Advertisement

చరిత్రకు మతం రంగు పులమవద్దు!

Sep 16 2020 @ 00:11AM

విమోచన పోరాట చరిత్రను హిందూ-ముస్లిం మత చరిత్రగా చిత్రీకరించడం చాల బాధాకరం. ఈ పోరాటంలో అనేకమంది ముస్లింలు సైతం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు, ప్రాణాలర్పించారు. ఇది స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటం. బాషా, సంస్కృతి, సాహిత్యాల పరిరక్షణకు చేసిన పోరాటం. రెండు వందలేళ్ళ బానిసత్వ సంకెళ్లను తెంచుకోవాలని చేసిన పోరాటం. ఈ చరిత్రను వక్రీకరించకూడదు. రాజకీయ కోణంలో చూడకూడదు. 


తెలంగాణ ప్రాంతంలో జాతీయ పతకాన్ని ఎప్పుడు ఎగురవేశామని ప్రశ్నిస్తే తొంభై తొమ్మిది శాతం మంది 15 ఆగష్టు 1947 అనే సమాధానం ఇస్తారు. కానీ తెలంగాణలో జాతీయ పతకాన్ని ఎగురవేసింది, తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించింది సెప్టెంబర్ 17వ తేదీన. హైదరాబాద్‌ సంస్థానంలో దాదాపు 224 సంవత్సరాల పాటు కొనసాగిన నిజాం నిరంకుశ పాలన ఈ ప్రాంతపు ఆచార వ్యవహారాలను, సంస్కృతిని అనేక ఆటుపోట్లకు గురి చేసింది. వీటిని తట్టుకొని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ సమాజం గొప్ప పోరాటమే చేసింది. ఈ అపూర్వ వారసత్వ సంపద గురించి నవతరానికి తెలియచెప్పాల్సిన బాధ్యత చరిత్రకారులపై, మేధావులపై, రచయితలపై ఎంతగానో ఉంది.  


మొదటి నిజాం ధనికుడు కాదు కాని ఇక్కడి ప్రజలను దోచుకోవడం ద్వారా చివరి నిజాం ప్రపంచంలో అత్యంత ధనికుడిగా మారాడు. నిజాం రాజుకు ఉర్దూ బాష మీద మక్కువ. ప్రజలు ఎక్కువమంది చదువుకుంటే తన ఉనికికే ప్రమాదమని భావించి ఉర్దూని అధికార బాష చేశాడు. ఆ రాజ్యంలో మత స్వేచ్ఛ లేదు. పత్రికలు లేవు. సరైన పాఠశాలలు లేవు. ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఉర్దూ బాషలోనే ప్రారంభమైంది. హిందువులు మాత్రమే పన్నులు కట్టాలి. ముస్లింలకు ఎలాంటి పన్నులు ఉండేవి కావు. ఇస్లాంలోకి మారితే ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇస్లాంలోకి మారమని మతమార్పిడిలకు పాల్పడేవారు.  


హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎందరో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజలను చైతన్యపరచటంలో తమవంతు పాత్ర నిర్వర్తించారు. వారిలో ముఖ్యులు కాళోజీ నారాయణ రావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచర్య, దాశరథి కృష్ణమాచార్య, మగ్దూం మొహియుద్దీన్, పి.వి. నరసింహారావు, బొమ్మకంటి సత్యనారాయణ, జమునా పురం కేశవరావు, రామానందతీర్థ, జలగం వెంగళ రావు లాంటి మహనీయులు. 


నిజాం నవాబు హైదరాబాద్‌ సంస్థానంలో ఉర్దూను అధికార భాషగా చేసి ఇతర భాషలను నిషేధించాడు. అయినప్పటికి మాడపాటి హనుమంతరావు నిజాం నవాబును ఎదిరించి తెలంగాణలో 4000 తెలుగు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేసి హిందువులందరికి విద్యను అందించాడు. తన ఆధ్వర్యంలో ఆంధ్ర మహసభను సమర్థంగా నడిపారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాం హయాంలో తెలుగు బాష నశించిపోతుందని భావించి, 1921లో ఆంధ్ర జనసంఘం స్థాపించడమేకాక, 1926లో 'గోల్కొండ' పత్రికను స్థాపించి ప్రూఫ్‌ రీడర్లు, అక్షరాలు పేర్చేవారు లేకున్నా అన్నీ తానై 1939 వరకు ఒక్కడే తెలుగులో వ్యాసాలు, సంభాషణలు రాసారు. వరంగల్‌కు చెందిన కాళోజి విద్యార్థిగా ఉన్నప్పుడే నిజాంకు వ్యతిరేకంగా వరంగల్‌లో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాడు. వందేమాతరం ఉద్యమంలో పనిచేసి ఆర్యసమాజ్‌లో కీలకంగా వ్యవహరించి 1945లో నిజాంకు వ్యతిరేకంగా ఆంధ్ర సార్వత్రిక పరిషత్‌ ద్వితీయ సభలను నిర్వహించాడు. వరంగల్ కోటలో జాతీయ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నించి నగర బహిష్కరణకు గురయ్యాడు. తెలంగాణ వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య నిజాంకు వ్యతిరేకంగా ‘‘నా తెలంగాణ కోటి రతనాలవీణ’’ అని ప్రకటించగా దాశరథి రంగాచార్య మా ‘‘నిజాం రాజు తరతరాల బూజు’’ అని ప్రకటించి హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజలను చైతన్యపరచి నిజాం నవాబుపై తిరుగుబాటు చేసేలా కృషి చేశారు. పండిట్ నరేంద్ర జీ ‘‘హైదరాబాద్ ఒక సువిశాలమైన జైలు’’ అని చేసిన వాఖ్య ఆనాటి సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. 


1932లో ఆర్య సమాజ్‌ హైదరాబాద్‌ సంస్థానంలో ప్రవేశించి వర్ణ వ్యవస్థకు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడింది. అంతేగాక, ఆ కాలంలో ‘‘అంజూమన్‌ ఇత్తెహదుల్‌ ముస్లీమన్‌’’ అనే సంస్థ హిందువులను ముస్లింలుగా మార్చుతుండగా ఆర్య సమాజ్‌ మతం మారిన హిందూవులను ‘‘శుద్ధి’’ కార్యక్రమం ద్వారా తిరిగి హిందూమతంలోకి తెచ్చింది. స్వామి రామానంద తీర్థ, పండిత నరేంద్రజీ, వందేమాతరం రామచంద్ర రావు, నారాయణ రావు పవర్, జగదీష్ ఆర్య లాంటి ఎందరో ఆర్య సమాజ నాయకులు అండర్ గ్రౌండ్‍లో ఉంటూ స్వాతంత్ర్యోద్యమానికి ఆయుధ సరఫరా చేసారు. 


బైరాన్‌పల్లి నరమేధం జరిగి 72 సంవత్సరాలవుతోంది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లిలో నరమేధం జరిగింది. నిజాం సైన్యం, రజాకార్లు మొత్తం 600 మంది గ్రామంపై మూకమ్మడిగా దాడి చేశారు. అయినా గ్రామ ప్రజలు భయపడకుండా ఎదురు తిరిగారు. కొందరు వీరమరణం పొందగా, కొందరిని నిజాం సైనికులు చెట్లకు కట్టేసి కాల్చి చంపారు. అనంతరం గ్రామంలో వయస్సులో ఉన్న ఆడవాళ్లందరినీ నడిబొడ్డుకు తీసుకు వచ్చి నగ్నంగా బతుకమ్మలు ఆడించారు. ఊరంతా చూస్తుండగా 63మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో మొత్తం 96మంది చనిపోయారు. తెలంగాణ పోరాట చరిత్రలో ఇది అత్యంత హేయమైన ఘటన. ఆదిలాబాద్ జిల్లాలో నిజాంకు వ్యతిరేకంగా రాంజీ గోండు, కొమురం భీంల సారథ్యంలో ‘‘జల్, జమీన్, జంగల్’’ కోసం గిరిజనులు చేసిన పోరాటాలు మరువలేనివి. నిజాం తూటాలకు అమరుడై దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచిపోయాడు. విసునూర్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం చాల గొప్పది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమాన్ని రగిలించిన సంఘటన పరకాల సంఘటన. మరో జలియన్ వాలా బాగ్‍గా ప్రసిద్ధి పొందిన ఈ సంఘటనలో భారత జాతీయ జెండాను ఎగురవేయోద్దన్న నిజాం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి 1500 మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. దీనితో రెచ్చిపోయిన నిజాం రజాకార్లతో అత్యంత పాశవికంగా దాడి చేయడంతో దాదాపు 22 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విద్యావంతుడైన షోయబుల్లాఖాన్‌ నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా సొంత పత్రిక ‘ఇమ్రోజ్‌’లో నిరంతరం ప్రజల తరఫున రాస్తుంటే జీర్ణించుకోలేని నిజాం అతన్ని హైదరాబాద్‌ నడిబొడ్డున హత్య చేయించాడు. 


స్వాతంత్య్రం తరువాత దేశంలోని 565 సంస్థానాలలో 562 సంస్థానాలు విలీనంకాగా, కశ్మీర్‌, హైదరాబాద్‌, జునాఘడ్‌ (గుజారాత్‌) స్వతంత్య్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ప్రధాని నెహ్రూ హైదరాబాద్ ఈ సంస్థానాల విలీన ప్రక్రియను ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‍కు అప్పగించారు. పటేల్ ఇది చర్చలతో జరిగే పని కాదని, మిలిటరీ చర్యే పరిష్కారం అని భావించి వెంటనే భారత సైన్యాన్ని రంగంలోకి దింపారు. ‘‘1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో’’ పేరిట భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలో దిగగా, మూడు రోజులపాటు ఎదిరించిన నిజాం సైన్యం తలవంచక తప్పలేదు. సెప్టెంబర్ 17న భారత్‍లో హైదరాబాద్ సంస్థానం విలీనమవుతుందని నిజాం రాజు ప్రకటించడంతో నిరంకుశ నిజాం పాలన అంతమైంది.  


ఈ విమోచన పోరాట చరిత్రను హిందూ-ముస్లిం మత చరిత్రగా చిత్రీకరించడం చాల బాధాకరం. ఈ పోరాటంలో అనేకమంది ముస్లింలు సైతం నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు, ప్రాణాలర్పించారు. ఇది స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చేసిన పోరాటం. బాషా, సంస్కృతి, సాహిత్యాల పరిరక్షణకు చేసిన పోరాటం. రెండు వంద లేళ్ళ బానిసత్వ సంకెళ్లను తెంచుకోవాలని చేసిన పోరాటం. ఈ చరిత్రను వక్రీకరించకూడదు. రాజకీయ కోణంలో చూడకూడదు. దీన్ని భావి తరాలకు అందించడం మన కర్తవ్యం. జై హింద్.

బండారు దత్తాత్రేయ

(వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్)

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.