ఇదేం అభివృద్ధితాగునీరు ఇవ్వరా?

ABN , First Publish Date - 2022-06-30T10:28:37+05:30 IST

గొప్పలు చెప్పుకోవడం తప్ప కోడుమూరు అభివృద్ధికి ఏం చేశారు? మంచినీరు కూడా ఇవ్వనప్పుడు ఏం అభివృద్ధి చేసినట్లు అని కుర్ని వెల్ఫేర్‌ అండ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కృష్ణవేణి వైసీపీ ప్లీనరీలో మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో నాయకులను ప్రశ్నించారు.

ఇదేం అభివృద్ధితాగునీరు ఇవ్వరా?

వైసీపీ ప్లీనరీలో నాయకులను ప్రశ్నించిన కుర్ని కార్పొరేషన్‌  డైరెక్టర్‌ కృష్ణవేణి

కోడుమూరు, జూన్‌ 29: గొప్పలు చెప్పుకోవడం తప్ప కోడుమూరు అభివృద్ధికి ఏం చేశారు? మంచినీరు కూడా ఇవ్వనప్పుడు ఏం అభివృద్ధి చేసినట్లు అని కుర్ని వెల్ఫేర్‌ అండ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కృష్ణవేణి వైసీపీ ప్లీనరీలో మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో నాయకులను ప్రశ్నించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల కేంద్రంలోని స్నేహా కల్యాణ మండపంలో బుధవారం ప్ల్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్‌కుమార్‌, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ జరదొడ్డి సుధాకర్‌, కుడా చైర్మన్‌ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, కర్నూలు మేయర్‌ బీవై రామయ్య పాల్గొన్నారు. సమావేశంలో కుర్ని వెల్ఫేర్‌ అండ్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కృష్ణవేణి మాట్లాడుతూ ‘గత పాలకులు కోడుమూరు తాగునీటి సమస్యను తీర్చలేకపోయారు... మరి మన ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇక్కడి నాయకులు మంచినీటి సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు’ అని నిలదీశారు. ఇక్కడి నేతలకు సమస్యను తీర్చాలంటే వర్గాలు, ప్రాంతాలు అడ్డు వస్తున్నాయని ఆరోపించారు. ఆమె మాట్లాడినంత సేపు ప్రజలు చప్పట్లు కొడుతుంటే వేదిక మీద కూర్చున్న నేతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం తప్ప సమాధానం చెప్పలేకపోయారు. చివరికి పక్కన ఉన్న కార్యకర్తలు ఆమె చేతిలో ఉన్న మైకును లాగేసుకున్నారు. 

Updated Date - 2022-06-30T10:28:37+05:30 IST