భూమిపై ప్రతి అణువూ చైనా కనుసన్నల్లోకి రాబోతోందా?

ABN , First Publish Date - 2022-01-29T15:20:05+05:30 IST

అనేక దేశాలపై చైనా గూఢచర్యం చేస్తోందనే ఆరోపణలు బలంగా

భూమిపై ప్రతి అణువూ చైనా కనుసన్నల్లోకి రాబోతోందా?

న్యూఢిల్లీ : అనేక దేశాలపై చైనా గూఢచర్యం చేస్తోందనే ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో దాదాపు 13,000 ఉపగ్రహాలను రోదసిలోకి పంపించేందుకు ఆ దేశం ప్రణాళిక రచించిందనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ భారీ ఉపగ్రహ మండలి భూమి దిగువ కక్ష్య మొత్తం ఆవరించి ఉంటుందని, ఈ ప్రణాళిక అసలు లక్ష్యం భూమి దిగువ కక్ష్యపై ఆధిపత్యాన్ని సాధించడమని తెలుస్తోంది. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, సుమారు 13,000 ఉపగ్రహాల ఏర్పాటు బాధ్యతను చైనా ప్రభుత్వం ఓ కంపెనీకి అప్పగించింది. భూమి దిగువ కక్ష్యపై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రత కోసం శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక ప్రభుత్వ పరిపాలన (SASTIND) విభాగం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. చిన్న ఉపగ్రహాల అభివృద్ధికి పిలుపునిచ్చింది. ఈ ఉపగ్రహ మండలి (మెగా కాన్‌స్టలేషన్) భూమిపై అత్యధిక భాగంలో నిఘా కార్యకలాపాలతోపాటు, ఇంటర్నెట్ సదుపాయాలను కూడా మెరుగుపరుస్తుంది. 


చైనా చెప్తున్నదాని ప్రకారం, 5G నెట్‌వర్క్ సర్వీసులను పటిష్టపరచడం, భౌగోళిక కమ్యూనికేషన్ వ్యవస్థను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేయడం ఈ మెగా కాన్‌స్టలేషన్ లక్ష్యం. SpaceX-Starlink కంపెనీ ఉపగ్రహాల మాదిరిగానే భూమి దిగువ కక్ష్యలో 12,992 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. వీటిలో ఒక్కొక్క ఉపగ్రహం పరిధి  భూమి ఉపరితలంపైన 498.89 కిలోమీటర్ల నుంచి 1,144.24 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 


SpaceX-Starlink కంపెనీ ఉపగ్రహాలు ప్రస్తుతం 2,000 వరకు పని చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవే అత్యాధునిక ఉపగ్రహాలు. చైనా దాదాపు 13 వేల ఉపగ్రహాల ఏర్పాటు బాధ్యతను ఓ కంపెనీకి అప్పగించినట్లు తెలిసిన వెంటనే పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమపై గూఢచర్యం చేయడానికే చైనా ఈ ప్రయత్నాలు చేస్తోందని అమెరికా, దాని మిత్ర పక్షాలు విశ్వసిస్తున్నాయి. 



Updated Date - 2022-01-29T15:20:05+05:30 IST