అన్నంత పని చేసిన ట్రంప్..!

ABN , First Publish Date - 2020-11-05T20:17:22+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను సృష్టిస్తున్నాయి.

అన్నంత పని చేసిన ట్రంప్..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠను సృష్టిస్తున్నాయి. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ప్రెసిడెంట్ కావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270కి కేవలం 6 ఎలక్టోరల్ ఓట్లకు దూరంలో ఉన్నారు. అటు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్ల దగ్గరే ఆగిపోయారు. ఆయన మరోసారి అధ్యక్షుడు కావాలంటే ఇంకా 56 ఎలక్టోరల్ ఓట్లు గెలవాలి. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ, ఫలితాల్లో వెనుకంజలో ఉన్న ట్రంప్ తాజాగా అన్నంత పని చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నట్లు మెయిల్ ఇన్ బ్యాలెట్ల ఓట్ల విషయమై న్యాయస్థానం మెట్లు ఎక్కారు. ముఖ్యంగా పెన్సిల్వేనియా (20), మిచిగాన్ (16), జార్జియా (16) రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యం పొందడంతో ఆయన ఈ ప్రాంతాల్లో కౌంటింగ్‌ను వెంటనే ఆపాలని అక్కడి స్థానిక కోర్టుల్లో దావా వేశారు. పెన్సిల్వేనియా, మిచిగాన్‌లలో కౌంటింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న ట్రంప్ బృందం అక్కడి కోర్టుల్లో దావా వేసింది. 


అలాగే కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మరో దావా వేస్తామంటూ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ర్యూడీ గైలైనీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు బైడెన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటింగ్‌ను ఆపే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా యధావిధిగా కౌంటింగ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.  ఇక మిచిగాన్‌లో బిడెన్ ఇప్పటికే గెలిచారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ట్రంప్, బైడెన్ మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే ఉంది. కాగా, పోస్టల్ బ్యాలెట్ ముగింపు తేదీపై సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న కేసులో తమను ప్రతివాదిగా చేర్చాలని కోరేందుకు ట్రంప్ టీం ప్రయత్నిస్తోంది. దీనికోసం మోషన్ పిటిషన్ వేసేందుకు కూడా రెడీ అయింది.   

Updated Date - 2020-11-05T20:17:22+05:30 IST