చేనేత కార్మికుల కడుపు కొట్టొద్దు

ABN , First Publish Date - 2021-07-24T06:19:28+05:30 IST

స్థానిక రాజకీయాలతో నేతన్న నేస్తం అందించకుండా కడుపు కొట్టడం అన్యాయమని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత కార్మికుల కడుపు కొట్టొద్దు
భాస్కరపేట సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న చేనేత కార్మికులు

శ్రీకాళహస్తి, జూలై 23: స్థానిక రాజకీయాలతో తమ కడుపు కొట్టడం అన్యాయమని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ భాస్కరపేట సచివాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకం కింద భాస్కరపేటలోని 30 చేనేత కుటుంబాలకు సాయం అందలేదని వాపోయారు. ఒక్కొక్కరి పేరిట ఐదారు విద్యుత్తు మీటర్లు ఉన్నట్లు చూపారని వాపోయారు. ఒక్క మీటరున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించినా స్థానిక రాజకీయాలతో సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఓ వర్గానికి వత్తాసు పలుకడమే ఇందుకు కారణమని మండిపడ్డారు. న్యాయం జరిగే దాకా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు లోకయ్య, వీరయ్య, రవి, వెంకటేశ్వర్లు, గురునాథం, బాలసుబ్బయ్య, శేషయ్య, సుధాకర, కందస్వామి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:19:28+05:30 IST