మూడు రాజధానులు వద్దే వద్దు

ABN , First Publish Date - 2020-07-05T10:55:22+05:30 IST

మూడు రాజధానులు వద్దేవద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు

మూడు రాజధానులు వద్దే వద్దు

నాడు రాజధానికి  మద్దతిచ్చి ఇప్పుడు మోసం చేస్తావా?

సీఎం జగన్‌పై టీడీపీ నేతల ఫైర్‌

రైతుల త్యాగాలు వృధా కావు


కడప, జూలై4 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులు వద్దేవద్దని, అమరావతినే రాజధానిగా  కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నాడు ప్రతిపక్ష నేత హోదాలో అంగీకరించి, అధికారంలోకి వచ్చాక ఎందుకు మాటతప్పుతున్నావని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన  దీక్ష శనివారానికి 200 రోజులకు చేరుకుంది. వీరికి మద్దతుగా జిల్లాలో టీడీపీ నేతలు దీక్ష చేపట్టారు. కడపలోని కోఆపరేటివ్‌ కాలనీలో కడప అసెంబ్లీ ఇన్‌చార్జి వీఎస్‌ అమీర్‌బాబు ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు జిల్లా అఽధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావితరాల భవిష్యత్‌ కోసం, రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రజలు రైతులు 33వేల ఎకరాల భూములను త్యాగం చేశారన్నారు. రాజధానిని మారిస్తే సీఎం జగన్‌ చరిత్ర హీనుడుగా మారుతారన్నారు. టీడీపీ నాయకులు పీరయ్య, శివకొండారెడ్డి, జయచంద్ర, గురప్ప, రాజశేఖర్‌, జనార్ధన్‌రెడ్డి, వికాస్‌ హరి, కొమ్మలపాటి శివ, మీనాక్షి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.


అమరావతితనే కొనసాగించాలి

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా శనివారం హరిటవర్స్‌లో దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి, వై.రాంప్రసాద్‌, జనతాదళ్‌ నాయకులు ప్రతాప్‌రెడ్డి, సుబ్బరాయుడు ఆచారి, మాసా కోదండ తదితరులు పాల్గొన్నారు. 


రాజధాని అమరావతి ఒక్కటే...

ఖాజీపేట: రాష్ర్టానికి అమరావతి ఒకటే రాజధాని అని దానిని కొనసాగించకపోతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోకతప్పదని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా స్థానిక దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో శనివారం నిరశన దీక్ష చేపట్టారు. కొండపల్లి ఉమాకాంత్‌, రెడ్యం చంద్రశేఖర్‌ రెడ్డి, ముత్తూరు రఘురామిరెడ్డి, నంద్యాల సుబ్బయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


మూడు రాజధానులు వద్దు..

బద్వేలు: బద్వేలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. టీడీపీ నేతలు ఝాన్సీ, మల్లికార్జునరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, దానం  తదితరులు పాల్గొన్నారు.


అక్రమ కేసులు ఆపాలి...

రైల్వేకోడూరు: టీడీపీ నేతలపై అక్రమంగా పెడుతున్న కేసులను వెంటనే ఆపాలని, అమరావతిని రాజధానిగా ఉంచాలని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు డిమాండు చేశారు. శనివారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయం ఎదుట మహా దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రాజు, చిట్వేలి మండల పార్టీ అధ్యక్షుడు కేకే చౌదరి, రైల్వేకోడూరు మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మా శివ తదితరులు పాల్గొన్నారు. కాగా.. టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్‌ రైల్వేకోడూరులో వినూత్నంగా వైర్‌తో కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.


67 మంది రైతుల మరణాలు వృధాకావు

ప్రొద్దుటూరు క్రైం : రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేపట్టిన ఉద్యమంలో 67 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి మరణాలు వృధా కావని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మార్కెట్‌యార్డు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలో ఆయన స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమరావతి రైతులకు సంఘీభావంగా మహాదీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌రెడ్డి, బీసీ నేత బొర్రా రామాంజినేయులు, మైనార్టీ నాయకులు అమీర్‌బాష, పాలగిరి ఖాజా, తెలుగు యువత నాయకులు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T10:55:22+05:30 IST