ప్రత్యామ్నాయం ప్రభవించేనా?

ABN , First Publish Date - 2020-11-11T05:53:11+05:30 IST

దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఒక పార్టీ గెలవాలని, మరో పార్టీ ఓడి పోవాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఈ ఆకాంక్షలు...

ప్రత్యామ్నాయం ప్రభవించేనా?

జాతీయస్థాయిలో కాంగ్రెస్, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్‌తో పాటు ఆయా ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం, విశ్వసనీయత కోల్పోవడం వల్లే బిజెపి ఎదుగుదలకు ఆస్కారం కలుగుతోందని మాటిమాటికీ రుజువవుతోంది. ఈ పరిణామాల రీత్యా దేశ రాజకీయాల్లో ఇప్పట్లో ప్రత్యామ్నాయం ఉండదని ఎవరైనా అంటే కాదనలేము కాని, ఎప్పటికీ రాదని మాత్రం చెప్పలేం. అందుకు ఆరోగ్యకరమైన చర్చ, నిర్మాణాత్మకమైన అన్వేషణ జరగాలి. శాపనార్థాలు, కవితాత్మక భావావేశాల వల్ల ప్రత్యామ్నాయాలు పుట్టవు.


దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఒక పార్టీ గెలవాలని, మరో పార్టీ ఓడి పోవాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఈ ఆకాంక్షలు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన వారివైతే అర్థం చేసుకోవచ్చు కాని ఏ రాజకీయ పార్టీకి చెందని వారు కూడా ఫలానా పార్టీ ఓడిపోవాలన్న తమ ఆకాంక్షను బయటపెడుతూ ఉంటారు. ఈ ఆకాంక్షలకూ, క్షేత్రస్థాయి వాస్తవాలకూ పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు. లేదా తమ మనసుల్లో ఉన్నదే క్షేత్రస్థాయి వాస్తవమని వారు భావిస్తుండవచ్చు, సోషల్ మీడియాలో ప్రకటించే అభిప్రాయాలనుబట్టి వారి ఆలోచనా విధానాలను అంచనా వేయవచ్చు కాని ఫలితాలను అంచనా వేయడానికి వీల్లేదు. దేశంలో జరుగుతున్న పరిణామాలను గ్రహించలేనివారు, కళ్లముందు జరుగుతున్న వాస్తవా లను అర్థం చేసుకోనివారు చేసే అంచనాలను విశ్లేషణలుగా తీర్మానించడానికి వీల్లేదు. 


నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి అభిప్రాయాలు తరుచూ వినపడుతూనే ఉన్నాయి. బీజేపీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కేవలం మోదీ, అమిత్ షాలపట్ల వ్యతిరేకతతో, బిజెపి పట్ల సైద్ధాంతిక వ్యతిరేకతతో ఆ పార్టీ ఓడిపోవాలని అనేకమంది అనేక సందర్భాల్లో ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉంటారు. కాని అత్యధిక సందర్భాల్లో ఈ శాపనార్థాలతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో బిజెపికి అత్యధిక మెజారిటీ రాదని, బొటాబొటి వస్తుందని చాలామంది భావించారు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ములాయంసింగ్, మాయావతి కలిసి పోటీ చేయడం వల్ల బిజెపికి సగానికి సగం సీట్లు తగ్గిపోతాయని అనేకమంది అంచనా వేశారు. ఈ అంచనాలు సరైనవి అనుకుని ఆ దృష్టితో రాజకీయ పరిణామాలను అధ్యయనం చేస్తే బహుశా అదే జరుగుతుందేమోనని అనిపించింది. కాని 2019లో అనూహ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి అత్యధిక లోక్‌సభ సీట్లు రావడమే కాక జాతీయస్థాయిలో కూడా మోదీ ఆధ్వర్యంలో ఆ పార్టీ 2014లో కంటే అత్యధిక స్థానాలు గెలుచుకుంది.


బిజెపి పరాజయం చెందాలనుకునేవారికి కారణాలు లేవనలేం. ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, కొవిడ్-–19 సృష్టించిన సమస్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవస్థలను నియంత్రించడం, అనేక అప్రజాస్వామిక చర్యలకు పాల్పడడం మొదలైనవెన్నో ఉన్నాయి. గతంలో కంటే ఎక్కువగా మధ్యతరగతిలో కూడా బిజెపి ఆర్థిక విధానాల వైఫల్యం పట్ల నిస్పృహ, అభద్రతాభావం, అనుమానాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వలసకార్మికులకు జరిగిన ఘోరమైన అన్యాయం ఇంకా జనం కళ్లముందు కదులుతున్నది. బిజెపి మతం కార్డు, దేశభక్తి కార్డును ఉపయోగించుకోవడం మోతాదును మించిపోయింది. వీరు ఇవి తప్ప మిగతా అంశాల గురించి మాట్లాడరనే అభిప్రాయం వ్యక్తం చేసేవారు పెరిగిపోతున్నారు. ఈ రీత్యా చూస్తే బిజెపి ఆదరణ కోల్పోవడానికి వీలైన అనేక కారణాలు ఉన్నాయి.


అయినప్పటికీ బిజెపి ఎదురుదెబ్బ తిన్న సందర్భాలు తక్కువగా కనపడుతున్నాయి. బిజెపి ప్రతి ఎన్నికల్లోనూ ఏదో వ్యూహరచన చేసి గెలుస్తుందని, ఆ వ్యూహరచనను తట్టుకోవడం ఇతర పార్టీలకు కష్టం అవుతుందనే వాదనలు కూడా వినపడుతున్నాయి. ‘మీడియాకు, కీలక వ్యవస్థలకు స్వేచ్ఛ ఇస్తే మోదీ ప్రభుత్వం చాలా కాలం మనుగడలో ఉండదు..’ అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఒక సందర్భంలో అన్నారు. కాని అందులో కూడా పూర్తి వాస్తవం ఉందని చెప్పడానికి వీల్లేదు. ఎమర్జెన్సీలో ఇంతకంటే ఘోరంగా వ్యవస్థల్ని తొక్కిపెట్టారు. అయినప్పటికీ 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ పరాజయం చెందారు. మీడియాను, వ్యవస్థల్ని తొక్కిపెట్టినంత మాత్రాన, కొన్ని భావజాలాల్ని అణిచివేసినంత మాత్రాన, నియంతృత్వ పోకడల్ని ప్రదర్శించినంత మాత్రాన ఎన్నికల్లో మాటిమాటికీ ఎవరూ గెలవలేరు. ‘ఈవీఎం అంటే ప్రతి ఓటూ మోదీకే (ఎవరీ ఓట్ టు మోదీ)’ అని కునాల్ కమ్రాలాంటి హాస్య విశ్లేషకులు వ్యాఖ్యానించినంత మాత్రాన అది వాస్తవం అయ్యేందుకు ఆస్కారం లేదు. మోదీ టీమ్ గెలుపుకు ఏదో కారణం ఉన్నదన్న విషయంపై సమగ్ర దృష్టితో అధ్యయనం అవసరం.


ఒక రకంగా ఆలోచిస్తే దేశంలో 2014 ముందు నుంచీ మోదీకి అనుకూలంగా ఏర్పడుతున్న ప్రజాభిప్రాయం ఇంకా సమసిపోలేదు. సరికదా కొత్త ప్రాంతాల్లో విస్తరిస్తోంది. క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం (Law of diminishing marginal utility) అనుసరించి మోదీపై జనానికి వెగటు పుట్టిందని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. మోదీ ఉపయోగిత విలువ ఇంకా తగ్గలేదని చెప్పడానికే ఎక్కువ అధారాలు కనపడుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ఒకటి చాలామంది భావిస్తున్నట్లుగా మోదీ జనాదరణ ఇంకా తగ్గలేదు. కొత్తకొత్త పద్ధతులతో కొత్తకొత్త విన్యాసాలు ప్రదర్శిస్తూ తన వినూతనత్వాన్ని ఆయన ఇంకా కాపాడుకోగలుగుతున్నారు. ఒకో రాష్ట్రానికి ఒకో వ్యూహాన్ని అవలంబిస్తున్నప్పటికీ మోదీ ప్రతి రాష్ట్రంలోనూ తన ప్రబావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాల్ని, ఆ రాష్ట్రాల్లో జరిగిన అవినీతిని ఎండగడుతూనే పుల్వామా, సైనికులు, రామమందిరం వంటి భావోద్వేగ అంశాలను ఉపయోగించుకుంటున్నారు. అవినీతి గురించి ఎంత మాట్లాడినప్పటికీ ఎన్నికల్లో పెద్దఎత్తున నిధుల్ని ప్రవహింప చేయడంలో బిజెపి వెనుకాడదు. అందుకు ఆ పార్టీకి వ్యాపారవేత్తలతో ఉన్న సాన్నిహిత్యం తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. అంతేకాక ప్రతి రాష్ట్రంలోనూ ఎంతో ముందు నుంచి బిజెపి సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు, కులాలు, ఉపకులాలు, మతాలవారీగా ఓటర్లను విభజించేందుకు చర్యల్ని ప్రారంభిస్తుంది. ఉదాహరణకు వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్ ఎన్నికలకు బిజెపి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నది.


బిజెపి ఎదుగుదలకు ఆ పార్టీ అగ్రనేతలే పూర్తి కారణం కాదు. ప్రతిపక్షాలు కూడా దాని ఎదుగుదలలో ప్రధానపాత్ర పోషిస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ బిజెపికి వ్యతిరేకంగా బలమైన పార్టీగా అవతరించడంలో గత ఆరేళ్లుగా చేసిన ఏ ప్రయత్నమూ అంతగా విజయవంతం కాలేదు. కొన్నిచోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రభుత్వాలను కాపాడుకోవడంలో విఫలం అయింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో బిజెపి విజయవంతం కాలేకపోయినప్పటికీ మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఆ పార్టీ ఫార్ములా విజయం సాధించింది. అధికార పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వారిని తమ పార్టీ టికెట్‌పై పోటీ చేయించి గెలిపించిన వ్యూహం ఈ రెండు రాష్ట్రాల్లో ఫలించింది. మధ్యప్రదేశ్‌లో వృద్ధ నేతలను ప్రోత్సహించి, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలను విస్మరించడం వల్ల జరిగిన నష్టం ఇప్పుడు స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా దేశంలో తాజాగా ఉప ఎన్నికలు జరిగిన అనేక ప్రాంతాల్లో బిజెపి తన ప్రాభవం చాటుకుంది. తెలంగాణలో గత లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన రెండో ఉపఎన్నికలో బిజెపి విజయం సాధించడం విస్మరించదగిన అంశం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ప్రవేశించడం కష్టమని ఒకప్పుడు వాదనలు వినపడేవి. కాని తెలంగాణలో ఈ వాదనకు ఇప్పుడు గండిపడుతోంది. జాతీయస్థాయిలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడి ప్రతిపక్ష స్థానాన్నో, అధికార పీఠాన్నో బిజెపికి వెండిపళ్లెంలో పెట్టి ఇవ్వడమే ఇందుకు కారణం. కేవలం ట్వీట్‌ల ద్వారానో, పత్రికా ప్రకటనల ద్వారానో బిజెపిని, నరేంద్రమోదీని జాతీయస్థాయి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తే సరిపోదని, మొత్తం కాంగ్రెస్ వ్యవస్థనే ప్రక్షాళనం చేసి కొత్త వర్గాలతో పార్టీని అంతటా పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


ఉదాహరణకు బీహార్‌లో గత కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 2015లో కేవలం 41 సీట్లకు పోటీ చేసి 27 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 70 సీట్లకు పోటీ చేసి 20 సీట్లే సాధించింది. మిగతా 50 సీట్లు బిజెపికి అనుకూలంగా మారాయనడంలో సందేహం లేదు. అదే కాంగ్రెస్ సంస్థాగతంగా తనను తాను బీహార్‌లో బలోపేతం చేసుకుని ఉంటే బిజెపికి అడ్డుకట్ట వేయగలిగేదేమో. మోదీని ఆడిపోసుకోవడం కన్నా నిర్మాణాత్మకంగా వ్యవహరించగలిగిన శక్తి కాంగ్రెస్‌కు లేదని దీనితో తేలిపోయింది. నిజానికి వామపక్షాలకు కేవలం 29 సీట్లే ఇచ్చినప్పటికీ వాటిలో సగానికి పైగా గెలుచుకోలిగాయి. కేవలం రాష్ట్రీయ జనతాదళ్ మాత్రమే బిజెపి ధాటిని అడ్డుకోవడానికి ఒంటరి పోరు చేయాల్సి వచ్చింది.


జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలహీనపడడం, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెస్‌తో పాటు ఆయా ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం, విశ్వసనీయత కోల్పోవడం వల్లే బిజెపి ఎదుగుదలకు ఆస్కారం కలుగుతోందని మాటిమాటికీ రుజువవుతోంది. బీహార్‌లో జనతాదళ్ (యు) ఈ ఎన్నికల్లో బలహీనపడితే ఆ పార్టీతో స్నేహం చేసిన బిజెపికి గతంలో కంటే ఎక్కువ సీట్లు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు ములాయంసింగ్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేసిన జనతాదళ్ కనుమరుగైంది. కర్ణాటకలో ఒకప్పుడు దేవెగౌడను ముఖ్యమంత్రిని చేసిన జనతాదళ్ ఇప్పుడు క్షీణదశలో ఉన్నది. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మరో జనతాదళ్ కూడా చరిత్రపుటల్లో కలిసిపోయేందుకు ఎక్కువ కాలం పట్టదేమో నని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. జనతాదళ్ సంగతి అటుంచి ప్రాంతీయ పార్టీల్లో అత్యధికం ఇప్పుడు అస్తిత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ములాయం, మాయావతి వంటి ప్రాంతీయ పార్టీల నేతలు అవలంబించిన అవకాశ వాద రాజకీయాలు, అవినీతి, అరాచక పాలన ఉత్తరప్రదేశ్‌లో బిజెపి బలపడడానికి ఆస్కారం కలిగించింది. ఈ పరిణామాల రీత్యా దేశ రాజకీయాల్లో ఇప్పట్లో ప్రత్యామ్నాయం ఉండదని ఎవరైనా అంటే కాదనలేము కాని, ఎప్పటికీ రాదని మాత్రం చెప్పలేం. అందుకు ఆరోగ్యకరమైన చర్చ, నిర్మాణాత్మకమైన అన్వేషణ జరగాలి. శాపనార్థాలు, కవితాత్మక భావావేశాల వల్ల ప్రత్యామ్నాయాలు పుట్టవు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-11-11T05:53:11+05:30 IST