'వెనక్కి రావద్దు': గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై టీఎంసీ

ABN , First Publish Date - 2021-06-17T01:48:14+05:30 IST

పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్ ధనకర్‌కు మధ్య ఉప్పూనిప్పూగా ఉన్న..

'వెనక్కి రావద్దు': గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై టీఎంసీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, రాష్ట్ర గవర్నర్‌ జగ్దీప్ ధనకర్‌కు మధ్య ఉప్పూనిప్పూగా ఉన్న వ్యవహారం బుధవారం మరింత ముదిరింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ అక్కడ తాను కలిసిన ప్రముఖుల పేర్లను తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఇందుకు ప్రతిగా టీఎంసీ నేతలు...''గవర్నర్ సార్.. మాకో ఫేవర్ చేయండి. మీరు మళ్లీ వెనక్కి తిరిగి రావద్దు'' అంటూ ట్వీట్లు చేశారు.


నాలుగు రోజుల పర్యటనపై మంగళవారం రాత్రి ఢిల్లీకి ధన్‌కర్ వెళ్లారు. ఇందుకు కారణం ఏమిటనేది మాత్రం బయటకు రాలేదు. అయితే బుధవారంనాడు ఆయన వరుస ట్వీట్లలో తాను కేంద్ర మంత్రులను కలుసుకున్నట్టు చెప్పారు. కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో పలు అంశాలపై చర్చించానని ఒక ట్వీట్ చేశారు. పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను కలుసుకున్నట్టు మరో ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్‌పర్సన్‌ను కలుస్తున్నట్టు ఇంకో ట్వీట్ చేశారు.


రాజ్యంగం అంటే గౌరవమే లేదు...

కాగా, గవర్నర్‌పై టీఎంసీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రప్రభుత్వాన్ని ఎన్నడూ ఆయన పరిగణలోకి తీసుకోలేదని విమర్శించారు. రాజ్యాంగ సూత్రాలను గవర్నర్ ఉల్లంఘించారని పార్టీ ప్రతినిధి సౌగత రాయ్ ఆరోపించారు. మమత సర్కార్ తీసుకున్న అనేక నిర్ణయాలను గవర్నర్ తొక్కిపెట్టారని, ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ తరహాలోనివేనని ఆయన అన్నారు. ''రాజ్యాంగ అంటే ఏమాత్రం గౌరవం లేని గవర్నర్ ఇక్కడ ఉన్నారు. మన రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి. అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. అయితే ఆయన తన ఇష్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుంటారు. ఇలాంటి గవర్నర్‌ను మేము ఎప్పుడూ చూడలేదు'' అని ఘాటుగా ఆయన విమర్శించారు. ధన్‌కర్ వెనక్కి రావద్దని (ఢిల్లీ నుంచి) మరో నేత, లోక్‌సభ ఎంపీ మహువ మొయిత్ర అన్నారు. ''అంకుల్‌జీ 15న ఢిల్లీ వెళ్లారు. మాకో ఫేవర్ చేయండి. వెనక్కి తిరిగి రావద్దు'' అని మొయిత్ర ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల ధన్‌కర్‌ను కలిసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-06-17T01:48:14+05:30 IST