వెనకడుగు తప్పదా!?

ABN , First Publish Date - 2022-06-19T08:23:29+05:30 IST

సైన్యంలో నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలకు దారితీయడంతో ఈపథకాన్ని ఉపసంహరించుకోవల్సిందిగా ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది.

వెనకడుగు తప్పదా!?

‘అగ్ని’ కీలల్లో విలవిల

 ఉపసంహరణకు మోదీపై సర్వత్రా ఒత్తిడి

సొంతపార్టీ నేతలూ తప్పదంటున్నారు

చర్చలకు ప్రభుత్వం సిద్ధం: అనురాగ్‌ ఠాకూర్‌


న్యూఢిల్లీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): సైన్యంలో నియామకాల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలకు దారితీయడంతో ఈపథకాన్ని ఉపసంహరించుకోవల్సిందిగా ప్రధాని మోదీపై ఒత్తిడి పెరుగుతోంది. యువత నిరసన మూలంగా  ఈ పథకానికి కేంద్రం అనేక సవరణలను చేసినప్పటికీ ఇంకా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఈ పథకాన్ని ఉపసంహరించుకుని, సైన్యంలో శాశ్వత నియామకాల ప్రక్రియ ప్రారంభించడం తప్పనిసరి అని బీజేపీలో కూడా పలువురు నేతలు అంటున్నారు. పలు  దేశాల్లో నాలుగేళ్ల కోసం సైన్యంలో నియామకాలు జరిగే  విధానం ఉన్నప్పటికీ  భారత దేశంలో ఉన్నంత నిరుద్యోగ సమస్య మరెక్కడా లేదని బీజేపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. సైన్యంలో నియామకాల కోసం అనేక కోచింగ్‌ సంస్థల నుంచి శిక్షణ తీసుకుని వేలాది మంది యువత రిక్రూట్‌మెంట్‌ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వ ప్రకటన అశనిపాతంలా వచ్చిందని యువకులు అంటున్నారు. వారిలో 25 శాతం మందికి మాత్రమే ఉద్యోగం వస్తే మిగతా వారు మళ్లీ రోడ్డున పడాల్సి వస్తుందని, వారు సంఘవ్యతిరేక శక్తులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీకి నిరుద్యోగం పెద్దసమస్యగా మారిందని, ఇప్పుడు అనవసరంగా ఆర్మీలో తాత్కాలిక నియామకాల కోసం ప్రకటన చేసి యువతలో అగ్గి రాజేసినట్లయిందని వారు చెబుతున్నారు. బీజేపీకి ఇప్పటివరకు యువత ఎక్కువగా ఓటువేసిందని, కానీ ఇప్పుడు అదే యువత బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయని, రానున్న ఎన్నికల్లో యువత ఓట్లపై భరోసా పెట్టుకోలేమని బీజేపీ నేత ఒకరు చెప్పారు.


ఇప్పటివరకూ ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోయినా కనీసం సైన్యంలో క్రమం తప్పకుండా నియామకాల గురించి ప్రకటనలు వచ్చేవని, ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయిందని అంటున్నారు. యువతను సంతృప్తిపరచడం కోసం సాగు చట్టాల మాదిరే అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోక తప్పదని రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, శరద్‌ యాదవ్‌ అనేక నేతలు డిమాండ్‌ చేశారు. బీహార్‌ ముఽఖ్యమంత్రి, బీజేపీ మిత్రపక్షం జేడీ(యూ) అధినేత అయిన నితీష్‌ కుమార్‌ కూడా అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి ప్రభుత్వం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. కాగా, యువత హింసను వీడి చర్చలకు రావాలని కేంద్ర సమాచార, ప్రసారమాధ్యమాల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చారు. వారి సాధకబాధకాలను సానుకూలంగా పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే పథకంలో మార్పులు కూడా చేస్తుందన్నారు.

Updated Date - 2022-06-19T08:23:29+05:30 IST