ఆ విషయంలో ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే: బైడెన్

ABN , First Publish Date - 2020-11-12T15:23:40+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కానీ, ఆ విషయాన్ని ట్రంప్ అంగీకరించడం లేదు.

ఆ విషయంలో ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే: బైడెన్

విల్మింగ్టన్(యూఎస్): అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. కానీ, ఆ విషయాన్ని ట్రంప్ అంగీకరించడం లేదు. పైగా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఓటమిని అంగీకరించాలని, న్యాయపోరాటం వద్దని స్వయంగా భార్య మెలానియా ట్రంప్, సన్నిహితులు చెబుతున్న ట్రంప్ వినిపించుకోవడం లేదు. ఓటమిని అంగీకరించేదిలేదని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయినా ఆ విషయాన్ని అంగీకరించని అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరిని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తప్పుబట్టారు. డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ... నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్... ఓటమిని అంగీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. ఈ విషయంలో ట్రంప్ వైఖరి ఇబ్బందికరమేనని అన్నారు. అధ్యక్షుడి హోదాలో హుందాగా ప్రవర్తించాల్సిన ట్రంప్‌ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం అధికార బదలాయింపునకు సంబంధించిన తన ప్రణాళికలకు అడ్డంకులేవీ రాలేదన్నారు.


అయితే, అధికార మార్పిడి ప్రక్రియను మొదలుపెట్టేందుకు ట్రంప్‌ యంత్రాంగం నిరాకరిస్తే మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. ఆపై తాము చేయాల్సింది చేస్తామని ఈ సందర్భంగా బైడెన్ స్పష్టం చేశారు. తాను ప్రమాణస్వీకారం చేసే జనవరి 20వ తేదీకి నాటికి అన్నీ సజావుగా జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆరు దేశాల నేతలు తనకు ఫోన్‌ చేసినట్లు బైడెన్ పేర్కొన్నారు. తనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఐర్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు ఉన్నారని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్, కమలా హ్యారిస్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తన ఏజెన్సీ సమీక్ష బృందంలో(ఏఆర్‌టీ) 20 మందికి పైగా భారతీయులను నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గం నుంచి నూతన పాలకవర్గానికి అధికార బదిలీ సజావుగా జరిగేందుకు కీలక ఫెడరల్‌ ఏజెన్సీ కార్యకలాపాలను ఈ సమీక్ష బృందం పరిశీలిస్తుంది. 

Updated Date - 2020-11-12T15:23:40+05:30 IST