California లో షాకింగ్ ఘటన.. Mountain Lion తో శునకం వీరోచిత పోరాటం.. యజమానురాలిని కాపాడేందుకు..

ABN , First Publish Date - 2022-05-24T01:12:55+05:30 IST

యజమాని ప్రాణాలను కాపాడేందుకు శునకాలు తన ప్రాణాలను సైతం పణంగా పెడతాయని చెప్పేందుకు బహుశా ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండకపోవచ్చు.

California లో షాకింగ్ ఘటన.. Mountain Lion తో శునకం వీరోచిత పోరాటం.. యజమానురాలిని కాపాడేందుకు..

ఎన్నారై డెస్క్: యజమాని ప్రాణాలను కాపాడేందుకు శునకాలు తన  ప్రాణాలను సైతం పణంగా పెడతాయని చెప్పేందుకు బహుశా ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండకపోవచ్చు. మౌంటెయిన్ లయన్(Mountain Lion, భారీ అడవి పిల్లి) ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రమాదపు అంచులకు చేరుకున్న ఓ కాలిఫోర్నియా యువతిని ఆమె పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఎరీన్ విల్సన్(24) అనే యువతి ఇటీవల విహార యాత్ర కోసమని ట్రినిటీ నది వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె సమీపంలోనే ఉన్న ఓ చిన్న గుట్టపై ఎక్కేందుకు(ట్రెక్కింగ్) వెళ్లింది. ఇంతలో అక్కడ ఉన్న పొదల్లో దాగున్న ఓ మౌంటెయిన్ లయన్ ఆపై అకస్మాత్తుగా వెనకు నుంచి దాడి చేసింది. దీంతో.. భయపడిపోయిన ఆమె వెంటనే తన పెంపుడు శునకం ఈవా కోసం పెద్దపెట్టున కేకలు వేసింది. యజమాని పిలుపు విన్న వెంటనే అక్కడికి వచ్చిన శునకం... మరో ఆలోచన లేకుండా ఆ భారీ పిల్లిపై దాడి ప్రారంభించింది. ఆకారంలో మౌంటెయిన్ లయన్ కంటే చిన్నా గా కూడా ఉన్నా తెగించి మరీ వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో కుక్క పుర్రె ఎముకల్లో పగుళ్లు వచ్చాయి. అయినా కూడా లెక్క చేయక ఈవా పిల్లిపై ఎదురుదాడికి దిగడంతో ఆ మౌంటెయిన్ లయన్ పారిపోయింది. దీంతో.. ఎరీన్ ప్రాణాలతో బయటపడింది.  ఆ తరువాత.. ఎరీన్ తీవ్రగాయాల పాలైన శునకాన్ని  వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చింది. కుక్క గాయాలు చూసి వైద్యులు కూడా తొలుత కంగారు పడ్డారు. కానీ..ఈవా మాత్రం మెల్లమెల్లగా కోలుకోవడం ప్రారంభించడంతో ఎరీన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన వివరాలను వెల్లడిస్తూ ఎరీన్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. 



Updated Date - 2022-05-24T01:12:55+05:30 IST