బెల్లం వ్యాపారులు, రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2022-05-17T06:50:05+05:30 IST

బెల్లం వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం సహకరించాలని జాగరీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జయచంద్రనాయుడు, నేతలు కోరారు.

బెల్లం వ్యాపారులు, రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎస్పీ రిషాంత్‌రెడ్డికి వినతిపత్రాన్ని ఇస్తున్న బెల్లం మండీ వ్యాపారులు

ఎస్పీ రిషాంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన వ్యాపారులు

చిత్తూరు, మే 16: బెల్లం వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న తమకు ప్రభుత్వం సహకరించాలని జాగరీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జయచంద్రనాయుడు, నేతలు కోరారు. ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డితో కలిసి సోమవారం ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కలిసి రైతులు, బెల్లం వ్యాపారుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా బెల్లం వ్యాపారులకు ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు నోటీసులిచ్చారే తప్ప అమ్మకూడదని ఇబ్బంది పెట్టలేదన్నారు. బెల్లం అమ్మకూడదని చెప్పడం వల్ల వేలాది మంది రైతులు, వ్యాపారులు పూర్తిగా రోడ్డున పడతారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రొయ్యల పెంపకానికి, ఆయుర్వేద మందులకు నల్లబెల్లాన్ని వినియోగిస్తారని వ్యాపారులు చెప్పగా అమ్ముకోవచ్చునని ఎస్పీ సమాధానమిచ్చారు. తెల్లబెలాన్ని కూడా దుకాణాలు, ఇతరత్రా అవసరాలకు అమ్ముకోవచ్చునని తెలిపారు. సారా తయారీదారులకు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎస్పీని కలిసిన వారిలో బెల్లం వ్యాపారుల సంఘ నేతలు బాలకృష్ణారెడ్డి, టీజీ భాస్కర్‌, టీజీ శివప్రసాద్‌, టీజీ శోభన్‌బాబు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:50:05+05:30 IST