బోధనకు పిహెచ్‌డీ అవసరమా?

ABN , First Publish Date - 2021-07-13T06:44:02+05:30 IST

అధ్యాపక అర్హతలకు యూజీసీ 2018లో నిర్దేశించిన నిబంధనలను అనుసరించి 2021 జూలై 1 నుంచి పీహెచ్‌డీ డిగ్రీ ఉన్నవారు మాత్రమే...

బోధనకు పిహెచ్‌డీ అవసరమా?

అధ్యాపక అర్హతలకు యూజీసీ 2018లో నిర్దేశించిన నిబంధనలను అనుసరించి 2021 జూలై 1 నుంచి పీహెచ్‌డీ డిగ్రీ ఉన్నవారు మాత్రమే దేశంలోని వర్సిటీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హులు. దీనిపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో పీహెచ్‌డీ డిగ్రీ పొందటం అంత సామాన్యమైన విషయం కాదు. ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర వర్సిటీలు, రాష్ట్ర వర్సిటీలు, ప్రైవేట్ వర్సిటీలు ఇలా వివిధ రకాల విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని విద్యా సంస్థలలో ఒకే రకమైన సౌకర్యాలు, అర్హతలున్న అధ్యాపకులు, ఒకే రకమైన నిబంధనలు అమలులో లేవు. అందువల్ల ఇందులోని కొన్ని విద్యాసంస్థల్లో కొందరు త్వరగా ఈ డిగ్రీలు పొందుతుంటే మరికొందరు వివిధ కారణాల వల్ల వాటిని పొందడం ఆలస్యమవుతుంది. అలాంటి సందర్భాల్లో అందరూ ఒకే అర్హత ఒకేసారి పొందడం ఎంత అసాధ్యమో నిబంధనల నిర్దేశకులకు తెలియకపోవడం ఆశ్చర్యం. 


ఇప్పటిదాకా నెట్ వంటి జాతీయ అర్హత పరీక్ష, సెట్ వంటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష, ఈ రెండూ కాని పక్షంలో 2009 యుజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి అధ్యాపకులుగా అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు వీటితో పాటు పీహెచ్‌డీని కూడా తప్పనిసరి చేయడం వల్ల ఒరిగే ప్రయోజనమేమీ లేదు. అసలే అధ్యాపక ఉద్యోగాల భర్తీ జరగక కునారిల్లుతున్న ఉన్నత విద్య, ప్రమాణాల పరంగా మరింత దిగజారుతుంది. 


సాధారణంగా పీహెచ్‌డీ పట్టా పొందాలంటే ఒక ప్రక్రియ ఉంటుంది. ఎవరైనా తమ సిద్ధాంత గ్రంథాలు మూడేళ్ళ తర్వాత సమర్పించొచ్చు. వాటిని పరిశీలనకు పంపడం, ఆ సిద్ధాంతాన్ని ఆధారాలతో సమర్థించుకునే ఓరల్ వైవా ఇదంతా జరగడానికి కనీసం నాలుగేళ్ళు పడుతుంది. కొందరికి ఏడెనిమిదేళ్ళు పట్టే అవకాశం కూడా ఉంది. ఒకోసారి నిర్దేశిత సమయం ముగిసిపోయి మరలా పునః ప్రవేశం పొందేవారూ  ఉంటారు. ఇంత సమయం పట్టే ఒక డిగ్రీని, వర్సిటీలలో అధ్యాపక ఉద్యోగాల నియామకానికి అర్హతగా పెట్టడంవల్ల ఏమి సాధించాలని కోరుకుంటున్నట్టు? 


2021 జూలై తరువాత, ఇప్పుడు అర్హతలుగా ఉన్న నెట్, సెట్ వంటి పరీక్షలలో ఉత్తీర్ణులైనవారు సైతం పీహెచ్‌డీ పూర్తి చేసేదాకా వర్సిటీలలో అధ్యాపక ఉద్యోగాలకు అర్హులే కారు. ఇదెలా న్యాయం? ఇప్పుడు ఈ నిబంధన పెట్టడం వల్ల, కొండంత ఆశతో జాతీయ స్థాయి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై టీచింగ్ వైపు మళ్ళాలి అనుకునే ప్రస్తుత డిగ్రీ, పీజీ విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దానితో ఇప్పటికి ఉన్న దానికంటే మరింత మానవవనరుల కొరత ఏర్పడుతుంది ఉన్నత విద్యారంగంలో. 2022 ఫిబ్రవరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. అంటే 2021 జూలై 1 కల్లా వర్సిటీలలో బోధనకు పీహెచ్‌డీ తప్పనిసరి అనే నిబంధనను యూజీసీ సవరించకుంటే  నెట్ మాత్రమే ఉత్తీర్ణులై ఉండి, పీహెచ్‌డీ పూర్తికాని వారంతా అ ఉద్యోగాలకు అనర్హులే. అంటే ఇన్నాళ్ళూ నిర్దేశిత అర్హతలున్నా, ఉద్యోగాల భర్తీ లేక ఇప్పుడు వారు తమకున్న అవకాశాన్ని కోల్పోతున్నవారే. మరి యూజీసీ వీరికి ఎలా న్యాయం చేస్తుంది?  


ఒక నిబంధనల పత్రం విడుదల చేసి, ఉద్యోగాల భర్తీ జరిగిందో లేదో చూడకుండా, ఇప్పుడు ఆ నిబంధనలు అమలులోకి తెస్తే ఎంత అన్యాయం? అసలు ఉద్యోగాల భర్తీని యూజీసీ ఎప్పుడైనా పర్యవేక్షించిందా? అర్హతల పేర ఉద్యోగాలు కోల్పోతున్న భారత దేశ యువ పరిశోధకుల భవితను కాపాడటానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి.

పచ్చల రాజేష్

Updated Date - 2021-07-13T06:44:02+05:30 IST