Shocking : ఈ Ladies కు పొరపాటున కూడా లిఫ్టు ఇవ్వకండి.. ఒకవేళ ఇచ్చారో..!

ABN , First Publish Date - 2022-05-23T21:00:58+05:30 IST

ఆధునిక వస్త్రధారణతో ఆకర్షిస్తారు. వాహనాన్ని ఆపి చందా ఇమ్మంటారు.. లేదా లిఫ్టు కావాలంటూ అడుగుతారు. మాటా మాటా కలుపుతారు..

Shocking : ఈ Ladies కు పొరపాటున కూడా లిఫ్టు ఇవ్వకండి.. ఒకవేళ ఇచ్చారో..!

  • లిఫ్టు ఇచ్చారో.. జేబులు ఖాళీ
  • డబ్బిస్తే ఓకే...లేకుంటే బెదిరింపు.. 
  • కొంతమంది యువతుల బ్లాక్‌మెయిలింగ్‌ 
  • నగర శివార్లలో వెలుగు చూస్తున్న ఘటనలు

హైదరాబాద్‌ సిటీ : ఆధునిక వస్త్రధారణతో ఆకర్షిస్తారు. వాహనాన్ని ఆపి చందా ఇమ్మంటారు.. లేదా లిఫ్టు కావాలంటూ అడుగుతారు. మాటా మాటా కలుపుతారు.. అవకాశం చూసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. బెదిరించి డబ్బులు కాజేస్తారు. ఇలాంటి సంఘటనలు ఇతర రాష్ట్రాల్లో... ఇతర జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. తాజాగా... గుంటూరు (Guntur) జిల్లా పెదకాకానిలో వాహనదారుల్ని బోల్తా కొట్టిస్తున్న ఓ కి‘లేడీ’ గ్యాంగ్‌ ఆట కట్టించారు పోలీసులు. వాహనదారులను ఆపి మాటల్లోకి దింపి... పిల్లల కోసం డొనేషన్‌ పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. డబ్బులిస్తే ఓకే.... లేకుంటే.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి గ్యాంగుల పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. 


శివారు ప్రాంతాల్లో..

నగరంలో ఇలాంటి కేసులు వెలుగు చూడనప్పటికీ... శివారు ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులకు సాయం చేసే ఉద్దేశంతో లిఫ్టు ఇచ్చే వారిని సైతం దోచుకునే మహిళా గ్యాంగులు తెరపైకి వచ్చాయి. కొంతమంది మహిళలు రాత్రి సమయాల్లో రోడ్ల పక్కన నిల్చొని లిఫ్టు అడుగుతున్నారు. మహిళే కదా అని కనికరించారో.. ఇక అంతే సంగతులు.... జేబు గుల్ల చేయడమే కాకుండా... ఎదురు తిరిగితే అత్యాచారయత్నం కేసు కూడా పెడతానని బెదిరిస్తున్నారు. పరువు పోతుందనే భయం.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో చాలామంది జేబులు ఖాళీ చేసుకుని వారిని వదిలించుకుంటున్నారు. మరికొందరు పోలీసులకు ఫోన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు స్పందించకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాంటి మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని... లిఫ్టు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. 


అమాయకుల్లా నటన..

ఈ గ్యాంగుల్లో అనేకమంది మహిళలు ఉన్నప్పటికీ... రోడ్డుపైకి ఒక్కొక్కరే వస్తారు. అంతగా జనసంచారం లేని ప్రాంతంలో అమాయకురాలిగా నటిస్తూ చందా అడుగుతారు. ఇవ్వకుంటే కదలనివ్వకుండా అడ్డుకుంటారు. తప్పించుకుని పోయే ప్రయత్నం చేస్తే అరుస్తామంటూ... టీజ్‌ చేసినట్లు.. లేదా ఇంకో విధంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకుంటారు. ముఖాన్ని అంతగా గుర్తించకుండా ఫేస్‌ మాస్కుతో పాటు తలపై వస్త్రాన్ని కప్పుకుంటారు. కొంతమంది బురఖా ధరించి కూడా మోసాలకు పాల్పడుతున్నారు.


గ్యాంగు సభ్యులు అనుసరిస్తారు..

ఒక్క మహిళే కదా అనుకునే పరిస్థితి లేదని బాధితులు చెబుతున్నారు. లిఫ్టు అడిగి వాహనం ఎక్కిన తరువాత దిగేవరకూ ఆమెను గ్యాంగు సభ్యులు అనుసరిస్తారు. ఏదైనా గొడవ జరిగితే ఆమెను రక్షించడానికి.. వాహనదారుడ్ని తప్పు బట్టడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చేతులకు.. కాళ్లకు దెబ్బలు తగిలించుకుని దాడి చేశాడంటూ వాహనదారుడిపై అభాండం వేస్తారు. స్థానికుల నుంచి సానుభూతి పొందేందుకు ఇలా చేస్తుంటారు. అనవసరంగా లిఫ్టు ఇచ్చి సమస్యలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు  సూచిస్తున్నారు.

Updated Date - 2022-05-23T21:00:58+05:30 IST