దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచాలి

ABN , First Publish Date - 2022-01-22T08:16:58+05:30 IST

దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు పెట్రో కెమికల్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచాలి

పెట్రో కెమికల్‌ రంగంలో  పరిశోధన, అభివృద్ధికి మరింత ప్రాధాన్యం

విశాఖపట్నం ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో ఉప రాష్ట్రపతి 


విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు పెట్రో కెమికల్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శక్తి ఉత్పాదన రంగంలో ఆత్మ నిర్భరత సాధించాల్సిన అవసరం ఉందన్న ఆయన, దేశీయంగా చమురు ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి స్నాతకోత్సవాన్ని శుక్రవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. దేశంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి విస్తృతమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే మూడో అతి పద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్‌, తన అవసరాల కోసం 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని తెలిపారు. దేశీయంగా చమురు వెలికితీయడం ద్వారా భారత్‌కు ఇంధన భద్రత అందించడంతోపాటు, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పెట్రో నిల్వలున్న ప్రాంతంలో చమురు వెలికితీతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం హైడ్రో కార్బన్‌ ఎక్స్‌ఫ్లోరేషన్‌ లైసెన్సింగ్‌ పాలసీ (హెల్ప్‌)తో పాటు పలు విధానపరమైన సంస్కరణలు తీసుకువస్తోందన్నారు. 


ఈ నేపథ్యంలో పెట్రోలియం రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిని పెంచుకునేందుకు ఉన్న అడ్డంకులను అధిగమించాలని సూచించారు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన పరిశోధనలు చే సే దిశగా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవస రం ఉందన్న ఆయన.. విద్యా రంగంలో వివిధ అం శాలను ఒకేసారి నేర్చుకునేందుకు వీలు కల్పించాలని సూచించారు. నూతన విద్యా విధానం-2022 ఆ దిశగా బాటలు వేస్తుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. దేశంలో సౌర, పవన, అలల ద్వారా వివిధ మార్గా ల్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి చేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయ న్న ఉప రాష్ట్రపతి, ఈ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ఐఐపీఈ వంటి విశ్వవిద్యాలయాలు ప్రత్యేకమైన శిక్షణను అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తరువాత 2017లో పార్లమెంట్‌లో చేసిన చట్టం ఆధారంగా జాతీయ ప్రాధాన్య సంస్థగా ఐఐపీఈని గుర్తించి విశాఖపట్నంలో ఏర్పాటు చేశామని తెలిపారు. తాను ప్రారంభించిన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పెట్రోలియం, సహజ వాయువుశాఖ సహాయ మంత్రి రామేశ్వరి తేలి మాట్లాడుతూ పెట్రో రంగంలో వినూత్న ఆవిష్కరణల దిశగా ఇక్కడి విద్యార్థులు ప్రయత్నాలు సాగించాలని కోరారు.  

Updated Date - 2022-01-22T08:16:58+05:30 IST