భయం వద్దు

ABN , First Publish Date - 2021-10-09T04:59:30+05:30 IST

అది ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌– ముంబయి (65వ నంబరు) జాతీయ రహదారి.. సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా.. సెంట్రింగ్‌ పనులు చేస్తుండే పోతిరెడ్డిపల్లికి చెందిన సంకరి గోపాల్‌రెడ్డి.. సెప్టెంబరు 24వ తేదీ రాత్రి పనులు ముగించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఒక్క ఉదుటున ఎగిరిపడిన గోపాల్‌రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి.

భయం వద్దు

ధైర్యంగా ప్రాణాలు నిలపండి..

రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్పించండి

క్షతగాత్రులను కాపాడితే రూ.5వేలు, ప్రశంస

ఉత్తమ ప్రాణదాతకు రూ.లక్ష

‘గుడ్‌ సిటిజన్స్‌’కు ప్రభుత్వ సత్కారం

రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటన

కేసులు, విచారణ పేరిట ఇబ్బందులుండవని వెల్లడి


అది ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌– ముంబయి (65వ నంబరు) జాతీయ రహదారి.. సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా.. సెంట్రింగ్‌ పనులు చేస్తుండే పోతిరెడ్డిపల్లికి చెందిన సంకరి గోపాల్‌రెడ్డి.. సెప్టెంబరు 24వ తేదీ రాత్రి పనులు ముగించుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ఒక్క ఉదుటున ఎగిరిపడిన గోపాల్‌రెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తం కారుతున్నది. గాయపడింది గోపాల్‌రెడ్డేనని దారెంటవెళ్లే వాళ్లు గుర్తు పట్టారు. అందరూ వచ్చి చూసి.. అయ్యోపాపం  గోపాల్‌రెడ్డి.. అని వెళ్తున్నారే తప్ప ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లే సాహసం మాత్రం ఎవరూ చేయలేదు. ఎందుకంటే అది మెడికో  లీగల్‌ కేసు అవుతుంది. అనవసరంగా పోలీసుల  విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిలిచినపుడల్లా పోలీ్‌సస్టేషన్‌కో, కోర్టుకో వెళ్లాల్సి వస్తుంది. ఈ బాధలు తమకెందుకులే అనుకుని అందరూ చూసి వెళ్లిపోతున్నారు. ఎవరో కాస్త ఆలస్యంగా 108కు కాల్‌ చేస్తే అంబులెన్స్‌ వచ్చింది. ఆస్పత్రికి తరలించినా గోపాల్‌రెడ్డి బతకలేదు. కాస్త ముందు తీసుకొచ్చి ఉంటే బతికించడానికి అవకాశముండేదని డాక్టర్లు విచారం వ్యక్తం చేశారు. అధిక రక్తస్రావం వల్లే ఆయన చనిపోయాడని నిర్ధారించారు. ఫలితంగా ఆయన భార్య రుక్కమ్మ, పిల్లలు దిక్కులేనివారయ్యారు. గోపాల్‌రెడ్డికి ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా స్పందించి ఆయన్ను ఆస్పత్రికి తరలించి ఉంటే ఈరోజు  ఈ కుటుంబం రోడ్డునపడేది కాదు. 

  

 జిన్నారం మండలం కిష్టాయపలి గ్రామానికి చెందిన కొడకంచి  రామకృష్ణ ఆగస్టు 7న సంగారెడ్డి సమీపంలోని మండల కేంద్రమైన కంది  వద్ద ఇదే రహదారిపై బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం జరిగి మృత్యువాతపడ్డాడు. 


 కొండాపూర్‌ మండలం తమ్మల్‌బాయి తండాకు చెందిన అనిల్‌కుమార్‌ అతని స్నేహితుడు సంతోష్‌లదీ ఇదే పరిస్థితి. ఇద్దరూ బైక్‌పై వెళ్తుండగా  కంది మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద కంటైనర్‌ ఢీకొన్నది. ఇద్దరికీ తీవ్రగాయాలై, సకాలంలో చికిత్స అందక అనంతలోకాలకు వెళ్లారు. 


ఈ మూడు ఘటనల్లోనూ మృత్యువాత పడడానికి ఒక కారణం ప్రమాదమైతే, రెండోది పౌరుల్లో నెలకొన్న భయం! రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడానికి గానీ, క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడానికి గానీ కారణం అదే.. ప్రమాదం జరిగిన  వెంటనే ఆస్పత్రికి తీసుకువస్తే బతికించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యం వల్లే ప్రమాద బాధితులు మృత్యువాతపడుతున్నారని చెబుతున్నారు.


ఉత్తమ ప్రాణదాతకు రూ.లక్ష

రోడ్డుప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా, లేదా ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా సత్కరిస్తామని కేంద్ర    రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘గుడ్‌ సిటిజన్‌’ పేరిట గుర్తించి రూ.5వేల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తామని తెలిపింది. కేసుల పేరిట, విచారణ పేరిట పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించడం జరగదని హామీ ఇచ్చింది. సాయపడిన వారిని గుర్తించి జిల్లా స్థాయి అప్రైజల్‌ కమిటీకి స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) పంపించాలని సూచించింది. ఈ పథకం 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.


మృతుల్లో యువకులే ఎక్కువ

రోడ్డు ప్రమాదాలకు కారణాలను పరిశీలిస్తే అతివేగం, అజాగ్రత్త వల్లేనని తెలుస్తున్నది. 20 నుంచి 40 సంవత్సరాల్లోపు వయసున్న వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణాలు తీస్తున్న ఈ ప్రమాదాలు జరుగుతున్నది కూడా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యే. గతేడాది 792 ప్రమాదాలు జరిగి 387 మంది మృత్యువాత పడగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 438 ప్రమాదాలు జరిగి, 262 మంది చనిపోయారు. 

Updated Date - 2021-10-09T04:59:30+05:30 IST