రూపాయే..

ABN , First Publish Date - 2022-08-14T09:09:49+05:30 IST

రూపాయే.. గత 75 ఏళ్ల చరిత్రను చూస్తే ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం రేటు నీరసించి పోతోంది.

రూపాయే..

 గత 75 ఏళ్ల చరిత్రను చూస్తే ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం రేటు నీరసించి పోతోంది. 1947లో డాలర్‌కు రూ.4గా ఉన్న రూపాయి మారకం రేటు, ప్రస్తుతం రూ.80కి చేరువైంది. రూపాయి మారకం రేటు ఏటేటా బక్కచిక్కి పోతోంది. 1947లో నాలుగు రూపాయిలు పెడితే ఒక అమెరికా డాలర్‌ వచ్చేది. ఇప్పుడు డాలర్‌ కొనాలంటే  దాదాపు రూ.80 వెచ్చించాల్సి వస్తోంది. అంటే గత 75 ఏళ్లలో డాలర్‌తో మన రూపాయి మారకం విలువ 20 రెట్లు పడిపోయింది. 


కారణాలు :

డాలర్‌తో రూపాయి మారకం  పడిపోవడానికి ప్రధాన కారణం వాణిజ్య లోటు. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన ఎగుమతులు దిగుమతులతో సమానంగా ఉండేవి. ఆ తర్వాత దిగుమతులు పెరిగినంతగా ఎగుమతులు పెరగలేదు. దీంతో వాణిజ్య లోటు కొండెక్కింది. చమురు దిగుమతుల భారమే ఇందుకు ప్రధాన కారణం. 


1966- తొలి కుదింపు :

60వ దశకంలో మన ఆర్థిక వ్యవస్థ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. చైనా, పాక్‌లతో చేసిన యుద్ధాలకు తోడు  కరువులూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. దాంతో ద్రవ్యలోటు, వాణిజ్యలోటు ఆకాశాన్నంటాయి. అదే సమయంలో వాణిజ్య సరళీకరణ చేపడితే తప్ప మా సాయం లేదని విదేశీ దాతలు స్పష్టం చేశారు. దాంతో జూన్‌ 6, 1966లో ఇందిరా గాంధీ ప్రభుత్వం డాలర్‌తో రూపాయి మారకం రేటును రూ.4.76 నుంచి రూ.7.5కు కుదించింది. 


1991లో రెండో కుదింపు :

1990వ దశకంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.  ఫారెక్స్‌ నిల్వలు అడుగంటాయి. విదేశీ అప్పులూ చెల్లించలేక దివాలా తీసే పరిస్థితి. దాంతో ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి విదేశీ రుణాలు చేయాల్సి వచ్చింది. ఈ గడ్డు పరిస్థితుల ప్రభావం రూపాయిపైనా పడింది. 1991 జూలైలో రెండు విడతలుగా ఆర్‌బీఐ డాలర్‌తో రూపాయి మారకం రేటును 18.5 శాతం కుదించింది. దాంతో డాలర్‌తో రూపాయి మారకం రేటు మూడు రోజుల్లోనే రూ.21.14 నుంచి రూ.25.95కు చేరుకుంది.


ఆగని పతనం :

2008లో అమెరికాను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం మన ఆర్థిక వ్యవస్థనీ కుదిపేసింది. ఆ ప్రభావం రూపాయి మీదా పడింది. 2009 నాటికి డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.46.5కు  క్షీణించింది. ఇపుడు రూ.79.5 వద్ద ట్రేడవుతోంది. అంటే 2009 నుంచి డాలర్‌తో రూపాయి మారకం ఏటా సగటున 4.3 శాతం చొప్పున క్షీణించింది. ప్రస్తుతం రూ.79.5 వద్ద స్థిరపడినా అది ఎన్నాళ్లనేది పెద్ద ప్రశ్న. అమెరికాలో వడ్డీ రేట్లు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, ద్రవ్య, వాణిజ్య, మూలధన ఖాతా లోట్లు మున్ముందు రూపాయి మారకం రేటును ప్రభావితం చేయబోతున్నాయి. 

Updated Date - 2022-08-14T09:09:49+05:30 IST