డాలర్‌ డ్రీమ్స్‌కు సై

ABN , First Publish Date - 2021-01-22T11:06:00+05:30 IST

అమెరికా....వెళ్లి సెటిలవుదామనుకున్నా, చదువుకుందామనుకున్నా ఇక ఎంత మాత్రం ఇబ్బంది లేదు. ఆంక్షలు, చెకింగ్స్‌, బలవంతపు పంపేయడాలు, కాళ్లకు బంధనాలు, కోర్టు కేసులు, డిటెన్షన్‌ సెంటర్లలో నిర్బంధాలు... వీటన్నింటికీ ఇక స్వస్తి!! నాలుగు రాళ్లు సంపాదించుకోడానికో, లేక మక్కువ తోనో అక్కడికి వెళ్లి..

డాలర్‌ డ్రీమ్స్‌కు సై

గ్రీన్‌కార్డులకు దేశాల వారీ పరిమితి ఎత్తివేత

హెచ్‌1బీ కుటుంబీకులూ పని చేసుకోవచ్చు

గ్రీన్‌కార్డు పొందేందుకు రోడ్‌మ్యాప్‌

సమగ్ర బిల్లును కాంగ్రెస్‌కు పంపిన బైడెన్‌

 వేలాది మంది భారతీయులకు తీపికబురు


వాషింగ్టన్‌, జనవరి 21: అమెరికా....వెళ్లి సెటిలవుదామనుకున్నా, చదువుకుందామనుకున్నా ఇక ఎంత మాత్రం ఇబ్బంది లేదు. ఆంక్షలు, చెకింగ్స్‌, బలవంతపు పంపేయడాలు, కాళ్లకు బంధనాలు, కోర్టు కేసులు, డిటెన్షన్‌ సెంటర్లలో నిర్బంధాలు... వీటన్నింటికీ ఇక స్వస్తి!! నాలుగు రాళ్లు సంపాదించుకోడానికో, లేక మక్కువ తోనో అక్కడికి వెళ్లి ఉందామనుకున్న వేలాది మంది భారతీయులకు కొత్త ప్రభుత్వం ఓ తీపికబురు అందించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరించిన కఠినమైన వలసవిధానాన్ని పక్కన పడేసి ఓ సమగ్ర సంస్కరణ బిల్లును సిద్ధం చేసింది. దీని పేరు: యూఎస్‌ సిటిజన్‌షిప్‌ ఏక్ట్‌-2021. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే జో బైడెన్‌ ఈ బిల్లుపై సంతకం చేసి కాంగ్రె‌స్‌‌కు పంపారు. అక్రమంగా ఉంటున్నవారిని బలవంతంగా పంపేసే పనిని ఓ 60-రోజుల పాటు- అంటే మార్చి 21దాకా నిలిపేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్క హెచ్‌-1బీ వీసాదారులే కాదు, వారి కుటుంబీకులకూ, డిపెండెంట్స్‌ అందరికీ ఈ బిల్లు పెద్ద ఊరట. ముఖ్యంగా హెచ్‌1బీ వీసా పద్ధతి ద్వారా విశేషంగా లాభపడుతున్న భారతీయ సాంకేతిక నిపుణులకు, ఇతర వృత్తి పరమైన నిపుణులు, విద్యార్థులకు బైడెన్‌ బిల్లు కొత్త సంవత్సరంలో మళ్లీ డాలర్‌ డ్రీమ్స్‌ను చిగురింపచేసిందనవచ్చు.


‘‘ఈరోజే అధ్యక్షుడు బైడెన్‌ ఇమిగ్రేషన్‌ బిల్లును కాంగ్రె్‌సకు పంపారు. ఈ అమెరికా పౌరసత్వ చట్టం మా వలస విధానాన్ని మరింత ఆధునికీకరిస్తుంది. అమెరికన్లు సుసంపన్నం కావడానికి దశాబ్దాలుగా కఠిన శ్రమ కోర్చిన అనేకమందికి పౌరసత్వం పొందే అవకాశాన్ని బిల్లు కల్పిస్తోంది. మా అధ్యక్షుడి ప్రాథామ్యాలు దీని ద్వారా స్పష్టమవుతాయి. సరిహద్దులను బాధ్యతాయుతంగా నిర్వహించడం, కుటుంబాలు కలిసుండేలా చేయడం, ఆర్థిక వృద్ధి, మధ్య అమెరికా దేశాల నుంచి వలసలెందుకు వస్తున్నాయన్న మూలకారణాలను అన్వేషించడం వీటిలో ప్రధానమైనవి. బాధల్ని, హింసను ఎదుర్కొంటూ పారిపోయే శరణార్థులకు అమెరికా ఆశ్రయ దేశం కానుంది..’’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ మీడియాకు చెప్పారు. పనిచేసే ప్రతీ ఉద్యోగీ, కార్మికుడినీ పరిరక్షించే విధంగా  బిల్లు ఉంటుందన్నారు.



కీలకాంశాలు

ఉపాధి-ఆధారిత గ్రీన్‌కార్డు లభించడానికి దేశాలకున్న పరిమితికి చెల్లు చీటీ... ఈ పరిమితి వల్ల భారతీయులు, ముఖ్యంగా టెకీలు ఎంతో నష్టపోతున్నారు. ఇప్పటిదాకా దేశాల పరిమితి 7 శాతమే ఉంది. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా ఒకటే లెక్క... దాన్ని ఇపుడు ఎత్తేస్తున్నారు.


(నిజానికి ఈ పరిమితిని 7% నుంచి 15 శాతానికి పెంచుతూ ‘ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హైస్కిల్డ్‌ ఇమిగ్రెంట్స్‌ ఏక్ట్‌’ ను సెనెట్‌ గత డిసెంబరు 3నే ఆమోదించినా అందులో అనేక నిబంధనలు, అడ్డంకులు ఉన్నాయి.. కంపెనీలపై ఆంక్షలు పెట్టారు. వాటిని తొలగించి ఇపుడీ బిల్లు తెస్తున్నారు). 


ఉపాధి-ఆధారిత వీసాల కోసం దరఖాస్తు చేసి పెండింగ్‌లో ఉన్న వేలాదిమందికి ఊరట లభించ నుంది. హెచ్‌1బీ వీసా హోల్డర్ల సంబంధీకులకు ఇక ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది. భార్య లేదా డిపెండెంట్స్‌ ఎవరైనా సరే... వర్క్‌ పర్మిట్లు పొందడానికి అర్హులు. విద్య, ఉపాధి, ప్రత్యేక సేవలు పొందడానికి పిల్లలకున్న వయసు అడ్డంకి నిబంధన ఎత్తేశారు. అమెరికన్‌ వర్కర్లతో అవాంఛనీయ పోటీ నివారించడానికి గాను అత్యంత నైపుణ్యమున్న నాన్‌ ఇమిగ్రెంట్స్‌కు (టూరిస్టు, బిజినెస్‌ వీసాలపై వచ్చే వారు) కంపెనీలు భారీ వేతనాలు చెల్లించవచ్చు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకునే ‘స్టెమ్‌’ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమేటిక్స్‌) విద్యార్థులు- అంటే గ్రాడ్యుయేట్లు, ఇతర ఉన్నత విద్యావంతులు దేశంలో ఉండేందుకు వెసులుబాటు లభిస్తుంది. 


అమెరికాలో జనాభా లెక్కలకు అందని ఇమ్మిగ్రెంట్లు దాదాపు 1.20 కోట్ల మంది ఉన్నారు. వారు దేశంలో కొనసాగేందుకు తాత్కాలిక చట్టబద్ధ హోదా కల్పిస్తారు. వీరు వెంటనే గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్లపాటు అన్ని ప్రక్రియలూ పరిశీలిస్తారు. అన్నీ బాగుంటే గ్రీన్‌కార్డులిస్తారు. ఆ తరువాత మరిన్ని తనిఖీలు, అవసరమైన ఇతర సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి, వారు ఇంగ్లిషు నేర్చుకుని, అమెరికా పౌర సంస్కృతిని అనుసరించగలిగితే వారికి దేశ పౌరసత్వం ఇస్తారు. చట్టబద్ధ హోదా లేకుండా ఉంటున్నవారు లేదా గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు 2021 జనవరి 1 నాటికి భౌతికంగా అమెరికాలోనే ఉండాలి. 2017 జనవరి 20 నాటికి గానీ ఆ తరువాత గానీ బలవంతంగా దేశం నుంచి పంపేసిన వాళ్ల విషయంలో అన్నింటినీ పరిశీలించి అవసరమైతే డీహెచ్‌ఎస్‌ మినహాయింపునిస్తుంది. వారికి ఓ అవకాశం కల్పిస్తుంది. అయితే వారు అంతకు మూడేళ్ల ముందు నుంచీ దేశంలోనే ఉంటుండాలి  తక్కువ జీతాలకు పనిచేసేవారు కూడా గ్రీన్‌కార్డులు పొందేందుకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఇమిగ్రేషన్‌ చట్టాల్లో పరాయి- విదేశీ (ఎలయన్‌) అన్న పదాన్ని తీసేసి నాన్‌-సిటిజన్‌ అన్న పదాన్ని చేరుస్తారు. కుటుంబ-ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థలోనూ సంస్కరణలు తీసుకొస్తారు. 


ఎల్‌జీబీటీ కుటుంబాలపై ఉన్న వివక్షకు చరమగీతం పాడతారు.  అనాథలు, వితంతువులు, పిల్లలకు ఏ ఇబ్బందీ కలగకుండా దేశంలో ఉండేలా రక్షణ చర్యలు చేపడతారు. కుటుంబం స్పాన్సర్‌ చేసే వలసదారులు తాత్కాలికంగా (గ్రీన్‌కార్డు వచ్చే దాకా) అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. మతపరమైన వివక్ష చూపకుండా నో బ్యాన్‌ ఏక్ట్‌ కూడా బిల్లులో పొందుపరిచారు.


విభిన్న తరహా (డైవర్స్‌) వీసాల సంఖ్య 55 వేల నుంచి 80 వేలకు పెంచుతారు.

Updated Date - 2021-01-22T11:06:00+05:30 IST