Hyderabad లో డ్రగ్స్ కట్టడికి డాగ్స్.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..!

ABN , First Publish Date - 2022-02-22T18:25:24+05:30 IST

నగరంలో మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు...

Hyderabad లో డ్రగ్స్ కట్టడికి డాగ్స్.. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..!

  • రంగంలోకి ఆరు ప్రత్యేక జాతులు
  • మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేలా శిక్షణ

హైదరాబాద్‌ సిటీ : నగరంలో మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. మూడు కమిషనరేట్స్‌ పరిధిలో సుమారు 1000 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా.. డ్రగ్స్‌ నిర్మూలన చర్యల్లో శునకాలను సైతం భాగస్వామ్యం చేస్తున్నారు. డ్రగ్స్‌, గంజాయిని అరికట్టేందుకు పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారులు ప్రత్యేక డాగ్స్‌ టీమ్‌లను సిద్ధం చేస్తున్నారు. 


ట్రై కమిషనరేట్‌ పరిధిలో 40 వరకు ప్రత్యేక డాగ్స్‌కు మాదక ద్రవ్యాలను గుర్తించే శిక్షణ ఇస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ అకాడమీలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొయినాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ టైన్రింగ్‌ అకాడమీలో శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.


ప్రత్యేక శిక్షణ.. 

నార్కోటిక్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ టీమ్‌ ఆధ్వర్యంలో లాబ్రోడర్‌, జర్మన్‌ షప్పర్డ్‌, డాబర్‌మ్యాన్‌, ఆల్‌మిషియన్‌, గోల్డెన్‌ రిట్రైవర్‌, దాల్మీషియన్‌ వంటి ప్రత్యేక జాతులకు శిక్షణ ఇస్తున్నారు. ఎయిర్‌పోర్టులో తనిఖీలు, నగర శివారు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద, అనుమానాస్పద ప్రాంతాల్లో ఈ డాగ్స్‌తో మాదక ద్రవ్యాల ఉనికిని గుర్తిస్తారు. బాంబు స్క్వాడ్‌ డాగ్స్‌ ఎలా అయితే బాంబు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి పోలీసులకు తెలిసే విధంగా సిగ్నల్స్‌ ఇస్తాయో.. మాదక ద్రవ్యాలను గుర్తించే డాగ్స్‌ కూడా అదే విధంగా పని తీరు కనబరుస్తాయని శిక్షకులు వెల్లడించారు. ఈ శునకాల్లో వాసన పసిగట్టడం, గుర్తించడం, వినడం వంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్నారు.


8 నెలల పాటు శిక్షణ..

ప్రత్యేక డాగ్స్‌కు 8 నెలల పాటు శిక్షణ ఉంటుంది. అయితే శునకాలు పిల్లలుగా ఉన్నప్పటి నుంచే శిక్షణ ప్రారంభిస్తారు. మూడు నెలల పప్పీ నుంచే శిక్షణలోకి తీసుకుంటున్నారు. వాటి వయసు పెరుగుతున్న కొద్దీ ట్రైనింగ్‌ అప్‌గ్రేడ్‌ చేస్తారు. బాంబును కొన్ని మీటర్ల దూరం నుంచే ఎలా అయితే గుర్తిస్తాయో.. డ్రగ్స్‌ను కూడా అలాగే గుర్తించేలా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డాగ్స్‌ను ఫీల్డ్‌లోకి పంపినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-02-22T18:25:24+05:30 IST