‘ఆప్’ ఎమ్మెల్యేలకు పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ హితబోధ

ABN , First Publish Date - 2022-03-12T03:06:16+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి..

‘ఆప్’ ఎమ్మెల్యేలకు పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ మాన్ హితబోధ

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ శుక్రవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. దురుసుగా ప్రవర్తించవద్దని, ఓటర్లతో గౌరవభావంతో మెలగాలని సూచించారు. మొహాలీలో జరిగిన ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.


ప్రజలతో ఎప్పుడూ దురుసగా ప్రవర్తించవద్దని, పార్టీలకు అతీతంగా ఓటర్లందరితోనూ గౌరవంగా మసలుకోవాలని సూచించారు. మన పార్టీకి ఓటేయని వారి కోసం కూడా పనిచేయాలని అన్నారు. 


 ఎమ్మెల్యేలు అందరూ చండీగఢ్‌కే పరిమితం కావొద్దని, గెలిచిన చోటే ఉంటూ ప్రజల కష్టనష్టాలు చూడాలని, వారి కోసం పనిచేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. ఎన్నికల ఫలితాలు నిన్న విడుదల కాగా, ‘ఆప్’ తుపాను సృష్టించింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.


ఈ సందర్భంగా నేడు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌మాన్ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 16న జరగనున్న ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 

Updated Date - 2022-03-12T03:06:16+05:30 IST