‘నకిలీ’ బెడద!

ABN , First Publish Date - 2022-06-26T06:07:20+05:30 IST

జిల్లా రైతులను నకిలీ విత్తనాల బెడద వెంటాడుతోంది. వ్యవసాయ శాఖకు ముందు చూపు లేక పోవడంతో రైతులు నట్టేట మునుగుతున్నారు.

‘నకిలీ’ బెడద!
తలమడుగులో మొలకెత్తని విత్తనాలను పరిశీలిస్తున్న అధికారులు

నకిలీ విత్తనాలు నట్టేట ముంచడంతో దిక్కులు చూస్తున్న రైతులు

కట్టడి చేయడంలో వ్యవసాయ శాఖ విఫలం

విత్తన వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు?

వ్యవసాయ శాఖ వైఫల్యాలపై అన్నదాతల మండిపాటు


ఆదిలాబాద్‌, జూన్‌25:(ఆంధ్రజ్యోతి) : జిల్లా రైతులను నకిలీ విత్తనాల బెడద వెంటాడుతోంది. వ్యవసాయ శాఖకు ముందు చూపు లేక పోవడంతో రైతులు నట్టేట మునుగుతున్నారు. విత్తనాలు మొలకెత్తక, కాత, పూత సరిగా రక పోవడంతో నష్టాల పాలవుతున్నారు. నకిలీ విత్తనాల దందా ప్రతి యేటా జిల్లాలో వెలుగు చూస్తున్న అధికారులు కట్టడి చేయడంలో విఫలమవుతూనే ఉన్నారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తూ ప్రతీ మండలానికి వ్యవసాయ శాఖ అధికారులను నియమించింది. అయినా ఆ శాఖ పని తీరు గాడిలో పడినట్లు కనిపించడం లేదు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయాన్ని అందించి రైతులను ఆదుకుంటోంది. రైతులు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల తోడ్పాటును అందిస్తోంది. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. తొలకరి పలుకరించడంతో ఎన్నో ఆశలతో సాగుకు సన్నద్ధమైన విత్తనం మొలకెత్తక పోవడంతో దిక్కులు చూడాల్సి వస్తోంది. జిల్లాలో  5లక్షల 71వేల 381 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో 81వేల ఎకరాలలో సోయా పంటను సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 5వేల ఎకరాలలో విక్రాంత్‌, ఈగల్‌ సోయావిత్తనాలు మొలకెత్త లేదని అధికారులు గుర్తించారు. నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేసిన విత్తనం నేల పాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ప్రతియేటా నకిలీ విత్తనాలను కట్టడి చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలం కావడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. 

అరకొరగానే తనిఖీలు..

వానాకాల సీజన్‌కు నెల రోజుల ముందే జిల్లాకు విత్తనాల సరఫరా అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అరకొరగానే తనిఖీలు చేయడంతో మళ్లీ నకిలీ విత్తనాల జోరు కనిపిస్తోంది. అధికారులు క్షేత్ర స్థాయిలో కఠినంగా వ్యవహరించి ఉంటే నకిలీ విత్తనాల జాడే ఉండేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో ఉన్నతాధికారుల ఆదేశాలతో అరకొరగానే తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకున్నారే తప్ప పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నకిలీ సోయా, పత్తి విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. అసలు నిబంధనల ప్రకారం మండల వ్యవసాయ శాఖాధికారులు విత్తనాలను సర్వీస్‌ శ్యాంపుల్స్‌గా తీసుకుని నాణ్యత పరీక్షలు చేసిన అనంతరమే మార్కెట్‌లో విత్తనాలను అమ్మేందుకు అనుమతించాల్సి ఉంటుంది. ఏదైనా అనుమానం వస్తే నకిలీ విత్తనాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి పరిస్థితికి దారి తీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖాధికారులు, విత్తన వ్యాపారులు నిర్లక్ష్యానికి అన్నదాతలు బలయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ విత్తనాలు మొలకెత్తక పోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా నష్ట పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. 

రైతులపై నెట్టేసే ప్రయత్నం..

జిల్లాలో వారం రోజులుగా నకిలీ సోయా విత్తనాలు మొలకెత్తడం లేదని రైతులు లబోదిబోమంటున్న వ్యవసాయ శాఖాధికారులకు మాత్రం పట్టింపే లేకుండా పోయింది. సరైన తేమలో సోయా విత్తనాలను వేయక పోవడంతోనే మొలకెత్తలేదన్న నేపంతో రైతులపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని చెబుతున్న వ్యవసాయ శాఖాధికారులు నకిలీ విత్తనాలను విక్రయించిన వ్యాపారులను ఇప్పటి వరకు ప్రశ్నించకుండానే వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విత్తన వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నకిలీ విత్తనాల వ్యవహరాన్ని తప్పుతోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యత పరీక్షల పేరిట కాలయాపన చేసి బడా వ్యాపారులను తప్పించే ప్రయత్నాలు కూడా సాగుతున్నట్లు వినిపిస్తోంది. రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన రశీదులతో పాటు విత్తన వ్యాపారి దుకాణం ముందు ధర్నా చేసిన అధికారుల్లో ఏ మాత్రం కదలిక కనిపించడం లేదు. తప్పుడు నివేదికలతో ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వ్యవసాయమే ప్రధానమైన జిల్లాకు పూర్తి స్థాయి వ్యవసాయ శాఖ అధికారిని నియమించకుండా ఇన్‌చార్జి అధికారితోనే నెట్టుకొస్తున్నారు.దీంతో వ్యవసాయ శాఖ పాలన పూర్తిగా పట్టుతప్పుతోంది. ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్న పుల్లయ్య ఆదిలాబాద్‌ ఏడీఏగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-06-26T06:07:20+05:30 IST