పల్సీకర్‌పై పట్టింపేదీ ?

Published: Fri, 28 Jan 2022 00:04:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పల్సీకర్‌పై పట్టింపేదీ ?అర్థాంతరంగా నిలిచిపోయిన పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ నిర్మాణం

ఏళ్ల గడుస్తున్నా.. ముందుకు సాగని పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టు పనులు 

ఇప్పటికీ మంజూరు కాని నిధులు 

భూసేకరణకు అడుగడుగునా ఆటంకాలు 

ప్రతీయేటా గుండెగావ్‌కు తప్పని ముంపు ముప్పు 

నిర్మల్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని భైంసా శివారులో నిర్మించ  తలపెట్టిన పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ పరిస్థితి ఇప్పటికీ అతీగతీ లేకుండా పోతోంది. ఏళ్లు గడుస్తున్నా.. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కనీసస్థాయిలో చొరవ చూపకపోతుండడం ఇక్కడి రైతాంగానికి శాపంగా మారుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి.. సరైన దిశానిర్దేశం కరువవ్వడంతో ప్రతీయేటా వర్షాకాలంలో గుండెగావ్‌ ముంపునకు గురవుతుండడం సహజంగా మారింది. గుండెగావ్‌ ప్రజలను ముంపు నుంచి కాపాడేందుకు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారే తప్పా.. ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే పలుసార్లు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి.. రూపొందించిన ప్రతిపాదనలు తారుమారయ్యాయి. భూసేకరణ వ్యవహారం ఓ ప్రహసనంగా మారుతోంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తమకు పరిహారం అందించా లంటూ ముంపునకు గురయ్యే రైతాంగం డిమాండ్‌ చేస్తోంది. మొట్ట మొదట 2004 సంవత్సరంలో రూ.12.56 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టారు. 4,600ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం గాను 558 ఎకరాల భూ మిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు ప్యాకేజీల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించారు. ఒకటో ప్యాకేజీ కింద ఆనకట్ట నిర్మాణం, రెండోప్యాకేజీ కింద కాలువల నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు. కాగా 2007 సంవత్సరంలో పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవ్వగా.. పరిహారం విషయంలో స్థానిక రైతులు అడ్డుపడడంతో ఆ పనులు దాదాపు ఎనిమిదేళ్ల పాటు నిలిచిపోయాయి. 2015లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఉత్తర్వులు వెలువరించడమే కాకుండా 2017లోగా పనులను పూర్తి చేసేందుకు గడువు విధించింది. అయితే దాదాపు 137 వంది ఈ ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోనున్నారు. వీరికి ఆర్‌ ఆండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్లు నిర్మించాలని భావించారు. మొత్తం రూ.78.07 కోట్ల వ్యయంతో పనులు పరిహారాన్ని నిర్ధారించారు. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా ఈ ప్రాజెక్టు దుస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. అన్న చందంగా ఉండిపోయింది. తాజాగా 2013 ఆర్‌ అండ్‌ ఆర్‌ యాక్ట్‌ కింద ఈ పనులను చేపట్టాలని.. అలాగే పరిహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 62.78 కోట్ల రూపాయలను తాజాగా మంజూరు చేసింది. ఇందులో నుంచి భూసేకరణ కోసం 25.05 కోట్లు, ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం కోసం 26.06 కోట్లు, బ్యాలెన్స్‌ వర్క్‌ కోసం 9.21 కోట్లను కేటాయించింది. అయితే ప్రభుత్వం కేవలం నిధులు మంజూరు చేస్తున్నట్లు చెబుతోందే తప్పా.. విడుదల చేయడం లేదు. దీంతో ఇటు పనులు, అటు పరిహారం సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదంటున్నారు. 

ఫ అదనపు ఆయకట్టు కోసం

పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టును 4600 ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలని చేపట్టారు. గుండెగావ్‌ వద్ద ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు 2004 సంవత్సరంలో పరిపాలన పరమైన అనుమతులు జారీ అయ్యాయి. దీని కోసం గానూ 558 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 12.56 కోట్లతో ఈ ప్రతిపాదనలను తయారు చేశారు. మూడేళ్ల అనంతరం 2007 సంవత్సరంలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవ్వగా.. పరిహారంపై స్పష్టత లేకపోవడంతో రైతులు పనులను అడ్డుకున్నారు. ఇలా 2015 వరకు సమస్య కొనసాగింది. ఎట్టకేలకు 2015లో మళ్లీ కొత్త జీవో జారీ చేసి పనులు చేపట్టేందుకు సిద్దమవ్వడమే కాకుండా చేపట్టే పనులను 2017లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. 78.07 కోట్లతో రూపొందించిన ఈ తాజా ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో పనులు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఫ ప్రతియేటా ముంపునకు గురవుతున్న గుండెగావ్‌

ప్రతీ వర్షాకాలంలో వరద నీటికారణంగా గుండెగావ్‌ గ్రామం ముంపు నకు గురవుతోంది. ఇప్పటికే చాలాసార్లు ఈ గ్రామం ముంపునకు గురైంది. అధికారులు ముంపు సమయంలో బాధితులకు తాత్కాలికంగా భైంసాలో ఆశ్రయం కల్పించి.. ఆ తరువాత చేతులు దులుపుకుంటున్నా రు. గుండెగావ్‌ గ్రామస్థులందరినీ ప్రస్తుతం ఉన్న చోటు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద వీరందరికీ 137 ఇళ్లను కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. నిధులు మంజూరు కాక ఆ ప్రతిపాదనలన్నీ అటకెక్కుతున్నాయి. గుండెగావ్‌ గ్రామస్థులు ఇప్పటికే తమ పునరావాసంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరికి రాజకీయ పార్టీలు సైతం అండగా నిలిచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం గుండెగావ్‌ గ్రామస్థులకు పునరావాసం కల్పించి ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపడతామంటూ ఎన్నికల సభలో హమీనిచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హమీ అమలుకు నోచుకోలేదు. 

ఫ భూసేకరణతోనే ఇబ్బందులు

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కంటే దీనికి సంబంధించిన భూసేకరణకే ఎక్కువ వ్యయం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడి భూ ముల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో.. ఎప్పటికప్పుడు భూ సేకరణ వ్యయం పెరిగిపోతోంది. మొత్తం 558ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వాలన్న భాధితుల డిమాండ్‌తో వ్యయం పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం ఇటు పనుల విషయంలో గాన.. అటు భూసేకరణ విషయంలో గానీ ముందుకు పోవడం లేదు. ఇప్పటికే జిల్లాలోని పలు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతున్న క్రమంలోనే గుండెగావ్‌ ప్రాజెక్ట్‌పై కూడా ఇదే తరహా నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. ప్రభు త్వం ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడమే కాకుండా భూసేకరణ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ముంపు బాధితులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం అందిస్తూ పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

నిధులు రాగానే పనులు మొదలుపెడతాం.. 

పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి.. నిధులు విడుదల కాగానే పనులను ప్రారంభిస్తాం. ఇప్పటికే కొంత మేరకు పనులు జరిగాయి. భూసేకరణ సమస్యగా మారింది. భూముల ధరలు గణనీయంగా పెరిగిపోవడం కూడా పరిష్కారానికి అడ్డుగా మారింది. పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.