వైసీపీ బెట్టు

ABN , First Publish Date - 2022-05-25T06:17:35+05:30 IST

ఎన్నికల వరకే రాజకీయాలు. తర్వాత అభివృద్ధి పైనే దృష్టి పెడతామంటూ నాయకులు హామీలు గుప్పిస్తుంటారు.

వైసీపీ బెట్టు
వీరవాసరం మండలం బొబ్బనపల్లిలో రాళ్లు పైకిలేచిన రహదారి

అభివృద్ధి పనులకు శాపం

మండల పరిషత్‌లో అభివృద్ధి పనులకు తీర్మానం చేసినా ఫలితం లేదు

కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి

కలెక్టర్‌కు ఎంపీపీ, ఎంపీటీసీల ఫిర్యాదు

అభివృద్ధి పనులకు మోక్షమెప్పుడో..


ఎన్నికల వరకే రాజకీయాలు. తర్వాత అభివృద్ధి పైనే దృష్టి పెడతామంటూ నాయకులు హామీలు గుప్పిస్తుంటారు. వాస్తవంలోకి వస్తే ఎప్పుడైనా...ఎక్కడైనా... రాజకీయాలే శిరోధార్యంగా మారిపోతున్నాయి. అభివృద్ధిలోనూ తమ రాజకీయ ముద్ర ఉండాలన్న తహతహ  సాధారణమైపోతోంది. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో ఇదే జరుగుతోంది. రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ అధికారంలో ఉన్నామంటూ వైసీపీ దర్పం ప్రదర్శిస్తోంది. మండల అభివృద్ధికి  ఇప్పుడదే అవరోధంగా పరిణమించింది. చట్టబద్ధంగా ఎన్నికైన మండల పరిషత్‌ తీర్మానాలకు విలువ లేకుండా పోయింది. అభివృద్ధి  రాజకీయ రంగు పులుముకుంది.  దాదాపు రూ.1.75 కోట్లు విలువైన పనులకు తీర్మానం చేసిన మండల పరిషత్‌ ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ చుట్టూ తిరగాల్సి వస్తోంది. 


 (భీమవరం–ఆంధ్రజ్యోతి)

భీమవరం శాసనసభ స్థానం వైసీపీ వశమైతే అందులో ఒక మండలమైన వీరవాసరం గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేనల పరమైంది.  సర్పంచ్‌లు జనసేన నుంచి అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కూటమిలో భాగంగా  మండల పరిషత్‌ తెలుగుదేశం వశమైంది. ఈనేపథ్యంలో వీరవాసరం ఎంపీపీ భర్త వీరవల్లి చంద్రశేఖర్‌పై నమోదవుతున్న కేసుల వెనుక అధికార పార్టీ హస్తం ఉందంటూ తెలుగుదేశం గళమెత్తుతోంది. రాజకీయపరంగానే కేసులు నమోదు చేస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులు ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం నాయకుని కేసుల విషయమై మండలంలో నిర్వహించే సమావేశాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. స్థాయిని మరచి ఎమ్మెల్యే కేసులను ప్రస్తావించారంటూ తెలుగుదేశం నాయకులు కౌంటర్‌  ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రభావం అభివృద్ధిపైనా పడుతోంది. జనవరిలో మండల పరిషత్‌ ఆమోదించిన అభివృద్ధి పనులకు ఇప్పటిదాకా మోక్షం లభించలేదు. అధికారులనుంచి సహాయనిరాకరణ ఎదురవుతోంది. వైసీపీ నేతల ఆదేశాలతోనే అధికారులు కినుకవహిస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులు విశ్వసిస్తున్నారు. 

గడచిన జనవరిలో మండల పరిషత్‌ సమావేశం నిర్వహించారు. అందులో రూ.1.75 కోట్ల విలువైన పనులకు ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత ఎంపీడీవో ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలి. సంబంధిత పంచాయతీలు తీర్మానించి ప్రతిపాదనలు పంపాలి. అప్పుడే పనులు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. వీరవాసరం మండలంలో మాత్రం జనవరిలో ఆమోదించిన పనులకు ఇప్పటిదాకా ప్రొసీడింగ్స్‌ జారీ కాలేదు.  దీనిపై మండల పరిషత్‌ అధ్యక్షురాలితో సహా, ఎంపీటీసీలంతా స్పందనలో రెండు పర్యాయాలు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. అభివృద్ధి ఆగిపోతుందంటూ ఆవేదన వెలిబుచ్చారు. సొంత నిధులతోనూ పనులు చేయించలేని పరిస్థితిలో మండల పరిషత్‌ ఉంది.  అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రజలకు మౌలిక వసతులు అందడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం పంచాయతీల నుంచి ఆర్థిక సంఘం నిధులను తీసేసుకుంది. అభివృద్ధి పనులు నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలు అల్లాడిపోతున్నాయి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో మండల పరిషత్‌ నిధులతో కాస్తయినా అభివృద్ధి జరుగుతుందనకుంటే వీరవాసరం మండలంలో  నెలకొన్న రాజకీయం ప్రధాన అడ్డంకిగా మారింది. 

Updated Date - 2022-05-25T06:17:35+05:30 IST