నిర్లక్ష్యం వద్దు!

Published: Tue, 27 Apr 2021 13:46:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్లక్ష్యం వద్దు!

ఆంధ్రజ్యోతి(27-04-2021)

వెళ్లిపోయింది అనుకున్న వైరస్‌ రెండోసారి విరుచుకుపడింది! ఈసారి రెట్టింపు వేగంతో విజృంభిస్తూ విలయం సృష్టిస్తోంది! అయితే తాజా కొవిడ్‌ వేగానికి అడ్డుకట్ట... అవగాహన, అప్రమత్తతలే అంటున్నారు వైద్యులు!


లక్షణాలు ఉండడం, లేకపోవడం... అనుమానించడానికి అవకాశం లేని కొత్త లక్షణాలతో అయోమయానికి లోను చేయడం తాజా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ స్వభావం. దాంతో ఇన్‌ఫెక్షన్‌ నిర్ధారణ ఆలస్యమవడం, ఫలితంగా ఎక్కువ మందికి ఇన్‌ఫెక్షన్‌ ప్రబలడం సెకండ్‌ వేవ్‌లో జరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి పరిస్థితి ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉంది. కొత్త వైరస్‌, దాని స్వభావాల గురించి అవగాహన కొరవడడం మూలంగా నెలకొన్న భయాలు, కొవిడ్‌ మరణాలు, లాక్‌డౌన్‌ కారణంగా వ్యాధి విస్తరణ క్రమేపీ తగ్గింది. నిజానికి అదే తరహా అప్రమత్తత ఇప్పుడు కూడా కొనసాగించగలిగితే వైరస్‌ వ్యాప్తిని నిలువరించగలిగేవాళ్లం. కానీ వైరస్‌ మీద పై చేయి సాధించామనే ధీమా, అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు, చికిత్స మీద పెరిగిన అవగాహన మూలంగా కరోనా గురించిన భయాలు చాలా మేరకు తగ్గి, నిర్లక్ష్య ధోరణి పెరిగింది. కాబట్టే సెకండ్‌ వేవ్‌లో కరోనా వేగాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నాం. నిజానికి మునుపటి ఏడాదితో పోలిస్తే బాధితుల సంఖ్య పరంగా వేగం పెరిగినా, కొవిడ్‌ మరణాల శాతం బాగా తగ్గింది. అయినప్పటికీ ఈ పరిస్థితి తలెత్తడానికి పూర్తి బాధ్యత మనదే! 


కొత్త లక్షణాలు...

జ్వరం, దగ్గు లాంటి ప్రధాన కొవిడ్‌ లక్షణాలకు తోడు ఈసారి మరికొన్ని కొత్త లక్షణాలు తోడయ్యాయి. రుచి, వాసన కోల్పోవడం, విరేచనాలు, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, కడుపులో వికారం లాంటి లక్షణాలను కూడా కొవిడ్‌ లక్షణాలుగా అనుమానించాలి. 

నిర్లక్ష్యం వద్దు!

కుటుంబం మొత్తానికీ కొవిడ్‌?

వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఐదు రోజుల వరకూ లక్షణాలు బయల్పడవు. ఆలోగా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ ప్రబలుతుంది. సెకండ్‌ వేవ్‌ కొవిడ్‌లో ఎక్కువ మందిలో లక్షణాలే కనిపించని పరిస్థితి. దాంతో కొవిడ్‌ సోకినా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమయ్యే వరకూ తెలియడం లేదు. ఆలోగా ఇంటిల్లిపాదికీ ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు స్వల్ప లక్షణాలు కనిపించినా కొవిడ్‌ పరీక్ష నెగటివ్‌గానే వస్తుంది. ఇందుకు కారణం వారిలో వైరల్‌ లోడ్‌ పరీక్షకు సరిపడా పెరగకపోవడమే! అయితే ఈ కోవకు చెందినవాళ్లు నెగటివ్‌ ఫలితం వచ్చినంత మాత్రాన కొవిడ్‌ రాలేదనే నిర్ధారణకు రాకుండా మొదట తమను తాము ఇతర కుటుంబసభ్యుల నుంచి ఐసొలేట్‌ చేసుకోవాలి. హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన చికిత్సను కొనసాగించాలి. ఈ సమయంలో ఎటువంటి కొత్త ఆరోగ్య సమస్య తలెత్తినా, అదెంత స్వల్పమైనదైనా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే సమయంలో అస్వస్థతకు లోనైనా కరోనాగానే అనుమానించి, చికిత్స మొదలుపెట్టాలి. కొవిడ్‌ పరీక్ష ఫలితం కోసం ఎదురుచూడకుండా, వెనువెంటనే చికిత్స మొదలుపెడితే వైరస్‌ వ్యాప్తితో పాటు, కుదేలయ్యే ఆరోగ్యాన్ని ప్రారంభంలోనే కాపాడుకోవచ్చు. 


సొంత వైద్యం చేటే!

కొవిడ్‌ పాజిటివ్‌ ఫలితం వచ్చినా, మెడికల్‌ షాపులో మందులు కొనుక్కుని వాడేయడం సరి కాదు. కొవిడ్‌ సోకిన వారానికి కొవిడ్‌ పరీక్ష చేయించుకుని, ఆ తర్వాత వారం రోజుల పాటు మందులు వాడుకుంటూ కూర్చుంటే, కరోనా సోకి 14 రోజులయినట్టు లెక్క. శరీరంలో వైరస్‌ విపరీతంగా విజృంభించి, అవయవాలను ధ్వంసం చేయడానికి ఈ సమయం సరిపోతుంది. ఇలా సొంత వైద్యాన్ని కొనసాగిస్తే, హఠాత్తుగా ఆక్సిజన్‌ లెవల్‌ పడిపోయి, పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు దొరకని ప్రస్తుత పరిస్థితిలో ఇలా ఆరోగ్యాన్ని కుదేలు చేసుకోవడం సమంజసం కాదు. పైగా ఈ స్థితికి చేరుకున్న వారికి చికిత్స కూడా క్లిష్టమవుతుంది. గత ఏడాది వైద్యుల సూచనల మేరకు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న బాధితులు ఆక్సిజన్‌ లెవెల్స్‌ ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించారు. కానీ ఈ ఏడాది కొవిడ్‌ బాధితుల ధోరణి మారింది. ఆక్సిజన్‌ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయే వీలున్న బాధితులను ఆస్పత్రిలో చేరమని వైద్యులు సూచిస్తున్నా, వారి మాటలు పెడచెవిన పెడుతున్న దుస్థితి. బాగైపోతుందిలే! అనే నిర్లక్ష్య ధోరణితో ఇంటికే పరిమితమైతున్న వాళ్లు, చివరకు పరిస్థితి విషమించి, ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. 


వాట్సాప్‌ సందేశాలు నమ్మవద్దు!

కరోనా పట్ల అపోహలు, అవాస్తవాలు విపరీతంగా విస్తరించడంలో ప్రధాన పాత్ర సామాజిక మాధ్యమాలదే! కరోనా వైరస్‌ను చంపే చిట్కాలు, గృహవైద్యాలు లాంటివి వీటిలో ఎక్కువగా ప్రచారమవుతూ ఉంటాయి. వీటిని గుడ్డిగా ఆచరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాళ్లూ ఉన్నారు. కొవిడ్‌కు సంబంధించిన ఎలాంటి సందేశమైనా, దాన్ని విశ్లేషించి, వాస్తవాలతో సరిపోల్చుకోవాలి. కొవిడ్‌కు సంబంధించిన సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్లు, లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లను సర్చ్‌ చేయాలి. ఇరుగుపొరుగు సూచించే చిట్కాలు, వాట్సాప్‌ సందేశాలలో పేర్కొన్న వైద్యాలను అనుసరించడం సరి కాదు. అలాగే కొవిడ్‌ వ్యాప్తి, మరణాలు కళ్ల ముందు కనిపిస్తున్నా... ‘అలాంటి వ్యాధి లేదు, ఇదంతా ఓ ప్రచారం’ అని నమ్మే ఓ వర్గం కూడా ఉంటోంది. ఇలాంటి ధోరణితో వ్యాధి సోకినా పట్టించుకోకుండా, తమతో పాటు చుట్టూ ఉండే వాళ్లందరి ప్రాణాలకూ ప్రమాదం తెచ్చిపెడుతూ ఉంటారు. 

నిర్లక్ష్యం వద్దు!

ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌ టెస్ట్‌ కీలకం!

కొవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత పది రోజులకు ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌ పరీక్ష చేయించుకోవడం అవసరం. కొంతమందిలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ క్వారంటైన్‌ పూర్తయిన తర్వాత కూడా కొంత కాలం పాటు కొనసాగుతుంది. కాబట్టి కొవిడ్‌ నిర్ధారణ జరిగిన నాటి నుంచి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత పది రోజులకు లేదా హోమ్‌ క్వారంటైన్‌ ముగిసిన 10 రోజులకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. కరోనా సోకిన ప్రారంభంలో రక్తం గడ్డకట్టే స్వభావం ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు శరీరంలో కొనసాగుతుంది. కాబట్టే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రెండు నుంచి మూడు నెలల పాటు రక్తం పలుచనయ్యే మందులు కొనసాగించవలసి ఉంటుంది. అయితే కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా ఈ తత్వం ఎంతమేరకు ఉంది అనేది పరీక్షతో నిర్ధారించుకుంటే, మున్ముందు గుండె రక్తనాళాల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. 


వ్యాక్సిన్‌తో కొవిడ్‌ రాదు!

వ్యాక్సిన్‌ వేయించుకుంటే కొవిడ్‌ వచ్చింది అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంది. బలహీనపరిచిన కొవిడ్‌ వైరస్‌తో వ్యాక్సిన్‌ తయారైనా వ్యాక్సిన్‌ మూలంగా కొవిడ్‌ రావడం జరగదు. వ్యాక్సిన్‌ వేసే ప్రదేశంలో సామాజిక దూరం పాటించకపోవడం మూలంగా వైరస్‌ సోకే వీలుంది. అప్పటికి లక్షణాలు కనిపించకపోయినా, వ్యాక్సిన్‌ వేయించుకున్న నాలుగైదు రోజుల తర్వాత బయల్పడి, కొవిడ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అవుతూ ఉండడంతో వ్యాక్సిన్‌ వల్లే కొవిడ్‌ సోకిందనే తప్పుడు అభిప్రాయం ప్రచారమవుతోంది. వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఆస్పత్రుల్లో కాకుండా, వాటికి దూరంగా ఉండడం, వాటిలో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు అమలు చేస్తే కొవిడ్‌ సోకే అవకాశాలు తగ్గుతాయి. నిజానికి వ్యాక్సిన్‌ కోసమే కాదు, దేని గురించి క్యూలో నిలబడినా భౌతిక దూరం పాటించపోతే కరోనా తేలికగా సోకుతుంది.

నిర్లక్ష్యం వద్దు!

వ్యాక్సిన్‌ తర్వాత కూడా...

వ్యాక్సిన్‌ వేయించుకుంటే కరోనా సోకదు అనుకుంటే పొరపాటు. కొవిడ్‌తో పోరాడే యాంటీబాడీల తయారీని వ్యాక్సిన్లు పురిగొల్పుతాయి. అయితే ఇవి శరీరంలోకి చొరబడే వైరస్‌తో పోరాడి, వ్యాధి తీవ్రమవకుండా అడ్డుకుంటాయి. అంతేతప్ప వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోలేవు. అలాగే వ్యాక్సిన్‌తో శరీరంలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు తయారవడానికి సమయం పడుతుంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత రెండు వారాలకు వ్యాధితో పోరాడే పూర్తి స్థాయి యాంటీబాడీలు తయారవుతాయి. ఆలోగా వైరస్‌కు ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు, కొవిడ్‌ బారిన పడే వీలుంటుంది. కాబట్టి వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కూడా మాస్క్‌ ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు కూడా శుభ్రంగా ఉంచుకునే కొవిడ్‌ నియమాలు కొనసాగించాలి.


- డాక్టర్‌ విరించి విరివింటి,

క్లినికల్‌ కార్డియాక్‌ ఫిజీషియన్‌, 

హైదరాబాద్‌.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.