2024 ఎన్నికల్లో పోటీ చేసేదీ.. లేనిది.. చెప్పేసిన ట్రంప్!

ABN , First Publish Date - 2020-12-02T21:47:04+05:30 IST

అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి చెందిన డొనాల్డ్ ట్రంప్.. తన భవిష్యత్ ప్రణాళికపై క్లారిటీ ఇచ్చా

2024 ఎన్నికల్లో పోటీ చేసేదీ.. లేనిది.. చెప్పేసిన ట్రంప్!

వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి చెందిన డొనాల్డ్ ట్రంప్.. తన భవిష్యత్ ప్రణాళికపై క్లారిటీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా తాజాగా జరిగిన హోరాహోరీ ఎన్నికల్లో జో బైడన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. పైగా తానే గెలిచినట్లు ప్రకటించుకుంటూ.. బైడెన్ గెలుపును కోర్టుల్లో సవాల్ చేస్తున్నారు. అయితే కోర్టు తీర్పులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన హాలిడే రిసెప్షన్‌లో పాల్గొన్న ట్రంప్.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. 



‘ఈ నాలుగు సంవత్సరాలు అద్భతంగా గడిచాయి. మరో నాలుగేళ్ల అధికారంలో ఉండటం కోసం మనం శ్రమిస్తున్నాం. ప్రయత్నాలు విఫలమైతే.. 4ఏళ్లలో మిమ్మల్ని చూస్తాను’ అని ప్రకటించారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ట్రంప్ రాజకియాల్లో కొనసాగుతారనే విషయం ఈ వ్యాఖ్యలతో స్పష్టమైంది. కాగా.. అమెరికా అధ్యక్షుడిగా తన పదవి కాలం ముగిసిన తర్వాత ట్రంప్.. రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటారనే ఊహాగానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమంలో చాలా మంది రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమెరికాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నా కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది సభ్యులు కనీసం మాస్కు కూడా ధరించలేదు. దీంతో వారి వైఖరిపట్ల వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-12-02T21:47:04+05:30 IST