న్యాయవ్యవస్థకు పాఠాలు చెప్పొద్దు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-22T00:45:08+05:30 IST

న్యూఢిల్లీ : ‘‘న్యాయవ్యవస్థకు పాఠాలు చెప్పొద్దు. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటే సాదరంగా ఆహ్వానించబోం’’ అని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్ట్ మండిపడింది

న్యాయవ్యవస్థకు పాఠాలు చెప్పొద్దు.. కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : ‘‘న్యాయవ్యవస్థకు పాఠాలు చెప్పొద్దు. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటే సాదరంగా ఆహ్వానించబోం’’ అని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్ట్ మండిపడింది. ఒక అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీ సుప్రీంకోర్ట్‌కు చెప్పజాలరని ఆక్షేపించింది. 1993 బాంబే పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం దాఖలు చేసిన పిటిషన్‌ను తొందరపాటు పిటిషన్‌గా కేంద్రం అభివర్ణించడాన్ని జస్టిస్ ఎస్‌కే కౌల్ తప్పుబట్టారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని, సరైన సమయంలో అందుబాటులో ఉన్న పరిష్కారాలను ఎంచుకుంటామని కేంద్ర హోంశాఖ చెప్పడాన్ని న్యాయమూర్తులు ఆక్షేపించారు. కావాలంటే సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్చుగల్‌ - భారత ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్ర ఉల్లంఘిస్తోందని, జైలు శిక్ష 25 ఏళ్లు మించుతోందంటూ అబూసలేం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌పై స్పందించిన కేంద్ర హోంశాఖ పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది. అబూసలేం పిటిషన్‌ను తొందరపాటు పిటిషన్‌గా పేర్కొంది. కావాలంటే సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొంది. ఈ విధంగా ఒక అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై న్యాయమూర్తులు మండిపడ్డారు. 


కేంద్ర ప్రభుత్వం నిస్సందేహంగా నిర్ణయాలు చెప్పాలి. కానీ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ పేర్కొన్న తీరు అసంబద్ధమని జడ్జీలు పేర్కొన్నారు. అబూసలేం దాఖలు చేసిన పిటిషన్‌పై జడ్జీలు సంజయ్ కిషన్ కౌల్, ఎంఎం సుంద్రేష్ విచారణ జరుపుతున్నారు. కాగా అబూసలేంకు విధించే జైలుశిక్ష 25 ఏళ్లకు మించదని పోర్చుగల్ కోర్టులకు నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే ఒప్పందానికి కట్టుబడతామని హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా సుప్రీంకోర్ట్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పోర్చుగల్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. అయితే 25 ఏళ్ల తర్వాత నవంబర్ 10, 2030 తర్వాత ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కాగా నవంబర్ 11, 2005లో పోర్చుగల్ ప్రభుత్వం అబూసలేంను భారత్‌కు అప్పగించింది. న్యాయపోరాటం తర్వాత ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. బాంబే పేలుళ్ల కేసులో 2017లో అబూ సలేం దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా 1993 బాంబే వరుస పేలుళ్లలో 257 మంది చనిపోగా దాదాపు 700 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థాలను అబూసలేం గుజరాత్ నుంచి బాంబే చేరవేసినట్టు తేలింది.

Updated Date - 2022-04-22T00:45:08+05:30 IST