ముందు కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించబడిన జూనియర్‌ డాక్టర్లు వేతనాలు చెల్లించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరు కావడంతో గత ఏడాది నవంబర్‌లో జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో 28 మంది డాక్టర్లుగా చేరడం జరిగిందన్నారు. తీరా ఇక్కడ డాక్టర్లకు భోజన వసతి, అకామిడేషన్‌ లాంటివి ఏవీ ఏర్పాటు చేయలేదన్నారు. అయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కానీ గత నాలుగు నెలలుగా వైద్యులకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించక పోవడం వల్ల కుటుంబ పోషణ భారమవు తోందని, పిల్లల చదువులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు. వేతనాల చెల్లింపు విషయంలో పదిరోజుల క్రితం డీఎంఈకి వినతిపత్రం ఇచ్చామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఓపీ సేవలు బంద్‌ చేసి ధర్నాకు దిగామని అన్నారు. జూలై ఒకటి వరకు వేతనాలు చెల్లించకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్‌ డాక్టర్లు దేవిక, సతీష్‌, ప్రవీణ్‌, సందీప్‌, కావ్య, భవిష్య, అకేల్వీ, గౌతం, జీషాన్‌, జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T04:54:11+05:30 IST