బెల్టుకు బ్రేకులు పడేనా?

ABN , First Publish Date - 2021-06-18T07:02:34+05:30 IST

కరోనా వేళ గ్రామాల్ల బెల్టు షాపుల అమ్మకాలు జోరందుకున్నాయి. లాక్‌డౌన్‌తో పరిమిత సమయంలోనే మద్యం దొరుకుతుంది.

బెల్టుకు బ్రేకులు పడేనా?
బెల్టుషాప్‌

 ఊరూరా మద్యం దుకాణాలు
 అర్ధరాత్రి వరకు విక్రయాలు
 లాక్‌డౌన్‌తో జోరుగా అమ్మకాలు

(ఆంధ్రజ్యోతి, సూర్యాపేట)

కరోనా వేళ గ్రామాల్ల బెల్టు షాపుల అమ్మకాలు జోరందుకున్నాయి. లాక్‌డౌన్‌తో పరిమిత సమయంలోనే మద్యం దొరుకుతుంది. మే 12న రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే మొదటి సారి దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే తెరిచారు. తర్వాత ఉదయం 6 గంటల నుంచి  మధాహ్నం ఒంటి గంట వరకు తెరిచారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమనుమతి ఇచ్చారు. దీంతో వైన్స్‌ షాపుల సమయం మించితే గ్రామాల్లో బెల్టు షాపుల్లో లభించే మద్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో బెల్టుషాపు లేని గ్రామం లేదంటే ఆశ్చర్యం పోవాల్సిందే. అర్ధరాత్రి వెళ్లినా మద్యం లభిస్తుంది. ప్రతి గ్రామంలో 7 నుంచి 20దాకా బెల్టు షాపులున్నాయి. దాదాపు అధిక శాతం కిరాణ దుకాణదారులు విక్రయిస్తున్నారు. ఒక క్వార్టర్‌ మద్యం సీసాకు రూ.10 నుంచి 20దాకా అధికంగా వసూలు చేస్తున్నారు. సమీప వైన్స్‌ల నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి గ్రామాలల్లో విక్రయిస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లు ఉంటున్నారు. లాక్‌డౌన్‌తో బెల్టు షాపులకు మరింత గిరాకీ పెరుగుతోంది. అనుమతులు లేకున్నా నిబంధనలు తుంగలో తొక్కి గ్రామాల్లో వాటిని కొనసాగిస్తున్నారు. అడపాదడపా కేసులు మినహా పూర్తిగా నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అరికట్టాల్సిన వారిలో కొందరు మామూళ్లకు అలవాటు పడడంతో అడ్డూ అదుపు లేకుండా పోతోంది.
ఓ ఊర్లో 20బెల్టు షాపులు
సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో 20బెల్టు షాపులు ఉన్నాయంటే ఆశ్చర్య పడాల్సిన పరిస్థితి లేదు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఈ గ్రామంలోనే ఇన్ని ఉంటే మారు మూల గ్రామాలల్లో ఎన్ని బెల్టు షాపులు ఉన్నాయో లెక్కలేదు. మోతె మండలం హుస్సేనబాద గ్రామంలో 40బెల్టు షాపులు, చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంలో ఐదు బెల్టు షాపులు న్నాయి. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది.  గుడుంబాను నిషేదించడంతో మద్యం తాగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ బె ల్టు షాపులు ఉండడంతో బానిసలవుతున్నారు. ఫలితంగా కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నిత్యం కలహాలు చోటు చేసుకుంటున్నాయి. చేసేది ఏమిలేక భార్యలు కుటుంబ పోషణ కోసం కూలీకి వెళ్తున్నారు. రెండ్రోజుల క్రితం సూర్యాపేట మండలం కాసరబాద లో మద్యం విషయంలో భార్యభర్తలు గొడవ పడి భర్త ఆత్మహత్యయత్నం చేశారు.
ప్రోత్సహిస్తున్న వైన్స్‌ యజమానులు
కొన్ని చోట్ల వైన్స్‌ యజమానులే బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది. తమ బినామీలతో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదాహరణకు వైన్స్‌లో బీరు ధర రూ.150 ఉంటే గ్రామాలలో రూ.180కి అమ్ముతున్నారు. ప్రతి క్వార్టర్‌పై రూ.20ఎక్కువగా అమ్ముతున్నారు. బెల్టు షాపుల నిర్వహణ వల్ల ఘర్షణలు ఎక్కువయ్యే అవ కాశం ఉంది. కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం శ్రీరంగపురంలో పూర్తిగా బెల్టు షాపులను అరికట్టారు. ఆ ఊరిలో మద్యం విక్రయిస్తే భారీ జరి మానా విధిస్తున్నారు. దీంతో అక్కడ మద్యం విక్రయా లు బంద్‌ అయ్యాయి. ఇదే తరహాలో మిగిలిన పల్లెలు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి ఒంటి గంట వరకు మద్యం దొరకని గ్రామాలు లేవు. కొన్ని చోట్ల గుడి పక్కన, బడి సమీపంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదు. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉంటే 1500 దాకా బెల్టు షాపులు ఉన్నట్లు అధికారిక సమాచారం.
గుడుంబాపై నియంత్రణ
గుడుంబా తయారీని అరికట్టడంలో ప్రభుత్వం సఫలమైంది. బెల్టు షాపులను అరికట్టడంలో మాత్రం శ్రద్ధ చూపడంలేదు. అడపాదడఫా దాడులు మినహా సరైన చర్యలు తీసుకోవడంలేదు. ఎక్సైజ్‌ వారికి కూడా మద్యం విక్రయాలకు టార్గెట్‌ విధిస్తుండడంతో వారు కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో ప్రతినెలా 80వేల బాక్స్‌ల విక్రయాలు
జిల్లాలో 75 వైన్స్‌ షాపులు, 17బార్లు ఉన్నాయి. ప్రతినెలా 70వేల నుంచి 80వేల బాక్స్‌ల మద్యం విక్రయిస్తారు. సంవత్సరానికి సుమారు రూ.500 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. లాక్‌డౌన్‌తో బార్లు మూతపడ్డాయి. వైన్స్‌లు మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు.

Updated Date - 2021-06-18T07:02:34+05:30 IST