దేశీయ ఆవుల పెంపకం లాభదాయకం

ABN , First Publish Date - 2022-09-26T04:42:28+05:30 IST

దేశవాళీ పశుగణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలో దాదాపు 20 వేలకు పైగానే ఒంగోలు జాతి ఆవులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి సంఖ్య మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

దేశీయ ఆవుల పెంపకం లాభదాయకం
ఒంగోలు దేశీయ ఆవులు

 ఒంగోలు జాతి అభివృద్ధికి చర్యలు

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 25:  దేశవాళీ పశుగణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలో దాదాపు 20 వేలకు పైగానే ఒంగోలు జాతి ఆవులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటి సంఖ్య మరింతగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి పశు వైద్య కేంద్రంలో ఒంగోలు జాతి ఎద్దుల వీర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.  అన్ని ప్రాంతాల్లో రైతు సదస్సులు ఏర్పాటు చేసి వీటిపైన అవగాహన కల్పిస్తోంది. రోగాలు, పరాన్న జీవుల నిర్మూలనకు ఉచితంగా మందులు అందిస్తోంది. ఇందులో భాగంగా చిన్నమండెం మండలం మల్లూరు, చిన్నతిప్ప సముద్రం, రాజంపేట, ఆకేపాడు ప్రాంతాల్లో దూడల ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలు పశువుల విసర్జితాలు ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడతాయని, వీటితో చీడపీడల నివారణకు ఉపయోగించే కషాయాలు తయారు చేసుకోవచ్చన్నారు. అభివృద్ధి కోరుకునే ప్రతి పాడి రైతు ఒంగోలు జాతి పశువుల పెంపకంపై మక్కువ చూపాలని జిల్లా పశుగణాభివృద్ధిశాఖ అధికారి గుణశేఖర్‌పిళ్లై  పిలుపునిచ్చారు.

ఒంగోలు జాతి దూడల పోషణ

గర్భం దాల్చిన 7, 8, 9 మాసాల్లో ఆవుకు దాణా ఎక్కువగా ఇవ్వాలి. దూడ పుట్టిన వెంటనే 30 రోజుల వరకు ముర్రుపాలు తాపించాలి. దూడ శరీర బరువు 10వ వంతు తగ్గేంత వరకు మూడు లీటర్ల పాలు తాపించాలి. 90 రోజులు పూర్తయిన తర్వాత దూడకు నట్టల నివారణ మందులు తాపించాలి. రెండో నెలలో కాప్‌ ప్లాన్‌  రోజుకు 50 గ్రాములు, మూడో మాసంలో రోజుకు 100 గ్రాములు తినిపించాలి. ఇలాగే 12వ మాసం వరకు తినిపిస్తే దూడల్లో ఆరోగ్యం, బరువు, ఎదుగుదల ఉంటుంది. ప్రతి రైతు కోడె దూడలను జాగ్రత్తగా పెంచుకుంటే వాటి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. 

ఒంగోలు ఆవులతో లాభాలెన్నో

ఒంగోలు జాతి ఆవులతో అధిక మపాల ఉత్పత్తితో పాటు, వాటి పేడ, మూత్రంతో ఘనజీవామృతం, కషాయాలు తయారు చేయవచ్చు. రాజంపేట, సుండుపల్లె, సంబేపల్లె, తదితర మండలాల్లో ప్రభుత్వం  కేంద్రాలు మంజూరు చేసిందన్నారు. ఇందుకోసం రుణాలు మంజూరు చేస్తుందన్నారు. 

- గుణశేఖర్‌పిళ్లై,  జేడీఏహెచ్‌ 

ఒంగోలు గిత్తల పెంపకం లాభదాయకం

ఒంగోలు గిత్తల దూడల పెంపకం ఎంతో లాభదాయకం. పదేళ్లు నిండిన దూడ రూ.లక్షకు పైగా పలుకుతుంది. వీటి పేడ, మూత్రం భూమిని సారవంతం చేసేందుకు ఉపయోగపడతాయి. దీంతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించవచ్చు. పాల ఉత్పత్తి బాగా ఉంటుంది.

-  ముప్పాల నాగేంద్రరాజు, కడప జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్‌


ఒంగోలు ఆవుల పెంపకం ముందుకు వెళ్తా

గత 15 సంవత్సరాల నుంచి జెర్సీ ఆవులు పెంచుకుంటున్నా. పాత ఉత్పత్తి సాధారణంగా ఒంగోలు దేశీయ ఆవులు పెంపకంపై ఆసక్తి చూపాలనుకుంటున్నా. కచ్చితంగా ఒంగోలు దేశీయ ఆవులు పెంచుతా. 

- కొనసాని రాజారెడ్డి, రైతు




Updated Date - 2022-09-26T04:42:28+05:30 IST