టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు!

ABN , First Publish Date - 2022-06-30T05:41:17+05:30 IST

రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన కారు గుర్తు పార్టీ జిల్లాలో కంట్రోల్‌ తప్పుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలం వరకు జిల్లా పార్టీకి రథసారథి లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కనిపించింది. దీనిపై ప్రత్యేక దృష్టిని సారించిన పార్టీ అధిష్ఠానం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించి పార్టీ పగ్గాలను అప్పగించిం ది. దీంతో అంతా సైలెంటై పోతుందని భావించినా..

టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు!
బోథ్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా కిరణ్‌కుమార్‌కు నియామకపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే బాపురావు

జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఆధిపత్య పోరు

బోథ్‌ సెగ్మెంట్‌ అధికార ప్రతినిధి నియామకంపై రగడ

ఆ నియామకం చెల్లదంటున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు

అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న జిల్లా నేతలు

జిల్లావ్యాప్తంగా రసవత్తరంగా మారిన రాజకీయాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన కారు గుర్తు పార్టీ జిల్లాలో కంట్రోల్‌ తప్పుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొంత కాలం వరకు జిల్లా పార్టీకి రథసారథి లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కనిపించింది. దీనిపై ప్రత్యేక దృష్టిని సారించిన పార్టీ అధిష్ఠానం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులను నియమించి పార్టీ పగ్గాలను అప్పగించిం ది. దీంతో అంతా సైలెంటై పోతుందని భావించినా.. నేతల మధ్య ఆధిపత్య పోరు తగ్గినట్లు కనిపించడం లేదు. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు ఎలాంటి సమాచారం లేకుండానే బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు తన నియోజకవర్గ అధికార ప్రతినిధిగా మొట్టె కిరణ్‌ను నియమిస్తున్నట్లుగా ప్రకటించడం కొత్త వివాదానికి దారి తీసింది. పార్టీ పదవులన్నీ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే చేపట్టాల్సి ఉండగా.. బోథ్‌ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యేనే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించడంపై అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బోథ్‌ నియోజకవర్గంలో నాలుగైదు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నేతలు.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి మరీ సొంత నిర్ణయాలతో పార్టీ పదవులను కేటాయించడం పట్ల పలువురు స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు తీరుపై అధి ష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు మూకుమ్మడిగా సిద్ధమవుతున్నా రు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవడమే హాట్‌ టాపిక్‌గా కనిపిస్తోంది.

అంతా ఆగమాగం

ప్రస్తుతం పార్టీలో ఎలాంటి పదవుల కేటాయింపులు లేకపోయినా.. బోథ్‌ నియోజకవర్గంలో మాత్రం ఆగమేఘాల మీద ఎమ్మెల్యే పార్టీ పదవులను కేటాయించడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. తన వ్యతిరేక వర్గానికి చెక్‌ పెట్టడానికే ఎమ్మెల్యే ఆదరబాదరగా అధికార ప్రతినిధి నియామకం చేపట్టారన్న విమర్శలు లేకపోలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు  రామన్నకు కొంత సన్నిహితంగా ఉండే బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌కు అవకాశం దక్కుతుందన్న అనుమానంతోనే దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను తెరపైకి తెచ్చినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఏ పదవైనా రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడి ఆదేశాల మేరకే జిల్లా పార్టీ అధ్యక్షుడు నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. కాని బోథ్‌లో మాత్రం దానికి విరుద్ధంగా నియామకం చేపట్టడం పై దుమారం రేపుతోంది. వ్యతిరేకవర్గం నుంచి ఇబ్బందులు ఉండకుండా ముందుచూపుతోనే నియోజకవర్గానికి చెందిన పార్టీ పదవుల నియామ కాలను చేపట్టినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

బెడసి కొట్టిన వ్యూహం

తన అనుచర వర్గానికి పార్టీ పదవులను కట్టబెట్టి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు వ్యూహం బెడిసి కొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత రెండు, మూడు మాసాల క్రితమే బోథ్‌ ఎంపీడీవోగా పని చేసిన రాథోడ్‌ రాధాను తొలగించాలని పట్టుబట్టిన ఎమ్మెల్యే, ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సైతం బహిష్కరించి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి జడ్పీ సమావేశాన్ని బహిష్కరించడం ఏమిటన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అవినీతికి పాల్పడిన ఎంపీడీవో రాథోడ్‌ రాధాను తన నియోజకవర్గం నుంచి పంపించేయాలని పట్టుబట్టడంతో కలెక్టర్‌ తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది. అయితే మూడు మాసాలు గడవక ముందే మళ్లీ బోథ్‌ నియోజకవర్గంలోని బజార్‌హత్నూర్‌ మండల ఎంపీడీవోగా రాథోడ్‌ రాధా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడం ఎమ్మెల్యే వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు ఇబ్బందికరంగా మారాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ ఆదేశాలు లేకపోయినా.. అధికార ప్రతినిధి నియామకం చేపట్టడం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు తప్పుబడుతున్నారు. అనుకున్నదొక్కటి.. అయినది మరొకటి కావడంతో ఎమ్మెల్యే వ్యూహం బెడిసి కొట్టినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ నియామకంతో పార్టీకి సంబంధం లేదు

: జోగు రామన్న, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్‌

బోథ్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి నియామకంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే జిల్లా పార్టీ అధ్యక్షుడు నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. నేరుగా పార్టీ పదవులను కేటాయించే అధికారం జిల్లా పార్టీ అధ్యక్షుడికే లేదు. ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా పార్టీ పదవులను కేటాయించడం సరైంది కాదు. ఈ విషయమై ఇప్పటికే చర్చించడం జరిగింది. అధికార ప్రతినిధి నియామకం చెల్లదని వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా పార్టీ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-06-30T05:41:17+05:30 IST