అప్పటి తప్పులు మళ్లీ జరుగుతున్నాయ్.. భారత్‌కు వైద్యుల హెచ్చరిక

ABN , First Publish Date - 2022-01-15T22:33:47+05:30 IST

కరోనా ట్రీట్‌మెంట్ పేరిట ఇష్టారీతిన ఔషధాలు వినియోగిస్తున్న దాఖలాలు భారత్‌లో కనిపిస్తున్నాయంటూ కెనడా, అమెరికా, భారత్‌కు చెందిన 32 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా బహిరంగ లేఖ రాశారు.

అప్పటి తప్పులు మళ్లీ జరుగుతున్నాయ్.. భారత్‌కు వైద్యుల హెచ్చరిక

న్యూఢిల్లీ: కరోనా ట్రీట్‌మెంట్ పేరిట ఇష్టారీతిన ఔషధాలు వినియోగిస్తున్న దాఖలాలు భారత్‌లో కనిపిస్తున్నాయంటూ కెనడా, అమెరికా, భారత్‌కు చెందిన 32 మంది వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఈ వైఖరికి అడ్డుకట్ట వేయాలని వారు కేంద్రాన్ని కోరారు. కరోనా సంక్షోభానికి సంబంధించి కొంత అస్పష్టత ఉన్నప్పటికీ.. వ్యాధి బారిన పడ్డ వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్న విషయంలో సవివరమైన, శాస్త్రబద్ధమైన చికిత్సా విధానాలు(ప్రోటోకాల్స్) అందుబాటులో ఉన్నాయని వారు చెప్పారు. కానీ.. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో పాత తప్పులు పునరావృతమవుతున్న ఉదంతాలు తాము చూస్తున్నామని పేర్కొన్నారు.  


విటమిన్ టాబ్లెట్లు, అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఫావిపిరావిర్, ఐవర్‌మెక్టిన్ వంటి ఔషధాలను కరోనా‌కు చికిత్సగా ఉపయోగిస్తున్నారని, దీనికి వైద్యశాస్త్రఆమోదం లేదని స్పష్టం చేశారు. ఇటువంటి ఔషధాలను ఇష్టారీతిన వాడటం ద్వారా డెల్టా వేవ్ సమయంలో రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించిన ఘటనల్ని వారు గుర్తు చేశారు. రోగ లక్షణాలు కనిపించని(ఎసింమ్టోమేటిక్), వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న(మైల్డ్) సందర్భాల్లో సరైన వైద్యపరమైన కారణాలు లేకుండానే కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చాలని సూచించడం తగదని వారే పేర్కొన్నారు.

Updated Date - 2022-01-15T22:33:47+05:30 IST