‘ప్రసూతి ఆస్పత్రి’ జోలికొస్తే సహించం

ABN , First Publish Date - 2022-08-17T06:56:10+05:30 IST

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనంలో తాత్కాలిక కార్పొరేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామంటే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు.

‘ప్రసూతి ఆస్పత్రి’ జోలికొస్తే సహించం
ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నారాయణ తదితరులు

- మున్సిపల్‌ అధికారులేమైనా వీధి రౌడీలా?  జూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

- కార్పొరేషన్‌ బోర్డును తొలగిస్తున్న మహిళా నేతలు

 తిరుపతి సిటీ, ఆగస్టు 16: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనంలో తాత్కాలిక కార్పొరేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామంటే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. పైగా మహిళలు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో మున్సిపల్‌ అధికారులు రౌడీల్లా రాత్రికి రాత్రే బోర్డులు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతిలోని స్విమ్స్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న పాత ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగర పాలక సంస్థ కార్యాలయంగా మారుస్తూ ఇటీవల బోర్డులు ఏర్పాటు చేసిన విషయంపై మంగళవారం పార్టీ నేతలతో కలిసి ఆస్పత్రి ముందు బైఠాయించి, నిరసన తెలిపారు.  స్విమ్స్‌ వంటి ఆస్పత్రుల్లో కూడా చేయలేని పెద్ద పెద్ద ఆపరేషన్లను ఇక్కడ చేస్తున్నారని చెప్పారు. పైగా రుయా, బర్డ్‌, స్విమ్స్‌ వంటి ఆస్పత్రుల సమూహంలో ఈ భవనం ఉండటంతో మహిళలు వైద్య చికిత్సలు పొందేందుకు ఎంతో అనువుగా ఉందన్నారు. అలాగే తిరుమలకు వచ్చే మహిళా యాత్రికులకు అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు కూడా ఉపయోగకరంగా ఉందన్నారు. ఆస్పత్రికి 40 పీజీ సీట్లు వచ్చాయని.. ఈ భవనం లేకుంటే ఆ విద్యార్థులు వైద్య విద్యను ఎక్కడ అభ్యసించాలని ప్రశ్నించారు. ఆస్పత్రిలో ఓ పక్క మహిళలు, మరో పక్క కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతుంటే ఇష్టానుసారంగా బోర్డులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. మున్సిపల్‌ కార్యాలయంగా మార్చడానికి ప్రతిపాదించిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఉంటే ఆమెను కూడా మహిళల పాలిట ద్రోహిగా పరిగణిస్తామన్నారు. వెంటనే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీపీఐ మహిళా నేతలు ఆస్పత్రి భవనం పైకెక్కి నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన బోర్డును చించేశారు. భవనంపై నుంచి ఎమ్మెల్యే, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రసూతి ఆస్పత్రి జోలికి వస్తే ఏ మహిళా ఊరుకోదని హెచ్చరించారు. అనంతరం తొలగించిన బోర్డును ఆస్పత్రి ముందే తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నాయకులు డి.రామానాయుడు, మురళి, విశ్వనాథ్‌, రాధాకృష్ణ,  మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

తాత్కాలికమే.. రాద్ధాంతం చేయొద్దు : ఎమ్మెల్యే

తిరుపతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తిరుపతి నగరపాలక సంస్థకు కొత్త భవన నిర్మాణం జరగనున్న నేపథ్యంలో ఏడాదిపాటు తాత్కాలికంగా ఖాళీగా ఉన్న పాత ప్రసూతి ఆస్పత్రిలో పౌర సేవలు అందించనున్నామని ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. ప్రసూతి ఆస్పత్రిలోకి కార్పొరేషన్‌ కార్యాలయం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై ఆయన స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పాత ప్రసూతి ఆస్పత్రిలో కొంతమంది కొవిడ్‌ రోగులు ఉన్నట్టు తెలిసిందని, వారు డిశ్చార్జ్‌ అయ్యాకే మార్పుచేస్తామన్నారు.ప్రసూతి ఆస్పత్రిని కార్పొరేషన్‌ సొంతం చేసుకోదని, ప్రజల ఆరోగ్యంపట్ల తమకు కూడా బాధ్యత ఉందన్నారు.ఐదు లక్షలమంది తిరుపతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్‌ భవన నిర్మాణ ఆలస్యానికి కారణం కావద్దని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరలో పాత ప్రసూతి ఆస్పత్రికి కార్పొరేషన్‌ కార్యాలయాన్ని మార్పు చేస్తామని, కొత్త భవనం పూర్తయ్యేవరకు అక్కడి నుంచే పౌర సేవలు అందిస్తామన్నారు. 


Updated Date - 2022-08-17T06:56:10+05:30 IST