దేశీ ఉత్పత్తులే వృద్ధి సాధకాలు

ABN , First Publish Date - 2020-09-08T09:34:19+05:30 IST

ఆర్థిక గణాంకాలు ఇనప గుగ్గిళ్ళ మాదిరిగా ఉండడం కద్దు. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తాజా గణాంకాలు ఇందుకు భిన్న మేమీ కాదు. ప్రభుత్వ సమాచారం ప్రకారం...

దేశీ ఉత్పత్తులే వృద్ధి సాధకాలు

ఎగుమతులను ఇతోధికంగా పెంచి , భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మరింత విస్తృతంగా ఏకీకరించాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సలహాను ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.  దేశీయ పరిశ్రమల సంరక్షణ విధానాలను అనుసరించడమే స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల, ఇతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అన్ని విధాల శ్రేయస్కరం.


ఆర్థిక గణాంకాలు ఇనప గుగ్గిళ్ళ మాదిరిగా ఉండడం కద్దు. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తాజా గణాంకాలు ఇందుకు భిన్న మేమీ కాదు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-–21) మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 23.9 శాతం తగ్గిపోయింది. వాస్తవ తగ్గుదల కంటే ఈ గణాంకం తక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. ఆర్థికవ్యవస్థ మొత్తంగా సజావుగా లేకపోయినప్పటికీ వ్యవసాయరంగంలో 3.4 శాతం పెరుగుదలకు ఆస్కారమున్నదని ప్రభు త్వం అంచనా వేసింది. వ్యవసాయరంగంలో ఎలాంటి అభివృద్ధికైనా అవకాశమున్నదని నేను భావించడం లేదు. ధరల పతనమే నా అంచనాకు ప్రాతిపదిక.


సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎమ్.ఎస్.ఎమ్.ఈ) పరిశ్రమల పరిస్థితీ మెరుగ్గా లేదు. 2020 మార్చిలో బ్యాంకులు ఈ పరిశ్రమలకు కల్పించిన మొత్తం పరపతి సదుపాయం రూ.11.49 లక్షల కోట్లు. ఏప్రిల్, మే నెలల్లో ఈ రుణాల జారీ తగ్గిపోయింది. జూన్‌లో పరిస్థితి కొంచెం మెరుగయింది. ఆ నెలలో రూ.11.32 లక్షల కోట్ల మేరకు ఎమ్ఎస్ఎమ్‌ఈలకు బ్యాంకులు రుణసహాయమందించాయి. గమనార్హమైన విషయమేమిటంటే ఈ పరిశ్రమలకు ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల రుణ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ, జూన్‌లో వాటికి అందిన రుణ సహాయం గత మార్చిలో కంటే తక్కువ. రుణ ప్యాకేజీ ప్రకటించక ముందు ఇచ్చిన రుణాలనే రుణ ప్యాకేజీ కింద ఇచ్చిన రుణాలుగా బ్యాంకులు చూపుతున్నాయి మరి. 


2020 మార్చి - జూన్ నెలల మధ్య వాహనాల కొనుగోలుకు మంజూరు చేసిన రుణాల్లో కేవలం 0.5 శాతం మాత్రమే తగ్గుదల నమోదయినట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వానికి దీన్నొక సూచకంగా పరిగణించడానికి వీలు లేదు. వాహనాల కొనుగోళ్ళు తగ్గకపోవడానికి కారణమేమిటి? లోకల్, మెట్రో రైళ్ళు, బస్ సర్వీసులను నిలిపివేయడం వల్ల చాలామంది ప్రైవేట్ వాహనాలను కొనుగోలు చేసుకోవడం జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ అనివార్య పరిస్థితి మరెంతో కాలం ఉండదు గనుక వాహనాల కొనుగోళ్ళు తప్పక తగ్గిపోతాయి. స్థిరాస్థుల రంగంలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. ఈ రంగానికి మంజూరు చేసిన రుణాల్లో కేవలం 0.7శాతం తగ్గుదల మాత్రమే కన్పించింది. అయితే డిమాండ్ తగ్గిపోవడంతో పలువురు బిల్డర్లు తీవ్ర సమస్యలపాలయ్యారు. తమ సమస్యలను అధిగమించేందుకు వారు రుణాలు తీసుకున్నారు. శస్త్ర చికిత్సకు వేచిఉన్న వ్యక్తికి ఆక్సిజన్ ఇవ్వడం లాంటిదే ఈ రుణాల వ్యవహారం కూడా. మొత్తంగా చూస్తే పరిస్థితి చాలా విషమంగా ఉంది. 


ఈ విపత్కర పరిస్థితిని అధిగమించడం ఎలా? భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఒక సూచన చేసింది. ఎగుమతులను ఇతోధికంగా పెంచి, భారత ఆర్థికవ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మరింత విస్తృతంగా ఏకీకరించడమే మార్గాంతరమన్నది ఆ సూచన సారాంశం. గత ఆరు సంవత్సరాలుగా మనం చేస్తుంది కూడా ఇదే కాదూ? మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఏకీకృతం చేస్తూ వస్తున్నాం. అయినా మన స్థూల దేశీయోత్పత్పత్తి ఏటికేడాది, ముఖ్యంగా గత నాలుగేళ్ళుగా తగ్గిపోతూ వస్తోంది. మన ఆర్థికవ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మరింతగా అనుసంధానం చేసే విషయమై మనం తప్పక పునరాలోచించాలి. 


దేశ ఆర్థికవ్యవస్థలో పెనుమార్పులకు కారణమైన ప్రపంచీకరణ విధానాలు ఇప్పుడు మనకు ప్రతికూలంగా పరిణమించాయి. మన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ డబ్బును చైనా లాంటి దేశాలకు తీసుకువెళుతున్నారు. చైనాలో వారి పరిశ్రమలు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నా అదేమని అడిగే చట్టాలు లేవు. కార్మిక చట్టాలనేవి దాదాపుగా లేవు. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి తక్కువేమీ కాదు. అయితే వారి వ్యాపార ప్రయోజనాలకు ఆ అవినీతి ఆటంకం కాబోదు. పైగా ‘వ్యాపార సౌలభ్యానికి’ దోహదం చేస్తుంది. బహుళజాతి కార్పొరేట్ కంపెనీలతో పాటు మన వ్యాపారసంస్థలు కూడా చైనాలో వస్తూత్పత్తులు చేస్తున్నాయి. ఆ వస్తువులను మన దేశానికి దిగుమతి చేస్తున్నాయి. ఇది ఆ వ్యాపార సంస్థలకు విశేషంగా లాభదాయకం. అయితే ఒక కఠోర వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. చైనా నుంచి దిగుమతవుతున్న చౌక వస్తువుల మూలంగా మన దేశీయ పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన కార్మికులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. దేశీయ పరిశ్రమలు మూతపడడం వల్ల ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోతోంది. 


చైనా నుంచి ఎదురవుతున్న పోటీని ఎలా అధిగమించాలి? దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచి వేయడమే పరిష్కారం. సుంకాల పెరుగుదలతో భారతీయ వ్యాపారులు, బహుళజాతిసంస్థలు తాము చైనాలో ఉత్పత్తి చేసిన వస్తువులను భారత్‌కు దిగుమతి చేయలేవు. ఉదాహరణకు ప్రభుత్వ ఉజ్వల పథకం కింద ఐదు కోట్ల లెడ్ బల్బుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఫిలిప్స్ ఇండియా కంపెనీ సాధించుకుంది. చైనాలో ఉత్పత్తి చేసిన బల్బులను ఆ కంపెనీ సరఫరా చేసింది. దిగుమతి సుంకాలు అధికస్థాయిలో ఉన్నట్టయితే ఆ బల్బులను భారత్‌లో తయారుచేయడమే ఫిలిప్స్ కంపెనీకి లాభదాయకంగా ఉండేది. ఇదే విధంగా సకల ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచాలి. అలా పెంచితే ఆ వస్తువులను భారత్‌లో దేశీయ మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడమే వ్యాపార సంస్థలకు లాభదాయకమవుతుంది. ప్రభుత్వమూ, ప్రజలూ లబ్ధి పొందుతారు. ఇటువంటి విధానాలతోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు అమెరికన్ కంపెనీలు చైనా నుంచి స్వదేశానికి తిరిగివచ్చేలా చేశారు. మన ప్రభుత్వం కూడా దిగుమతి సుంకాలను పెంచితే చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ సంస్థలు తప్పక స్వదేశానికి తిరిగివస్తాయి. వ్యాపార, పారిశ్రామిక సంస్థల పెరుగుదలతో ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఉద్యోగాల సృష్టితో ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాల పెరుగుదలతో మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారసంస్థలు మరింతగా మదుపు చేసేందుకు ప్రోత్సాహకర పరిస్థితులు నెలకొంటాయి. ఆర్థిక వ్యవస్థ సర్వతో ముఖంగా అభివృద్ధి చెందేందుకు దోహదం జరుగుతుంది. 


ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి- బహుళజాతి కంపెనీలు, చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ వ్యాపార సంస్థల, ప్రభుత్వోద్యోగుల ప్రయోజనాలను కాపాడటం; రెండు- స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల, ఉద్యోగాల సృష్టికి సానుకూల పరిస్థితులు సృష్టించి ఆధిక ఆదాయాన్ని సాధించుకోవడం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సలహాను ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. సంరక్షణ విధానాలను అనుసరించడమే స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల, ఇతర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అన్ని విధాల శ్రేయస్కరం.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త,

బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-09-08T09:34:19+05:30 IST