తగ్గుతున్న డాలర్‌ హవా

ABN , First Publish Date - 2021-05-09T06:12:29+05:30 IST

విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) మార్కెట్‌లో అమెరికా కరెన్సీ హవా తగ్గిపోతోంది. ఆర్‌బీఐ వంటి కేంద్ర బ్యాంకుల వద్ద ఉండే ఫారెక్స్‌ నిల్వల్లో డాలర్‌ వాటా గత 21 సంవత్సరాల్లో 71 శాతం నుంచి 59 శాతానికి...

తగ్గుతున్న డాలర్‌ హవా

  • ఫారెక్స్‌ నిల్వల్లో పాతికేళ్ల కనిష్ఠ స్థాయికి వాటా

న్యూయార్క్‌: విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) మార్కెట్‌లో అమెరికా కరెన్సీ హవా తగ్గిపోతోంది. ఆర్‌బీఐ వంటి కేంద్ర బ్యాంకుల వద్ద ఉండే ఫారెక్స్‌ నిల్వల్లో డాలర్‌ వాటా గత 21 సంవత్సరాల్లో 71 శాతం నుంచి 59 శాతానికి పడిపోయింది. కేంద్ర బ్యాంకుల వద్ద ఉండే ఫారెక్స్‌ నిల్వల్లో డాలర్‌ వాటా ఈ స్థాయికి పడిపోవడం గత పాతికేళ్లలో ఇదే మొదటిసారని ఐఎంఎఫ్‌ పేర్కొంది. గత ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న  ఫారెక్స్‌ నిల్వల ఆధారంగా ఐఎంఎఫ్‌ ఈ అంచనాకు వచ్చింది. 


యూరో జోరు: యూరో కరెన్సీ రంగప్రవేశం చేసేవరకు ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌దే హవా. 1999లో యూరో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆర్‌బీఐ సహా ప్రధాన కేంద్ర బ్యాంకులన్నీ తమ ఫారెక్స్‌ నిల్వల్లో కొంత భాగాన్ని యూరోల్లో నిల్వ చేస్తున్నాయి.  ప్రస్తుతం ఆయా కేంద్ర బ్యాంకుల ఫారెక్స్‌ నిల్వల్లో యూరో వాటా ఇంచుమించు 20 శాతంగా ఉందని ఐఎంఎఫ్‌ తెలిపింది. అమెరికా డాలర్‌, యూరోల తర్వాత కేంద్ర బ్యాంకులు తమ ఫారెక్స్‌ నిల్వలను బ్రిటిష్‌ పౌండ్‌, కెనడా, ఆస్ట్రేలియా డాలర్లు లేదా చైనా యువాన్‌లతో నిల్వ చేసేందుకు ఇష్టపడుతున్నాయి. 


మరింత పతనం: ఏదైనా దేశంతో సమస్య వస్తే, అమెరికా ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా దేశాలు, ముఖ్యంగా వర్ధమాన దేశాల కేంద్ర బ్యాంకులు ముందే జాగ్రత్త పడుతున్నాయి. తమ ఫారెక్స్‌ నిల్వల్లో డాలర్లను తగ్గించి యూరోలు, యువాన్ల వంటి కరెన్సీలకు పెద్దపీట వేస్తున్నాయి. రష్యా, చైనాలైతే, రూబల్‌-యువాన్‌లలో వాణిజ్య ఒప్పంద లావాదేవీలు కుదుర్చుకున్నాయి. మున్ముందు కేంద్ర బ్యాంకుల ఫారెక్స్‌ నిల్వల్లో అమెరికా డాలర్‌ వాటా మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. 

Updated Date - 2021-05-09T06:12:29+05:30 IST