నిరీక్షణ ఫలించేనా!

ABN , First Publish Date - 2021-07-26T03:11:07+05:30 IST

నిరీక్షణ ఫలించేనా!

నిరీక్షణ ఫలించేనా!

గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూపులు

యూనిట్‌ పెంపుపై సర్కారు ప్రకటన

రూ.1.75లక్షలు కేటాయిస్తామని హామీ

మొదటి విడతలో 15,371 మందికే పంపిణీ

రెండో దశలో 16,814 లబ్ధిదారుల గుర్తింపు

మూడేళ్లుగా ఆశల పల్లకిలోనే..


సిద్దిపేట జిల్లాలోనే శ్రీకారం చుట్టుకున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం ఒక అడుగు ముందుకు .. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. మూడేళ్ల క్రితం తొలి విడతగా గొర్రెలను పంపిణీ చేయగా.. రెండో విడత కోసం లబ్ధిదారులు నేటికీ నిరీక్షిస్తునే ఉన్నారు. పలుమార్లు హామీలు ఇస్తున్నప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. తాజాగా గొర్రెల యూనిట్‌ ధరను 1.75లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మళ్లీ ఆశలు పుట్టుకొచ్చాయి. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 25 : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 412 గొర్రెలకాపరుల సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల్లో 18 ఏళ్లు నిండిన గొల్లకుర్మలు 34,097 మంది ఉన్నట్లు మూడేళ్ల కిందట గుర్తించారు. గడిచిన మూడేళ్లలో 18 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరింత పెరిగే ఉంటుంది. 


15,371 మందికే పంపిణీ

మొదటి విడతలో 17,283 మందికి గొర్రెలు పంపిణీ చేయాలని గుర్తించారు. వీరందరు కూడా రూ.31,250 చొప్పున డీడీలు చెల్లించారు. అయితే 15,371 మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా మొదటి విడతకు సంబంధించి సుమారు 2 వేల మంది లబ్ధిదారులు ఉంటారు. దీనికి తోడు రెండో విడతలో 16,814 మందికి పంపిణీ చేయాలని నాడు వివరాలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు వీరి గురించి అతీగతీ లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటనలు వచ్చినప్పుడల్లా డీడీలు కట్టడానికి సిద్ధమై.. ఆ తర్వాత షరామామూలే అంటూ మర్చిపోతున్నారు. తాజా ప్రకటనతోనైనా తమ ఆశలు నెరవేరతాయానని ఎదురుచూస్తున్నారు. 


రూ.1.75 లక్షలకు చేరనున్న యూనిట్‌ ధర

గొర్రెల పంపిణీ పథకం ఆరంభ సమయంలో 21 గొర్రెలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.1.25 లక్షల చొప్పున ఒక యూనిట్‌ ధరగా నిర్ణయించింది. ఇందులో 25 శాతం అంటే రూ.31,250 లబ్ధిదారులు చెల్లించాలి. మిగతా డబ్బును ప్రభుత్వమే భరిస్తుంది. ఈ క్రమంలో తొలి విడతలో కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 21 గొర్రెల చొప్పున కొనుగోలు చేశారు. అయితే పెరిగిన ధరలతో ప్రస్తుతం 21 గొర్రెలు రావడం లేదని, రూ.1.25లక్షలతో కేవలం 10 నుంచి 15 గొర్రెలు వస్తున్నాయని మొదటి విడతలో డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీంతో మరో రూ.50వేలు అదనంగా పెంచి, యూనిట్‌ ధరను రూ.1.75లక్షలకు పెంచేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే దీనిపై మార్గదర్శకాలు విడుదల కాలేదు. 


అక్రమాలకు కళ్లెం పడేనా?

మొదటి విడత గొర్రెల పంపిణీపై అనేక విమర్శలు వచ్చాయి. దళారులు చేరి ఈ పథకాన్ని పూర్తిగా అభాసుపాలు చేశారు. ఇందులో సంబంధిత అధికారుల మీద కూడా ఫిర్యాదులు అందాయి. గొర్రెలు కొనుగోలు చేసే చోటనే ఈ అక్రమాలకు పునాది పడ్డాయి. గొల్లకుర్మ వర్గాల్లో గొర్రెలు మేపేవారి సంఖ్య తక్కువగా ఉండడంతో.. ఇదే వర్గంలోని తటస్థుల పేరిట వచ్చిన గొర్రెలను తక్కువ ధరకు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి.  అంతేగాకుండా ఒక గొర్రెల యూనిట్‌ను నలుగురైదుగురి పేరిట రికార్డు చేసి.. రీసైక్లింగ్‌ చేసినట్లు పలు జిల్లాల్లో వెలుగుచూశాయి. అందుకే ఈ సారైనా అక్రమాలకు తెరపడితే ప్రభుత్వ లక్ష్యం గమ్యం చేరుతుంది. లేదంటే గొల్లకుర్మల స్థానంలో మళ్లీ దళారులే బాగుపడే పరిస్థితులు దాపురిస్తాయి.


Updated Date - 2021-07-26T03:11:07+05:30 IST