రోజుకు 50 నుంచి 60 మందిని కరుస్తున్నాయ్‌.. ఆస్పత్రికి క్యూ!

ABN , First Publish Date - 2021-06-24T19:02:46+05:30 IST

భాగ్య నగరంలో వీధి శునకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయి.

రోజుకు 50 నుంచి 60 మందిని కరుస్తున్నాయ్‌.. ఆస్పత్రికి క్యూ!

  • ఆస్పత్రికి క్యూ కడుతున్న కుక్కకాటు బాధితులు
  • యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్ల కోసం పరుగులు

హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : భాగ్యనగరంలో వీధి శునకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారులు ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ బృందాలు బస్తీలలో తిరుగుతూ వీధి కుక్కలను పట్టుకెళ్లేవారు. గత నెల 12న లాక్‌డౌన్‌ విధించిన తర్వాత సిబ్బంది ఇటువైపు రావడం మానేశారని స్థానికులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో హోటళ్లు, రెస్టారెంట్లు సరిగా నడవకపోవడంతో వీధి కుక్కలు ఆకలితో అలమటిస్తూ కోపంతో ప్రజలపై దాడి చేస్తున్నాయి.


పెరిగిన బాధితులు

లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు రోడ్లపైకి సరిగా రాకపోవడంతో కుక్కకాటు బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గింది. లాక్‌డౌన్‌ సడలింపులు, ఆ తర్వాత పూర్తిగా ఎత్తివేయడంతో బాధితుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఇప్పుడు అధిక సంఖ్యలో బాధితులు ఫీవర్‌, నారాయణగూడ ఐపీఎంకు క్యూ కడుతున్నారు. నగరంలోని అన్ని బస్తీలలోనూ కుక్కల బెడద తీవ్రంగా ఉంది. అయినా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.


రోజుకు 40 నుంచి 70 కేసులు..

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి రోజూ 40 మంది నుంచి 70 మంది వరకూ కుక్కకాటు బాధితులు వస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత కేసులసంఖ్య మరింత పెరిగింది. ఒక్క జూన్‌ నెలలోనే ఇప్పటి వరకు దాదాపు 1300 కేసులు నమోదు కావడం గమనార్హం. ఫీవర్‌ ఆస్పత్రికి సోమవారం 68 మంది కుక్కకాటు బాధితులు, మంగళవారం 42 మంది వచ్చారు. ఈ సంవత్సరం జనవరిలో 1929, ఫిబ్రవరిలో 1807, మార్చిలో 1914, ఏప్రిల్‌ 1639, మే నెలలో 1002 కేసులు నమోదు అయ్యాయి.


ఈ ప్రాంతాల నుంచే అధికం..

రెండు దశాబ్దాల క్రితం జీహెచ్‌ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకొని చంపేసేవారు. బ్లూ క్రాస్‌తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు చేసిన పోరాటం ఫలితంగా ఆ విధానానికి స్వస్తి పలికారు. పట్టుకున్న వాటికి సంతానోత్పత్తి కాకుండా ఆపరేషన్‌ చేసి గుర్తుగా చెవులనూ కత్తిరించి పట్టుకున్న చోటే తిరిగి వదిలి పెడుతున్నారు. నల్లకుంట, అంబర్‌పేట, రామంతాపూర్‌, మల్కాజిగిరి, మలక్‌పేట, గాంధీనగర్‌, మేడిపల్లి, నాగోల్‌, సీతాఫల్‌మండి, తార్నాక, వెస్ట్‌ మారేడ్‌పల్లి, ఉప్పల్‌, సైదాబాద్‌, చాంద్రాయణగుట్ట, నేరేడ్‌మెట్‌, టోలిచౌకి, చింతల్‌బస్తీ, సరూర్‌నగర్‌, నాచారం ప్రాంతాలలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది.


ఇంజెక్షన్ల కోసం.. 

నారాయణగూడలోని ఐపీఎంలో కుక్కకాటు బాధితులు యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్ల కోసం వస్తున్నారు. ఇక్క డ 50 నుంచి 100 మంది వరకు రోజూ ఈ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండటం గమనార్హం.


షెల్టర్లు ఏర్పాటు చేయాలి..

వీధి కుక్కల సంతానోత్పత్తిని పూర్తిగా కంట్రోల్‌ చేయడానికి ఏనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ)ను బలోపేతం చేయాలి. యాంటీరేబిస్‌ ఇంజెక్షన్లను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. సంతానోత్పత్తి నివారణ ఆపరేషన్లను ఎక్కువగా చేయాలి. వీధికుక్కలకు షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తు తం అంబర్‌పేట, జీడిమెట్ల, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, చుడీబజార్‌లలో కుక్కల షెల్టర్లను ఏర్పాటు చేశారు. కుక్కలను రోడ్లమీద వదులుతున్న ఇంటి యజమానులను జీహెచ్‌ఎంసీ గుర్తించి చర్యలు తీసుకోవాలి. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి. - మహేష్‌ అగర్వాల్‌, రాష్ట్ర ఏనిమల్‌ బోర్డు సభ్యులు.

Updated Date - 2021-06-24T19:02:46+05:30 IST