ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది?

Jul 25 2021 @ 00:23AM
పరవళ్లు తొక్కుతున్న పొచ్చెర జలపాతం

- జిల్లాలోని జలపాతాల వద్ద రక్షణ చర్యలు కరువు
- నీటి గుండాల పూడ్చివేతపై వ్యతిరేకత
- అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు
- గాలిలో కలుస్తున్న పర్యాటకుల ప్రాణాలు
- యేటా సీజన్‌లో కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రి, గుంజాల వద్దకు సందర్శకుల తాకిడి

ఆదిలాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): నీటి పరవళ్లతో జాలువారే జలపాతాల అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకుల ప్రాణాలు గాలి లో కలుస్తున్నా.. పట్టింపే లేకుండా పోతోంది. జిల్లాలో ప్రధానంగా చెప్పుకునే కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రి, గుంజాల జలపాతాల వద్ద కనీస రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నా యి. ఉమ్మడి రాష్ట్రంలోను ఎలాంటి అభివృద్ధికి నోచుకోని జిల్లా పర్యాటక ప్రాంతాలు.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదన్న వాదనలున్నాయి. జిల్లాను మరో కాశ్మీర్‌గా మారుస్తామన్న ముఖ్యమంత్రి హామీలు అమలుకు నోచుకో లేదు. ప్రతియేటా వర్షాకాల సీజన్‌లో ఆరు నెలల పాటు పర్యాటకులతో రద్దీగా కనిపించే కుంటాల, పొచ్చెర జలపాతాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం లేదు. జలపాతాల నీటి పరవళ్లను అతి దగ్గర నుంచి అస్వాదించేందుకు పర్యటకులు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే రెప్పపాటులో ప్రమాదాలు జరిగుతున్నాయి. ముఖ్యంగా పర్యాటకుల్లో సెల్ఫీ మోజు పెరిగిపోవడంతోనే ప్రమాదాలకు కారణమవుతోంది. యేటా ప్రమాదాల బారీన పడి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలి లో కలుస్తున్నాయి. ఎంతో ఆనందంగా గడపాల్సిన క్షణాలు ఎన్నో కుటుం బాల్లో విషాదం నింపుతున్నాయి. గతంలోనే రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన జోగు రామన్న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కుంటాల జల పాతాన్ని సందర్శించి రూ.కోటీ 4లక్షల నిధులతో జలపాతం అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించారు.  అప్పట్లోనే నీటి గుండాల పూడ్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. అం తలోనే అభివృద్ధి పేరిట జలపాతం అం దాలను ధ్వంసం చేయవద్దంటూ కుంటా ల బచావో కమిటీ, ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు ఆందోళనకు దిగ డంతో అభివృద్ధి పనులు అర్ధాంతరంగానే నిలిచి పోయాయి. సంస్కృతి, సంప్రదాయాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా అభివృద్ధి పనులు చేపడుతామని గిరిజనులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. దీంతో అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు. ఇదిలాఉండగా ఈ యేడు గత వారం రోజుల క్రితమే పొచ్చెర జలపాతంలో జైనథ్‌ మండలానికి చెందిన యువకుడు వరద నీటిలో చిక్కుకుని గల్లంతై మృతి చెందిన సంఘట న చోటు చేసుకోవడం మళ్లీ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితులతోనే భారీ వర్షాలు కురిసిన సమయంలో జలపాతాల వద్దకు పర్యాటకులను పోలీసులు అనుమతించడం లేదు.
ప్రమాదకరంగా నీటి గుండాలు
సహజ సిద్ధంగా నీటి పరవళ్లు తొక్కే కుంటాల, పొచ్చెర జలపాతాల వద్ద నీటి గుండాలు ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఈ నీటి గుండాల్లో జారీ పడిన ఏ ఒక్కరు ఇప్పటి వరకు బతికి బయట పడిన దాఖలాలు లేవు. లోతైనా ఈ నీటి గుండాల్లో పెద్ద బొరియలు ఉండడంతో ప్రమాద వశాత్తు పడిన వారి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ గుండాలను పూడ్చివేస్తే కొంతమేరకైనా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. కాని జలపాతాలు సహజ సిద్ధంగానే ఉండాలని కుంటాల బచావో కమిటీ, ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. నీటి గుండాలకు తోడు జారుడు బండరాళ్లపై పట్టుతప్పి పోవడంతో నీటి గుండంలో పడిపోతున్నారు. కనీసం నీటి గుండాల చుట్టయిన ఇనుప కంచెను ఏర్పాటు చేస్తే కొంత మేరకైనా రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. అయితే జలపాతం దిగువ భాగంలో ఉన్న నీటి గుండాలను పూడ్చివేస్తే జలపాతాల అందాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతి యేటా సీజన్‌లో జలపాతాలను తిలకించేందుకు వస్తున్న పర్యటకులకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపాదనలకే పరిమితం
 సహ్యాద్రి పర్వతాల నడుమ ప్రవహించే కడెం నదిపై కుంటాల, పొచ్చెర జలపాతాల పరవళ్లు పర్యటకులను ఎంతగానో కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికంగా నిలుస్తున్న ఈ జలపాతాల సోయగాలను చూసేందుకు రాష్ట్రం నలుమూలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు వచ్చి వెళ్తుంటారు. కాని ఇక్కడ కనీస సౌకర్యాలు, భద్రత చర్యలు లేకపోవడంతో జలపాతాల అభివృద్ధి కలగానే మారుతోంది. ఇప్పటికే కుంటాల జలపాతం వద్ద రిసార్ట్స్‌, ఇతర అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ.3కోట్ల 81లక్షల నిధులతో ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినా.. ఆచరణ సాధ్యం కావడం లేదు. అలాగే పొచ్చెర జలపాతం అందాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టు కుంటున్నాయి. ఎతైన బండరాళ్లపై నుంచి లోతైన లోయలో పడే నీటి అందాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. బజార్‌హత్నూర్‌ మండలంలోని కనకాయి, భీంపూర్‌ మండలంలో గుంజాల, ఇచ్చోడ మండలంలో గాయత్రి జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తా యి. గాయత్రి జలపాతం సాహోసపేతమైన క్రీడలకు ఎంతో అనుకూలం గా ఉంటుంది. కాని జలపాతాల అభివృద్ధికి ప్రతియేటా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా.. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉన్న సాసర్‌కుండ్‌ జలపాతం వద్ద పకడ్బందీగా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోనూ అలాంటి భద్రత చర్యలు చేపడితే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.
మరిన్ని సౌకర్యాలు కల్పించాలి : కే ప్రవీణ్‌,
కుంటాల బచావో కమిటీ అధ్యక్షుడు, ఆదిలాబాద్‌
సహజ సిద్ధంగా ఏర్పడిన కుంటాల, పొచ్చెర జలపాతాల వద్ద  మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. భద్రత చర్యలు తీసుకోకుండా అభివృద్ధి పేరిట జలపాతాలను ధ్వంసం చేస్తే సహించేది లేదు. గతంలో ప్రకృతి అందాలను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి గుండాలను పూడ్చి వేయాలన్న నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకున్నారు. పర్యటకులు నీటి పరవళ్లకు అతి దగ్గరగా వెళ్లకుండా అడ్డుగా ఇనుప వలయాన్ని ఏర్పాటు చేస్తే మంచిది.
జలపాతాల వద్ద భద్రత చర్యలు తీసుకుంటున్నాం
: చంద్రశేఖర్‌, ఎఫ్‌డీవో, ఆదిలాబాద్‌
జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాల వద్ద అవసరమైన భద్రత చర్యలు తీసుకుంటున్నాం. ఆదివారం సెలవు దినాల్లో అటవీ శాఖ సిబ్బందితో నిఘా సారిస్తున్నాం. పర్యాటకులు నీటి పరవళ్లకు అతి దగ్గరగా వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటకుల్లో మరింత అవగాహన కల్పిస్తున్నాం. జలపాతాల వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుం టున్నాం. పర్యటకులకు మరిన్ని సౌకర్యాలను కల్పించి జలపాతాలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో  అభివృది పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. అటవీ శాఖ తరుపున పూర్తి సహకారాన్ని అందిస్తాం.

Follow Us on: