Kuwait లో భారీగా పడిపోయిన గృహ కార్మికుల సంఖ్య..

ABN , First Publish Date - 2021-11-09T13:44:08+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

Kuwait లో భారీగా పడిపోయిన గృహ కార్మికుల సంఖ్య..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే గృహ కార్మికుల సంఖ్య భారీగా పడిపోయింది. నెల రోజుల్లోనే ఏకంగా 30వేల మంది డొమెస్టిక్ వర్కర్లు తగ్గిపోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) వెల్లడించింది. సెప్టెంబర్‌లో 6,36,525గా ఉన్న గృహ కార్మికుల సంఖ్య అక్టోబర్‌‌కు వచ్చేసరికి 6,06,364కు పడిపోయినట్లు పీఏఎం పేర్కొంది. ఈ వివరాలను తన అధికారిక వెబ్‌సైట్ పీఏఎం ప్రచురించింది. ఇక ఇదే నెల రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఉన్న 420 రిక్రూట్‌మెంట్ ఆఫీసుల్లో 1,533 కొత్తగా కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


ఇదిలాఉంటే.. ఇటీవల డొమెస్టిక్ వర్కర్ల నియామకాల విషయంలో భారత్, కువైత్‌‌ మధ్య కీలక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీనికి ఆ దేశ కేబినేట్ కూడా ఆమోదం తెలిపిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ మహిళలను గృహ కార్మికులుగా నియమించుకునేందుకు కొన్ని కొత్త నిబంధనలు తెరపైకి వచ్చాయని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. వీటిలో ప్రధానంగా మహిళల వయసు. 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులను మాత్రమే నియమించుకోవాలి. 30 కంటే తక్కువ వయసు ఉన్నవారిని ఎట్టిపరిస్థితిలో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నియామకాలు చేపట్టకూడదు. 


అలాగే జీతం కూడా నెలకు వంద కువైటీ దీనార్లకు(సుమారు రూ.25వేలు) తక్కువ ఇవ్వరాదు. అది కూడా నగదు రూపంలో చేతికి ఇవ్వకూడదు. యజమానినే పనిమనిషి పేరు మీద ఓ బ్యాంకు ఖాతా తెరిపించి అందులో వేయాలి. పనికి కుదుర్చుకున్నవారి కాంట్రాక్ట్ ముగిసేవరకు ఇదే పద్దతి కొనసాగాలి. అంతేగాక ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ అప్రూవ్ చేసేందుకు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు తప్పనిసరిగా భారత ఎంబసీ అనుమతి తీసుకోవాలి.  

Updated Date - 2021-11-09T13:44:08+05:30 IST