కరోనాతో కుమిలిపోకండి.. మాతో మాట కలపండి!

ABN , First Publish Date - 2021-05-11T18:18:48+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో ఉన్నారా

కరోనాతో కుమిలిపోకండి.. మాతో మాట కలపండి!

  • మనసిక ప్రశాంతత కోసం కాల్‌ చేయండి 
  • రాచకొండలో ప్రత్యేక కౌన్సెలింగ్‌ సెంటర్‌

హైదరాబాద్‌ సిటీ : ‘‘కొవిడ్‌ పాజిటివ్‌తో హోం క్వారంటైన్‌లో ఉన్నారా, ఆలోచనలు వెంటాడుతున్నాయా, కరోనాతో మృతి చెందిన వారి సమాచారం భయపెడుతోందా..?, ఒంటరిగా కుమిలిపోతున్నారా..?, మాకు ఫోన్‌ చేయండి. మాతో మాట కలపండి. మీ బాధను, సమస్యను మాతో పంచుకోండి. మీకు మేమున్నాం’’ అంటున్నారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌. ఈ మేరకు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేక కౌన్సెలింగ్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. 


అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనాతో హోం క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉన్నవారు ఒంటరిగా మానసిక వేధనకు గురవుతున్నారు. మరికొంతమంది కరోనా రాకపోయినా రోజు రోజుకు పెరిగిపోతున్న కేసులను చూసి భయపడుతున్నారు. అలాంటి వారిలో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపి వారి ఆలోచనా విధానాన్ని మార్చే ప్రయత్నం చేయడానికి సంకల్పించినట్లు సీపీ తెలిపారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ ద్వారా 11 మంది కౌన్సెలర్లు, డాక్టర్స్‌ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడానికి ముందుకు వచ్చిన కౌన్సిలర్లు అమీనా హుస్సేన్‌, కవితా నటరాజన్‌, డాక్టర్‌ అనితా ఆరె, దేవి శేషాద్రి, కీర్తిరెడ్డి, సుచిత్రా అబ్రహం, లక్ష్మి, అంకితా అగర్వాల్‌, కృష్ణమోహన్‌, శ్రీవల్లి, ఎంజెలా డేవిడ్‌, కౌముడి నాగరాజ్‌, నలినీ కిషన్‌, కిరణ్మయిలను సీపీ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ సుధీర్‌ బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, అడ్మిన్‌ డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్‌ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.


బాధితులు సంప్రదించాల్సిన నంబర్‌ : 040-482148800

సోమవారం నుంచి శనివారం వరకు 

సమయం : ఉదయం-9:00- రాత్రి 9:00

భాషలు : తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ


Updated Date - 2021-05-11T18:18:48+05:30 IST